- డిసెంబర్ మొదటి వారంలో పూర్తయ్యేలా కార్యాచరణ
- నిత్యం సెంటర్ల పర్యవేక్షణ
- వడ్ల కొనుగోళ్లపై ఆర్డర్స్
- కొనుగోళ్లు చేసిన వడ్లలో 30 శాతానికి పేమెంట్స్
యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, వెలుగు : వడ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. సెంటర్లకు వచ్చిన వడ్లను కాంటా వేయించి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 4.50 లక్షల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్ శాఖ కొనుగోలు చేసింది.
మొదట్లో కొంత నెమ్మదిగా..
యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 14 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని సివిల్సప్లయ్ డిపార్ట్మెంట్ లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఇందుకోసం పలుదఫాల్లో 1000 సెంటర్లను ఓపెన్చేశారు. అయితే సీఎంఆర్కోసం 20 శాతం బ్యాంక్గ్యారెంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మిల్లర్లు సహకరించలేదు. పైగా గోదాముల్లో స్థలం కొరత కారణంగా ప్రారంభంలో కొనుగోళ్లు సరిగా జరగలేదు. దీంతో సెంటర్లలో వడ్ల కుప్పులు పేరుకుపోయాయి. చివరకు 10 శాతం బ్యాంక్ గ్యారెంటీకి మిల్లర్లు అంగీకరించడంతో అన్ని సెంటర్లలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
3.90 లక్షల టన్నుల కొనుగోలు..
కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెంటర్లలో పేరుకొనిపోయిన వడ్లు రెగ్యులర్గా కాంటా పెడుతున్నారు. అనంతరం మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లలో కొందరు సెంటర్ల నుంచి వడ్లను తేమ పేరుతో అన్లోడ్చేసుకోవడానికి నిరాకరించారు. దీంతో జిల్లా ఆఫీసర్లు సీరియస్గా వార్నింగ్ఇచ్చారు. వచ్చిన వడ్లను వచ్చినట్టు అన్లోడ్ చేసుకోవాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా.. తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. అన్లోడ్ చేసుకోకుండా రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో అన్లోడింగ్ ప్రక్రియ కూడా స్పీడ్గానే జరుగుతోంది. అయితే ఇప్పటివరకు యాదాద్రి జిల్లాలోని 15,375 మంది రైతుల నుంచి 1.50 లక్షల టన్నులు, నల్గొండలో 1.60 లక్షల టన్నులు, సూర్యాపేటలో 80 వేల టన్నులను కొనుగోలు చేశారు.
మొదటి వారంలో కంప్లీట్..
సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్తో సమానంగా వడ్లను దళారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లోని సెంటర్లలో వడ్ల కొనుగోళ్లు జరగడం లేదు. ఇప్పటికే కొన్ని సెంటర్లను మూసి వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్వడ్ల కొనుగోలు ప్రక్రియ డిసెంబర్మొదటి వారంలో ముగిసే అవకాశం ఉంది.
30 శాతం వడ్లకు పేమెంట్స్..
పేమెంట్స్ విషయంలో కొంత జాప్యం జరుగుతోంది. వడ్లను కొనుగోలు చేసిన వెంటనే పేమెంట్స్ చేస్తామని ఆఫీసర్లు ప్రకటించారు. అయితే వడ్లు అమ్మిన 10 నుంచి 15 రోజుల తర్వాతే డబ్బులు రైతుల అకౌంట్లలో వేస్తున్నారు. కొనుగోలు చేసిన వడ్లలో 30 శాతం మాత్రమే పేమెంట్స్చేశారు. యాదాద్రి జిల్లాలో 11,342 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 49,769 టన్నుల వడ్లకు రూ.113.40 కోట్లు పేమెంట్చేశారు. నల్గొండలో రూ.105 కోట్లు, సూర్యాపేటలో రూ.90 కోట్లు పేమెంట్ చేశారు.