ప్రధానుల భద్రత ఇలా: కంటికి రెప్పలా.. ఎస్పీజీ

‘ఐరన్​ లేడీ’ ఇందిరాగాంధీ హత్యానంతరం ఏర్పడ్డ స్పెషల్​ ప్రొటెక్షన్​ గ్రూప్​ (ఎస్పీజీ) మళ్లీ ఆమె ఫ్యామిలీ విషయంలోనే వార్తల్లోకొచ్చింది. కాంగ్రెస్​ పార్టీ ప్రెసిడెంట్​ సోనియాగాంధీ, మాజీ చీఫ్​ రాహుల్​గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్​ వాద్రాకు ఆ సెక్యూరిటీ కవర్​ని తొలగించటమే దీనికి కారణం. పార్లమెంటులో దీనిపై చాలా రచ్చకూడా జరిగింది.  ప్రధానులు, మాజీ పీఎంలు, వారి కుటుంబ సభ్యులు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా కంటికి రెప్పలా కాపాడే ఈ ఫోర్స్​.. తొలి నుంచీ ‘స్పెషల్​’గానే నిలుస్తోంది. ‘వీవీఐపీల ప్రొటెక్షన్​కి పెట్టింది పేరు’ అనిపించుకుంటోంది.

ఇండియా అంటే ఇందిర.. ఇందిర అంటే ఇండియా అనుకుంటున్న రోజుల్లో ఆమె తన ