ఫ్లైఓవర్లు, నాలాల పనుల్లో స్పీడ్ పెంచండి: మంత్రి పొన్నం

ఫ్లైఓవర్లు, నాలాల పనుల్లో స్పీడ్ పెంచండి: మంత్రి పొన్నం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్లు, నాలాల పనులు గడువు లోగా పూర్తి చేయాలని హైదరాబాద్​ఇన్​చార్జ్​ మంత్రి పొన్నం ప్రభాకర్​ అధికారులను ఆదేశించారు. సోమవారం సెక్రటేరియెట్​లో ఆయన జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా చేపట్టిన 42 పనుల్లో ఇప్పటికే 36 పనులు పూర్తయ్యాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జాతీయ రహదారుల్లో భాగంగా నిర్మిస్తున్న అంబర్ పేట ఫ్లై ఓవర్, ఉప్పల్-నారపల్లి ఎక్స్ప్రెస్​కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే పెండింగ్ లో ఉన్న ఇతర ఫ్లై ఓవర్ల పనులు స్పీడప్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఎస్ఎన్డీపీ లో భాగంగా చేపట్టిన నాలాలు, డ్రైనేజీల నిర్మాణంలో పెండింగ్ లో ఉన్న పనులపై ఆరా తీశారు. వచ్చే వర్షాకాలం సీజన్ లోపు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఫ్లైఓవర్లు, కొత్త నాలాలు అవసరమైన చోట ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

జీహెచ్ఎంసీ లోనే కాకుండా శివారు మున్సిపాలిటీ లను కూడా సమన్వయం చేసుకొని పెండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. రైల్వే అండర్ పాస్ లు నిర్మాణం జరుగుతున్న చోట్ల రైల్వే అధికారులతో కరెంట్ లైన్ పనులను విద్యుత్ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రెయిన్ వాటర్​ హార్వెస్టింగ్ పనులపై ఆరా తీశారు. సమీక్షలో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్  చీఫ్ ఇంజనీర్ ఎం దేవానంద్, ఎస్ఎన్డీపీ చీఫ్ ఇంజనీర్ కోటేశ్వర రావు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.