- జిల్లాలో అన్ని రోడ్లపై వాహనాలకు స్పీడ్ లిమిట్
ఖమ్మం, వెలుగు: జిల్లాలో వెహికల్స్ స్పీడ్ కంట్రోల్ చేసి, యాక్సిడెంట్స్ ను తగ్గించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలతో పాటు అన్ని ప్రధాన రహదారులపై స్పీడ్ లిమిట్ సెట్ చేసే పనిలో ఉన్నారు. రోడ్ భద్రతా చర్యల్లో భాగంగా ఆర్అండ్ బీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో సహా వివిధ డిపార్ట్ మెంట్ల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే జిల్లావ్యాప్తంగా స్పీడ్ లిమిట్ కంట్రోల్ చేసేందుకు 200 పాయింట్లను ఆఫీసర్లు గుర్తించారు. మరో రెండు, మూడు వారాల్లో ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ వస్తుందని, ఆ సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఒక్కసారి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయి, స్పీడ్ లిమిట్ కు సంబంధించిన రూల్స్ అమల్లోకి వస్తే జిల్లాలో ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే చలాన్లు..
గతేడాది కొత్తగా నిర్మించిన ఖమ్మం– సూర్యాపేట హైవేపై కొన్ని చోట్ల స్పీడ్ లిమిట్ ను సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు. ఖమ్మం సిటీలోని బైపాస్ తో పాటు, శ్రీశ్రీ సర్కిల్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ మీద గతంలో స్పీడ్ గన్స్ తో ఓవర్ స్పీడ్ వాహనాలకు చలాన్లు కూడా వేశారు. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ముందుగా స్పీడ్ లిమిట్ పెట్టబోతున్న ప్రాంతాలు, అక్కడ మ్యాగ్జిమమ్ స్పీడ్ కు సంబంధించిన వివరాలతో గెజిట్ విడుదల అవుతుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న మెటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఏ రోడ్డులో ఎంత స్పీడ్ లిమిట్ ఉంటుందో నివేదికను తయారు చేస్తారు. ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. ఆ తర్వాత బోర్డులను ఏర్పాటు చేస్తారు. అన్ని పోలీస్ స్టేషన్లకు స్పీడ్ లేజర్ గన్ లను అందుబాటులో ఉంచి, వాటి ద్వారా రెగ్యులర్ గా నిర్దేశించిన పాయింట్ లకు 100 మీటర్ల దూరంలో స్పీడ్ గన్ ల ద్వారా రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులకు చలాన్లు వేస్తారు. ఇప్పటికే జిల్లాలోని ప్రధాన రహదారులపై వైట్ స్ట్రిప్ లను, బారీకేడ్లను ఏర్పాటు చేయడం ద్వారా చాలా వరకు యాక్సిడెంట్స్ ను కంట్రోల్ చేశారు. 2021తో పోలిస్తే, 2022లో 45 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా 286 నుంచి 200కు తగ్గింది. ఈ ఏడాది ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు పోలీస్ ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు.
అవగాహన కల్పిస్తాం
జిల్లాలో రోడ్లపై స్పీడ్ లిమిట్ గురించి రెండు, మూడు వారాల్లో ఫైనల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. అది వచ్చిన తర్వాత ఆయా శాఖల సమన్వయంతో నిర్దేశించిన చోట్ల స్పీడ్ లిమిట్ ను సూచించే బోర్డులు ఏర్పాటు చేస్తాం. వాహనదారులకు అవగాహన కల్పించేలా ప్రచారం చేస్తాం. ఆ తర్వాతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం స్పీడ్ గన్ లను ఉపయోగించి పెనాల్టీలు విధిస్తాం. - విష్ణు ఎస్ వారియర్, సీపీ, ఖమ్మం
పాలేరు గడ్డపై కాషాయ జెండా ఎగరాలి
ఖమ్మం రూరల్, వెలుగు: పాలేరు గడ్డపై బీజేపీ జెండా ఎగరేసేందుకు బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు కోరారు. సోమవారం రూరల్ మండలం ఏదులాపురం క్యాంపు ఆఫీసులో పాలేరు అసెంబ్లీ స్థాయి శక్తి కేంద్ర ఇన్చార్జీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని అన్నారు.
బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలతో రూ. 45 వేల కోట్ల ఆదాయం దండుకుంటూ, ఆడబిడ్డల మెడలో పుస్తెలు తెంపుతోందని ఆరోపించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, పాలేరు ప్రభారీ ఎడ్ల అశోక్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, నున్నా రవి, గుండా శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఆనంతు ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు.
