ఫాస్టుగా పెరిగేలా.. మస్తుగ పండేలా

ఫాస్టుగా పెరిగేలా.. మస్తుగ పండేలా
  • కొత్త రకం మొక్కలపై ప్రయోగాలు
  • ప్రపంచం తిండి అవసరాల కోసం

ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరుగుతోంది. 2050 నాటికి జనాభా 8 వందల కోట్లకు చేరుకోనుంది. మరి వాళ్లకు తగ్గట్టు తిండి కూడా ఉండాలిగా. ఇంత స్థాయిలో జనాభాకు ప్రస్తుతం పండిస్తున్న పంటల కన్నా మరో 60 నుంచి 80 శాతం అవసరం. జనాభా అయితే పెరుగుతోంది గానీ పండించే భూమి పెరగదుగా. పైగా కరువులు, పంటలకు రోగాలు, వాతావరణ మార్పులు. ఇలాంటి పరిస్థితుల్లో కావాల్సిన పంటలు పండించడం పెద్ద సవాలు. వీటన్నింటిని తట్టుకునే, తొందరగా పెరిగి ఎక్కువ దిగుబడినిచ్చే మొక్క రకాలను తయారు చేస్తేనే మున్ముందు ఆహార కొరత లేకుండా జీవించగలం. అందుకే ఇలాంటి మొక్కల కోసం ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ‘స్పీడ్‌ బ్రీడింగ్‌ టెక్నిక్‌’ పరిశోధనలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీకి చెందిన ప్లాంట్‌ జెనెటిసిస్ట్‌ లీ హిక్కీ బృందం కూడా ఈ తరహా ప్రయత్నమే చేస్తోంది. ఎక్కువ దిగుబడినిచ్చే, ఎక్కువ పోషకాలుండే, వ్యాధుల నిరోధకత ఎక్కువగా ఉండే విత్తనాలను తయారు చేయడానికి సాంప్రదాయ పద్ధతిలో పదేళ్లకు పైగా పడుతుంది. కానీ, టెంపరేచర్‌, కాంతిని కంట్రోల్‌ చేస్తూ తొందరగా పెరిగే మొక్కలను సృష్టించేందుకు హిక్కీ టీం ప్రయోగాలు చేస్తోంది. స్పేస్‌ స్టేషన్లలో ఆహారాన్ని ఉత్పత్తి చేసేందుకు నాసా వాడుతున్న టెక్నిక్‌నే వీళ్లు వాడుతున్నారు. రోజుకు 22 గంటల పాటు బ్లూ, రెడ్‌ ఎల్‌ఈడీ కాంతిని మొక్కలపై ప్రసరింపజేస్తున్నారు. టెంపరేచర్‌ను 62 నుంచి 72 ఫారెన్‌ హీట్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా చేసి ఆరు తరాల గోధుమ, బార్లీ, చిక్పీస్‌, కనోలా ఏడాదిలో పండించగలిగామని వీళ్లు గత నవంబర్‌లో వెల్లడించారు.

జీన్‌ ఎడిటింగ్‌తో ఈజీ

పూత సమయాన్ని తగ్గించేందుకు రీసెర్చర్లు జెనెటిక్‌ టెక్నాలజీలు వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేడిని తట్టుకునేలా మొక్కలను మారుస్తున్నారు. ఒకప్పటి క్రాస్‌ బ్రీడింగ్‌, పంట మార్పు పద్ధతుల టైం పోయింది. ఇప్పుడు కొత్త కొత్త క్రిస్పర్‌ వంటి జీన్​ ఎడిటింగ్​ టెక్నాలజీలొచ్చాయి. వాటితో మొక్క డీఎన్‌ఏలో ఏ భాగం వల్ల రోగాలొస్తాయో దాన్ని తొలగించేస్తున్నారు. హిక్కీ టీం కూడా ఈ టెక్నాలజీపై పని చేస్తోంది. బార్లీ, జొన్న పంటలపై ప్రయోగిస్తోంది. బొటానిస్ట్స్‌ 150 ఏళ్ల కిందట కృత్రిమ లైట్ల కింద మొక్కలను పెంచేవారని, ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందిందని హిక్కీ అన్నారు. ఎంత మేర లైట్‌ కావాలో, ఏ కోణంలో కావాలో,  ఏ రంగులో కావాలో కూడా సెట్‌ చేసుకునే టెక్నాలజీ మనదగ్గరుందని చెబుతున్నారు. ఇక్రిశాట్‌ సాయంతో ఇండియా, మాలి, జింబాంబ్వేల్లోని ప్లాంట్‌ బ్రీడర్లకు శిక్షణ ఇవ్వాలని హిక్కీ టీం భావిస్తోంది.  తద్వారా ఈ పంటలకు బీజం వేయాలని చూస్తోంది.