‘‘కౌన్ బనేగా ఢిల్లీ సీఎం..?’’.. మహిళా ఎమ్మెల్యేను సీఎం చేసే యోచనలో బీజేపీ అధిష్టానం..?

‘‘కౌన్ బనేగా ఢిల్లీ సీఎం..?’’.. మహిళా ఎమ్మెల్యేను సీఎం చేసే యోచనలో బీజేపీ అధిష్టానం..?

న్యూఢిల్లీ: హస్తిన ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. కాబోయే సీఎం ఎవరనే విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో.. ‘‘కౌన్ బనేగా ఢిల్లీ సీఎం..?’’ అనే ప్రశ్నపై రోజుకొక పుకారు షికారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నపై తాజాగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే.. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ మహిళను కూర్చోబెట్టాలనే యోచనలో ఉందట. ‘‘ ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రిగా మహిళా ఎమ్మెల్యేకు అవకాశం’’ అని జాతీయ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ 48 మందిలో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నీలమ్ పహల్వాన్, రేఖా గుప్తా, పూనమ్ శర్మ, శిఖా రాయ్.. ఈ నలుగురూ బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు. ఈ నలుగురు బీజేపీ మహిళా ఎమ్మెల్యేల్లో ఒకరికి ఢిల్లీ సీఎం స్థానంలో కూర్చునే అవకాశం దక్కనుందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. బీజేపీ నుంచి గెలిచిన ఈ మహిళా ఎమ్మెల్యేలు వివరాలు క్లుప్తంగా..

* రేఖా గుప్తా  షాలిమర్ బాగ్ స్థానం నుంచి పోటీ చేసి 68,200 ఓట్లను సొంతం చేసుకున్నారు. ఆప్ అభ్యర్థి బంధన కుమారిని ఓడించారు.
* గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుంచి శిఖా రాయ్ పోటీ చేసి గెలిచారు. ఆమెకు మద్దతుగా 49,594 ఓట్లు పోలయ్యాయి. ఆప్ అభ్యర్థి సౌరబ్ భరద్వాజ్పై ఆమె గెలుపొందారు.
* పూనం శర్మ బీజేపీ అభ్యర్థిగా వాజిర్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 54,721 ఓట్ల మద్దతు కూడగట్టుకుని విజయం సాధించారు. ఆప్ అభ్యర్థి రాజేష్ గుప్తాపై పోటీ చేసి గెలిచారు.
* నీలమ్ పహల్వాన్ కు 1,01,708 ఓట్లు దక్కాయి. ఆప్ అభ్యర్థి తరుణ్ కుమార్ను ఓడించి నజఫ్గర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు.

ఈ నలుగురు మహిళా ఎమ్మెల్యేల్లో ఒకరు ముఖ్యమంత్రి అనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ సామాజిక వర్గ సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందనే వాదన ఉంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎమ్మెల్యేకు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని అప్పగించే ఆప్షన్ ను కూడా బీజేపీ పరిశీలిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో బీజేపీ నుంచి నలుగురు షెడ్యూల్డ్ క్యాస్ట్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. రాజ్ కుమార్ చౌహాన్(మంగోల్పురి), రవికాంత్ ఉజ్జయిన్(త్రిలోక్ పురి), రవీందర్ ఇంద్రజ్ సింగ్ (భావన), కైలాష్ గంగ్వాల్(మాదిపూర్) ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలవడం గమనార్హం.

ALSO READ | కేజ్రీవాల్ ఓటమి ఆతిశీకి సంతోషం: అనురాగ్ ఠాకూర్