ఇంటర్ స్డూడెంట్స్‌కు ఫ్రీ కోచింగ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే సైన్స్ స్టూడెంట్స్‌కు జేఈఈ, నీట్, ఎంసెట్ ఎంట్రన్స్‌కు ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్టు ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సులోచనరాణి తెలిపారు. కొత్తగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సోమవారం కోచింగ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గవర్నమెంట్ కాలేజీల్లో పేద, మధ్య తరగతి పిల్లలే ఎక్కువగా చదువుకుంటున్నారని, వారికి స్టడీ మెటీరియల్‌తో పాటు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపాల్ కత్తి రమేశ్ పాల్గొన్నారు.
పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలి
ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లా ఆఫీసర్లు తమ పనితీరును మరింత మెరుగు పర్చుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో పీఎంఏజేఏవై, దళితబంధు, అభివృద్ధి పనులకు ప్రభుత్వ భూముల కేటాయింపు, రెవెన్యూ సమస్యల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన కింద ఎంపిక చేసిన విలేజ్ల డెవలప్మెంట్కు రూ. 20 లక్షల గ్రాంట్ ఇస్తారన్నారు.
సబ్ సెంటర్, అంగన్వాడీ సెంటర్లలో రిపేర్లు, ఫర్నీచర్, సౌలతులు సమకూర్చుకోవాలని సూచించారు. 132 దళితబంధు డెయిరీ యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. డీలర్లపై ఒత్తిడి తెచ్చి 93 వెహికల్స్ యూనిట్లను గ్రౌండింగ్ చేయాలన్నారు. పంచాయితీ బిల్డింగులు, గోడౌన్ల నిర్మాణం, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, విలేజ్ పార్కులు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్ మధుసూదన్, డీఆర్వో శిరీష పాల్గొన్నారు.
రెండోరోజూ ‘వాడవాడలా పువ్వాడ’
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: వాడవాడలా పువ్వాడ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. నగరంలోని 38వ డివిజన్ ఖిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్లోని పూర్వబావి, రోడ్డుపై ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, అసంపూర్తిగా ఉన్న సైడ్డ్రైన్లు, ఆసరా పెన్షన్లు, శ్మశానవాటిక తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని వెంటనే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభిని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ రూ.20 కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులతో సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. నగర మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.
ఉనికి కోసమే కృష్ణయ్యను మర్డర్ చేసిన్రు
ఖమ్మం రూరల్, వెలుగు: కమ్యూనిస్టులు తమ ఉనికి కాపాడుకునేందుకే తమ్మినేని కృష్ణయ్యను హత్య చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం రూరల్ మండలం తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని కేరళలో అమలు చేస్తుండగా, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.
దీనిని సీపీఎం నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. భౌతిక దాడులు చేస్తామనడం మంచి పద్ధతి కాదన్నారు. దాడులు చేసుకుంటూ పోతే సమాజంలో మిగిలేది విగ్రహాలేనని అన్నారు. దాడులు చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హత్యా రాజకీయాలకు పాల్పడే వారిని సమాజం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. రూరల్ మండల అధ్యక్షుడు బట్టు నాగరాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవి, జిల్లా కార్యదర్శి నకిరేకంటి వీరభద్రం, రూరల్ ఇన్చార్జి ఎల్లారావు గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్ పాల్గొన్నారు.
ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీదే కీలకపాత్ర
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కంపెనీ ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ విభాగానిదే కీలక పాత్ర అని సింగరేణి డైరెక్టర్(పా) ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. కొత్తగూడెంలో ఆధునీకరించిన చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫీస్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో ఎస్అండ్పీసీ విభాగం రక్షణ చర్యలను పక్కాగా నిర్వహిస్తోందన్నారు. ఉత్పత్తితో పాటు భద్రతకు సింగరేణి యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ బి హనుమంతరావు, జీఎంలు కె. బసవయ్య, ఎ ఆనందరావు, సెక్యూరిటీ ఆఫీసర్ కె. వెంకటేశ్వర్లు, ఎస్వోటూ డైరెక్టర్ రాజశేఖర్, రాజీవ్ కుమార్, ఎండీ జాకీర్‌హుస్సేన్ పాల్గొన్నారు.
సింగరేణి సంస్థ మరిన్ని రికార్డులు సృష్టించాలి
మణుగూరు, వెలుగు: సింగరేణి కంపెనీ మరిన్ని రికార్డులు సృష్టించి లాభాల బాటలో పయనించాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆకాంక్షించారు. గనుల్లో సోమవారం పర్యటించిన ఆయన కార్మికులతో మాట్లాడారు. సింగరేణి సంస్థలోనే మణుగూరు ఏరియాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇదే ఒరవడిని కొనసాగిస్తూ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సరికొత్త రికార్డులు నెలకొల్పాలన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునేందుకు సమిష్టిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. జీఎం జి వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ఓటూ జీఎం లలిత్ కుమార్, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ వి ప్రభాకర్ రావు, జడ్పీటీసీ పోశం నరసింహారావు పాల్గొన్నారు.