ఇన్​ఫ్రా ప్రాజెక్టుల్లో వేగం పెంచుతం : మోదీ

గురుగ్రామ్ : వచ్చే ఐదేండ్లలో ఇన్​ఫ్రా అభివృద్ధిని మరింత పెంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేస్తామని చెప్పారు. దాంతో మన దేశాన్ని ప్రంపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. గడిచిన ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామని మోదీ గుర్తుచేశారు.

సోమవారం హర్యానాలోని ద్వాకా ఎక్స్​ప్రెస్ ​వేను ఆయన ప్రారంభించారు. అనంతరం గురుగ్రామ్ నుంచి దేశవ్యాప్తంగా దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన 114 నేషనల్ హైవేల పనులను వర్చువల్​గా ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ సర్కారు దేశవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీకి నిద్రపట్టట్లేదన్నారు. ప్రతీ విషయాన్నీ తప్పుపట్టడం అపొజిషన్ పార్టీలకు అలవాటైపోయిందన్నారు.

2047 నాటికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తన టార్గెట్ అని ప్రధాని మోదీ చెప్పారు. 2014లో 11 వ స్థానంలో ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులతో త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందన్నారు. హైవే ప్రాజెక్టులు పల్లెలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్నారు.

ద్వారకా ఎక్స్​ప్రెస్ వే విశేషాలు.. 

ద్వారకా ఎక్స్ ప్రెస్​వే మన దేశంలోనే మొట్టమొదటి 8 లేన్ల ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్​ప్రెస్ వే. దీని మొత్తం పొడవు 29 కిలోమీటర్లు కాగా, ఇందులో 18.9 కిలోమీటర్లు హర్యానాలో ఉంది. మిగతా 10.1 కిలోమీటర్లు ఢిల్లీ పరిధిలోకి వస్తుంది. దీని ద్వారా ఎన్​హెచ్​28 రూట్​లో ఢిల్లీ నుంచి హర్యానాలోని గురుగ్రామ్​దాకా ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. హర్యానాలో ఈ ఎక్స్​ప్రెస్​ వే నిర్మాణానికి రూ.4,100 కోట్లు ఖర్చు పెట్టారు.

ఇయ్యాల సబర్మతి ఆశ్రమానికి మోదీ.. 

ప్రధాని మోదీ మంగళవారం అహ్మదాబాద్​లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమ స్మారక ప్రాజెక్ట్​ మాస్టర్ ప్లాన్​ను ఆవిష్కరిస్తారు. రూ.1,200 కోట్ల బడ్జెట్​తో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్.. మహాత్మా గాంధీ ఆలోచనలు, బోధనలను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో రూపొందించారు.