
- ప్లాస్మా కట్టర్లతో టీబీఎం శిథిలాలను తొలగిస్తున్న రైల్వే స్టాఫ్
- బురదను మ్యానువల్‌గా ఎత్తి లోకోలో తీసుకొస్తున్న సిబ్బంది
- నిరంతరాయంగా పనులు
ఎస్‌ఎల్‌బీసీ నుంచి వెలుగు టీం : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో శిథిలాల తొలగింపు ప్రారంభమైంది. టన్నెల్‌లో ప్రమాదం జరిగిన పాయింట్‌ను బుధవారం సాయంత్రం గుర్తించడంతో.. గురువారం ఉదయం నుంచి రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. రెస్క్యూ టీమ్‌లు మొత్తం మూడు షిఫ్ట్‌లలో పనులు చేస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి టన్నెల్‌లోకి వెళ్లిన ప్రతీ టీమ్ సుమారు 12 గంటల పాటు అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
రంగంలోకి రైల్వే టీమ్
టన్నెల్‌లో 12వ కిలోమీటరు తర్వాత పెద్దమొత్తంలో శిథిలాలు పేరుకుపోయాయి. దీంతో లోకో అక్కడి వరకే వెళ్లగలుగుతోంది. అయితే టన్నెల్‌లో పేరుకుపోయిన శిథిలాలను తొలగించి లోకోలో మరింత ముందుకు వెళ్లి బురదను బయటకు తెచ్చేలా ఆఫీసర్లు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి రైల్వే నిపుణుల టీమ్‌ను టన్నెల్ వద్దకు తీసుకొచ్చారు.
వీరు గురువారం ఉదయం ఫస్ట్ షిఫ్ట్‌లో టన్నెల్‌లోకి వెళ్లారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్, ప్లాస్మా కట్టర్లతో శిథిలాల తొలగింపు పనులు ప్రారంభించారు. 12వ కిలోమీటరు నుంచి లోకోకు అడ్డంగా ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ శిథిలాలు, ఎయిర్ సప్లై పైప్‌లైన్, కన్వేయర్ బెల్ట్ శిథిలాలను తొలగిస్తున్నారు. అలాగే 60 హెచ్‌పీ సామర్థ్యం గల మరో మిని హిటాచీని సైతం మధ్యాహ్నం టన్నెల్‌లోకి తీసుకెళ్లారు. కట్టింగ్ చేసిన శిథిలాలు లోకో ట్రాక్‌కు అడ్డం పడకుండా పక్కన పేరుస్తున్నారు.
సాయిల్ టెస్ట్ కోసం బురద సేకరణ
టన్నెల్‌లో మట్టి లక్షణాలు ఎలా ఉన్నాయో గుర్తించడానికి బురద శాంపిళ్లను సేకరించారు. గురువారం ఉదయం 11 గంటలకు మ్యానువల్‌గా నాలుగు ఐరన్ బకెట్లలో బురదను తీశారు. ఈ బకెట్లను లోకో ద్వారా బయటకు పంపించారు. ఈ శాంపిళ్లను జియలాజికల్ సర్వే అండ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (జీఎస్‌ఆర్‌ఐ) సేకరించింది. బురదలో క్వార్జ్, పాస్పర్, సాలిడ్ సాయిల్ పర్సంటేజీ ఎంత ఉందనేది గుర్తించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
అత్యాధునిక స్కానర్‌తో మనుషుల గుర్తింపు
టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన వారిని గుర్తించేందుకు అత్యాధునిక కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ విన్నపం మేరకు జీఎస్‌ఆర్‌ఐ ఆఫీసర్లు ప్రోకో కంపెనీకి చెందిన గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ యాంటినా స్కానర్‌ను తీసుకొచ్చారు. మట్టి, బురదలో స్కాన్ చేస్తే సెన్సార్ల ఆధారంగా మనుషులు ఎక్కడున్నారో ఈ పరికరం గుర్తిస్తుంది. ఈ ఎక్విప్‌మెంట్‌ను శుక్రవారం నుంచి వినియోగించనున్నారు. మరో వైపు మట్టి బస్తాలను సిద్దం చేసేందుకు సుమారు ఐదు వేల ఖాళీ బస్తాలను ఆఫీసర్లు టన్నెల్ వద్దకు తరలించారు.
టన్నెల్ వద్ద ఉద్రిక్తత
ఎస్‌ఎల్‌బీసీ, వెలుగు టీమ్ : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద గురువారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్ లీడర్ల పర్యటన నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలోని మన్ననూరు- నుంచి దోమలపెంట వరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో పాటు మాజీమంత్రులు సి.లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ మధ్యాహ్నం టన్నెల్ వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు.
అయితే పర్మిషన్ లేదంటూ దోమలపెంట వద్ద గల మొదటి గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత జేపీ క్యాంప్ ఆఫీస్ వద్దకు రాగా అక్కడ మరోసారి అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ లీడర్లు నిరసనకు దిగారు. తమను టన్నెల్ వద్దకు అనుమతించాలని అక్కడే బైఠాయించారు. తర్వాత ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ రావడంతో వారిని టన్నెల్ వద్దకు పంపించారు.
వీరి వెంట వచ్చిన కొందరు డ్రోన్ కెమెరాతో షూట్ చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరిగి జేపీ ఆఫీస్ వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ లీడర్లు బాధిత కుటుంబాలతో తమను మాట్లాడించాలని ఆందోళన చేశారు. పోలీసులు నిరాకరించడంతో తిరిగి వెళ్లిపోయారు. అయితే ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్సీలు ప్రవీణ్‌రెడ్డి, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల రాంభూపాల్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రజనిని టన్నెల్ వద్దకు అనుమతించలేదు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా అనుమతి ఇవ్వకపోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.