- కౌన్సిల్ మీటింగ్‌లో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలని చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. హరితహారం, శానిటేషన్, యూజీడీ, సీసీ రోడ్లు, తాగునీటి పైప్లైన్ల సమస్యలపై ప్రధానంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
అనంతరం సాధారణ బడ్జెట్ కింద మున్సిపల్ లిమిట్స్ లో అభివృద్ధి పనుల కోసం రూ. 10. 40 కోట్ల నిధులను కేటాయిస్తూ కౌన్సిల్ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పాండురంగా రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిలో అందరూ కలిసి రావాలని సభ్యులకు సూచించారు. పెండింగ్ పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దని వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో కొత్తగా విలీనమైన ఆరు గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఆర్‌ఓ ముదుసూధన్ రెడ్డి, డీఈ వెంకటరమణ, ఏఈ ప్రవీణ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.