వీకెండ్ కల్లు పార్టీ కోసం.. కారులో వెళుతుంటే.. ఐదుగురు హైదరాబాద్ కుర్రోళ్లు మృతి

కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన విషాదంగా మారింది. హైదరాబాద్ కు చెందిన ఐదుగురు కుర్రోళ్లు.. అందరి వయస్సు 21, 22 ఏళ్లు మాత్రమే.. చదువు  పూర్తి చేసుకుని.. ఉద్యోగాల్లో స్థిరపడదామని ఉవ్విళ్లూరుతున్న వయస్సు.. చేతికి అందిన కొడుకులను చూసి మురిసిపోతున్న తల్లిదండ్రులు.. ఇప్పుడు ఆ ఇళ్లల్లో కన్నీళ్లే మిగిలాయి. ఈ కుర్రోళ్ల వీకెండ్ సరదా.. వీకెండ్ ఎంజాయ్ మెంట్ అత్యంత విషాదంగా మారింది. హైదరాబాద్ సిటీ శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదం సంచలనంగా  మారింది. 

హైదరాబాద్ సిటీలోని ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన వంశీ (23), దిగ్నేష్ (21), హర్ష (21), బాలు (19), వినయ్ (21), మణికంఠ స్నేహితులు. అందరూ ఆదివారం వీకెండ్ ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం కల్లుతాగాలని డిసైడ్ అయ్యారు. సిటీలో అయితే మంచి కల్లు దొరకదని.. భూదాన్ పోచంపల్లిలో మంచి కల్లు దొరుకుతుందని తెలుసుకుని.. 2024, డిసెంబర్ 7వ తేదీ ఆదివారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్  పోచంపల్లికి బయలుదేరారు. అక్కడ కల్లు పార్టీ చేసుకుని ఈవినింగ్ వద్దామని ప్లానింగ్. 

Also Read:-హైదరాబాద్‎లో ఈ ఆంటీ కనిపిస్తే జాగ్రత్త.. సెక్స్ వర్కర్ ముసుగులో దోపిడి

ఈ క్రమంలోనే ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలోని తమ ఇళ్ల నుంచి కారులో బయలుదేరారు. జలాల్ పూర్ దగ్గర రోడ్డు  మలుపు ఉంది. కారు స్పీడ్ గా వెళుతుండటంతో.. మలుపు దగ్గర కారును కంట్రోల్ చేయలేక..  డ్రైవింగ్ చేస్తున్న వంశీ  సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కారు రెండు పల్టీలు కొట్టి రోడ్డు పక్కనే ఉన్న చెరువులలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముందు సీట్లో కూర్చున్న మణికంఠ డోర్ లాక్ తీసుకుని ఉండటంతో.. ప్రాణాలతో బయటపడ్డాడు.

సమాచారం అందుకున్న భూదాన్ పోచంపల్లి ఎస్సై భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో కారును బయటికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామ  పరిధిలో జరిగింది.

ఈ యంగ్ కుర్రోళ్ల వీకెండ్ పార్టీ సరదా.. అత్యంత విషాదంగా మారటంతో.. ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.