
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెప్పోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం యాగశాలలో చతుస్థానార్చన, హోమం జరిపించారు. తర్వాత ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి వేదపారాయణం చేశారు. సాయంత్రం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళవాయిద్యాలు, కోలాటాలు, వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల రామనామస్మరణ నడుమ ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకెళ్లారు.
అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన పడవకు ఏఈవో శ్రావణ్‌కుమార్ పూజలు చేశారు. పడవ నడిపే వ్యక్తిని గుహుడిగా భావించి అతడికి స్వామివారి తరఫున శేషవస్త్రాలు అందజేశారు. అనంతరం స్వామివారిని పడవపై అధిష్ఠింపజేసి నదీ విహారం చేశారు. తర్వాత దోపు ఉత్సవం జరిపారు. అనంతరం స్వామి వారికి అశ్వవాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. రాజవీధి గుండా గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుని అక్కడ పూజలు చేసిన అనంతరం తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు.