నాగాలాండ్‌‌–2కి ఊపిరి!​

జమ్మూకాశ్మీర్​లో దాదాపు 70 ఏళ్లుగా అమల్లో ఉన్న రెండు స్పెషల్​ ఆర్టికల్స్​ని సెంట్రల్​ గవర్నమెంట్​ తీసేసింది. కానీ, అలాంటి ఆర్టికల్స్​ ఇంకా ఉన్నాయి. వాటిద్వారా కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హక్కులు పొందుతున్నాయి. జమ్మూ కాశ్మీర్​ లాగే ఆయా రాష్ట్రాల్లోనూ ప్రత్యేక హక్కులు పోతాయన్న భయాన్ని వేర్పాటువాదులు కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టికల్​–371ఏ కింద  నార్త్​ ఈస్ట్రన్​ రాష్ట్రాలున్నాయి. తమ రాష్ట్రానికి కూడా కాశ్మీర్​ అనుభవం ఎదురుకానుందేమోనని నాగాలాండ్​ ప్రజల్లో ఆందోళన మొదలైంది.  అయితే మోడీ సర్కార్​కి అలాంటి ఆలోచనేదీ లేదని సాక్షాత్తూ బీజేపీ సుప్రీం, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పార్లమెంట్​లో వారం కిందటే చెప్పారు. ‘ఆర్టికల్​–370, ​371 మధ్య పోలికే లేదు. కాబట్టి దాన్ని ముట్టుకోబోమని నార్త్​ ఈస్ట్​ సహా ఆర్టికల్​–371 పరిధిలోకి వచ్చే అన్ని రాష్ట్రాలకూ హామీ ఇస్తున్నా’ అని షా స్పష్టం చేశారు.

అయినాగానీ, నాగాలాండ్​ జనాల్లో, లీడర్లలో కలవరం తీరలేదు. తమ రాష్ట్ర అటానమీని చెడగొట్టొద్దని నాగా పీపుల్స్​ ఫ్రంట్​తోపాటు ఇతర పార్టీల నాయకులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

‘ఫ్రంటీర్​​ నాగాలాండ్’​పై ఆశలు

మోడీ సర్కారు లడఖ్​ను జమ్మూకాశ్మీర్​ నుంచి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చటంతో నాగాలాండ్​లోని ఐదు జిల్లాలు (త్యుయెన్​సంగ్​, మాన్​, లాంగ్​లెంగ్​, కిఫైర్​, నాక్​లాక్) కలిపి ‘ఫ్రంటీర్​​ నాగాలాండ్​’ పేరుతో సెపరేట్​ స్టేట్​ చేయాలని కోరుతున్నవారిలో కొత్త ఆశలు మొలకెత్తాయి. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఎన్​ఎస్​సీఎన్​) సహా ఈ డిమాండ్​ చేస్తున్న ఈస్టర్న్​ నాగాలాండ్​ పీపుల్స్​ ఆర్గనైజేషన్(ఈఎన్​పీఓ)తో కూడా కేంద్రం రాజకీయ చర్చలు జరుపుతుండటం గమనార్హం.

ఆర్.​ఎన్.​రవిని నాగాలాండ్​ గవర్నర్​గా నియమించటంతో ఆ రాష్ట్రంలోని రెబెల్స్​కు కూడా స్టేట్​ అడ్మినిస్ట్రేషన్​లో చోటు కల్పించాలని కేంద్రం ఆశిస్తున్నట్లు భావించొచ్చు. దీంతోపాటు ఆయన​కు ‘ఆర్టికల్​–371ఏ’ ప్రత్యేక అధికారాలు కల్పిస్తోంది. లా అండ్​ ఆర్డర్​ విషయంలో సీఎంని కూడా గవర్నర్​ ఓవర్​ రూల్​ చేసే పవర్ ఉంది. ఆయన నిర్ణయమే ఫైనల్​. త్యుయెన్​సంగ్ ఏరియాల్లోని అడ్మినిస్ట్రేషన్​లోనూ గవర్నర్​ నేరుగా జోక్యం చేసుకోవచ్చు. ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్రానికి ఇంతకు మించిన వెసులుబాటేమీ అవసరం లేదు. నాగాలాండ్​లో ప్రస్తుతం బీజేపీ కూటమే అధికారంలో ఉంది. దీనికితోడు ఆర్టికల్–371​ జోలికి పోబోమని కేంద్ర హోం మంత్రి చెప్పిన మాటను కూడా ఇక్కడ మరువకూడదు.

ఆర్టికల్​ 371తో ఈశాన్యానికి భరోసా

ఆర్టికల్​–370 మాదిరిగానే ఆర్టికల్​–371 కూడా భిన్నమైంది. ఇందులో ‘ఏ’ నుంచి ‘జే’ వరకు ఉన్న 10 సెక్షన్లు 10కి పైగా రాష్ట్రాలకు ప్రత్యేక, వేర్వేరు రక్షణలను కల్పిస్తున్నాయి. ఈ రాష్ట్రాల లిస్టులో నాగాలాండ్​ కూడా ఒకటి. ఆర్టికల్​–371ఏ ప్రకారం నాగాలాండ్ శాసనసభ పర్మిషన్​ లేకుండా నాగా ప్రజల విషయాల్లో పార్లమెంట్​ జోక్యం చేసుకోకూడదు. లోకల్​ కల్చర్​, ట్రెడిషన్స్​, రెలీజియన్​, సివిల్, క్రిమినల్​, ల్యాండ్ మ్యుటేషన్స్​ తదితర చట్టాలను మార్చకూడదు. తద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని ఆదివాసీ, గిరిజన​ సంప్రదాయాలకు సెక్యూరిటీ ఇవ్వాలన్నదే లక్ష్యం.

70 ఏళ్లుగా పోరాటం

ప్రత్యేక దేశం కోసం 16 నాగా తెగల ప్రజలు 70 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఇండిపెండెన్స్​ పొందాక ఆ రాష్ట్ర జనాలు ఇండియాలో కలవాలనుకోలేదు. నాగాలాండ్​ను ప్రత్యేక దేశంగా గుర్తించటానికి నెహ్రూ ఒప్పుకోలేదు. 1963 డిసెంబర్ 1న ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు. నాగా సంస్థలు అప్పటినుంచి ఫైట్​ చేస్తున్నారు. ఆ సంస్థల్లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ముఖ్యమైంది.

నాటి మధ్యవర్తే.. గవర్నర్​

ఆర్టికల్​–371ఏ ద్వారా అటానమీ స్టేటస్​ అనుభవిస్తున్న నాగాలాండ్​ ప్రజలు తమకు మరింత ఫ్రీడం కావాలని డిమాండ్​ చేస్తుంటారు. నాగాలతో గతంలో జరిపిన శాంతి చర్చల్లో నేషనల్​ సెక్యూరిటీ మాజీ డిప్యూటీ అడ్వైజర్​ ఆర్.​ఎన్.​రవి మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించారు. 2015 ఆగస్టు 3న కుదిరిన ఫ్రేమ్​ వర్క్​ అగ్రిమెంట్​ ఆధారంగా ఇండో–నాగా చర్చలను కొద్ది నెలల్లో కొలిక్కి తేవాల్సిన బాధ్యతని మళ్లీ రవికే అప్పగించింది కేంద్రం. ఎప్పటికప్పుడు నాగా సంస్థలతో చర్చలు, సంప్రదింపులు జరపటం కోసం ​ఆయనను నాగాలాండ్​కి గవర్నర్​గా ఈ మధ్యే పంపింది.