
- కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ల దూకుడు
- గొర్రెల స్కామ్‌పై ఏసీబీ.. ట్యాపింగ్‌పై పోలీసుల విచారణ వేగవంతం
- విద్యుత్ కొనుగోళ్లపై మాజీ స్పెషల్ సీఎస్‌ను విచారించిన నర్సింహరెడ్డి కమిషన్
- గత ప్రభుత్వం చెప్పినట్టే చేశానని మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు స్టేట్‌మెంట్
- ‘కాళేశ్వరం’పై నేడు 18 మందిని విచారించనున్న జస్టిస్ చంద్రఘోష్
- ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం అందలేదని కంప్లయింట్స్
- ఏసీబీ కస్టడీలో గొర్రెల స్కామ్ నిందితులు
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కారు హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై ఎంక్వైరీ స్పీడప్ అయింది. కాళేశ్వరంపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్లు వరుస పెట్టి అధికారులను విచారిస్తున్నాయి. సోమవారం కూడా రెండు కమిషన్లు నోటీసులు ఇచ్చి, ఆఫీసర్లను వేర్వేరుగా ఎంక్వైరీ చేశాయి. వారినుంచి వివరాలు తీసుకున్నాయి. ఈ వ్యవహారంలో త్వరలోనే గత ప్రభుత్వంలో పనిచేసిన సంబంధిత శాఖల అప్పటి మంత్రులకు కూడా నోటీసులు ఇచ్చి, విచారించనున్నారు.
కాళేశ్వరంపై ఇంజినీర్లు, రిటైర్డ్ఇంజినీర్లకు నోటీసులు ఇస్తూ వివరాలు రాబడుతున్నారు. ఇంకో నాలుగైదు రోజులు జస్టిస్ పినాకి చంద్రఘోష్ రాష్ట్రంలోనే ఉండి, విచారణ చేయనున్నారు. మరికొంతమందికి నోటీసులు జారీ చేసి, ఎంక్వైరీకి పిలువనున్నారు. మరోవైపు గొర్రెల స్కామ్‌లో నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. ఇక ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న మాజీ ఇంటిలెజెన్స్చీఫ్ ప్రభాకర్‌రావు ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నట్టు తెలుస్తోంది.
ఫోన్‌ట్యాపింగ్,స్పెషల్ ఇంటెలిజెన్స్ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ కీలకంగా మారనుంది. అమెరికాలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న ప్రభాకర్ రావు ఈ నెల 26న తిరిగి ఇండియాకు రానున్నట్టు నాంపల్లి కోర్టుకు అందించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన ఇండియాకు వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ టీమ్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాళేశ్వరం ఆర్థిక అంశాలపై త్వరలో ఎంక్వైరీ
కాళేశ్వరంపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందని ఎంక్వైరీ కమిషన్ చైర్మన్జస్టిస్ పినాకి చంద్ర ఘోష్తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు విజిట్ చేశానని, అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయని అన్నారు. సోమవారం బీఆర్కే భవన్లో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. విచారణకు వచ్చే అధికారులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తి అయ్యాక, ఆర్థిక అంశాల పై ఎంక్వైరీ మొదలవుతుందని చెప్పారు.
ఇక ప్రభుత్వం నుంచి కావాల్సిన రిపోర్టులన్నీ అందాయని తెలిపారు. విజిలెన్స్రిపోర్ట్ను కూడా తెప్పించుకున్నట్టు చెప్పారు. వాటిని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం 18 మందిని విచారించనున్నామని, ఇందుకోసం వారికి నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. సోమవారం ఏడుగురుని విచారించి, వివరాలు తీసుకున్నట్టు తెలిపారు. బహిరంగంగా కమిషన్ కు 54 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలిస్తామని అన్నారు.
ప్రాజెక్టులకు ఇచ్చిన భూములకు నష్టపరిహారం అందలేదనే పలువురు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వానికి తన తరఫున విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ఏజెన్సీలను కూడా విచారణకు పిలుస్తామని చెప్పారు. నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్ద సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు. జూన్ 30లోపు విచారణ పూర్తి కాదని, దానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు.
కమిషన్గడువును పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేననని ఆయన స్పష్టం చేశారు. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉన్నదని, అందుకే విచారణ కొంత ఆలస్యమైందని తెలిపారు.
‘విద్యుత్ కొనుగోళ్ల’ పై మాజీ సీఎండీని విచారించిన కమిషన్
విద్యుత్ అంశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజనిర్ధారణ కోసం జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ఇప్పటికే బహిరంగ ప్రకటన జారీ చేసి, ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. సోమవారం ట్రాన్స్‌కో, జెన్ కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, ఐఏఎస్ ఆఫీసర్, గత ప్రభుత్వంలో మాజీ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన సురేశ్చందాను విచారించింది. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు కమిషన్ ముందు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
కాగా, తాను కొద్దికాలమే ఆ శాఖకు కార్యదర్శిగా ఉన్నాననీ, తన హయాంలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదని సురేశ్ చందా వివరణ ఇచ్చినట్టు తెలిసింది. మంగళవారం మాజీ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి, ప్రస్తుతం విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అర్వింద్ కుమార్ కమిషన్ ఎదుట హాజరుకానున్నట్టు సమాచారం.
ఈ అంశాలపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని జస్టిస్ నర్సింహారెడ్డి ఏకసభ్య కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే, ఆలోగా విచారణ పూర్తయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. దీంతో మరో రెండు లేదా మూడునెలల పాటు కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్‌లో ప్రభాకర్‌రావు అరెస్ట్‌కు రంగం సిద్ధం
ఫోన్ ట్యాపింగ్,స్పెషల్ ఇంటెలిజెన్స్ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ కీలకంగా మారనుంది. దీంతో ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ టీమ్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాకర్‌రావుతోపాటు ఐ న్యూస్ ఎండీ శ్రవణ్‌కుమార్‌పై ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పించేందుకు రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు.
ఈ మేరకు సెక్షన్ 73 సీఆర్‌పీసీ కింద నాంపల్లి కోర్టు గత నెలలోనే ఆదేశాలు జారీ చేసింది.ఇమ్మిగ్రేషన్, ఇంటర్‌పోల్‌కు రెడ్‌కార్నర్ నోటీసులకు సంబంధించిన సమాచారం అందించారు. దీంతో ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన వెంటనే ఎయిర్‌పోర్టులోనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు.
ఉచ్చు బిగిస్తున్న గొర్రెల పంపిణీ స్కాం
గొర్రెల పంపిణీ కేసులో అప్పటి మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ కుమార్ తోపాటు పశుసంవర్థకశాఖ మాజీ ఎండీ రామచందర్ నాయక్ ను ఏసీబీ కస్టడీలోకి తీసుకొని, మూడు రోజుల పాటు విచారించనుంది. వీళ్లు ఇచ్చే స్టేట్ మెంట్ కీలకంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీలో చోటు చేసుకున్న కుంభకోణంలో అవినీతి తవ్వినకొద్దీ బయటికి వస్తోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు అధికారులను కోర్టు మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇచ్చింది. వాళ్ల స్టేట్ మెంట్ల ఆధారంగా దోషులెవరో తేల్చనుంది.
ఈ స్కీంలో రెండున్నర కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయన్న ఆధారాలతో ఏసీబీ రంగంలోకి దిగగా.. ఈ వ్యవహారం వెనక రూ.700 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులోనూ అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారనే దానిపై ఏసీబీ పోలీసులు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు.
గత ప్రభుత్వం చెప్పినట్టే చేశా: ప్రభాకర్‌రావు
విద్యుత్ అంశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టే చేశానని మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ప్రధానంగా థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్ క్రిటికల్‌కు పర్మిషన్లు తీసుకున్నట్టు వివరించినట్టు సమాచారం. ప్రాజెక్ట్ ను తొందరగా కంప్లీట్ చేయడానికి బీహెచ్ఈఎల్ వద్ద సిద్ధంగా ఉన్న బాయిలర్స్‌ను తీసుకున్నట్టు సమాధానమిచ్చారని తెలిసింది. చందా గతంలో బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడంతో ఆయనను ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పదవి నుంచి తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు, సురేశ్చందాలు కమిషన్ ముందు తమ వాదనలు వినిపించినట్టు తెలిసింది.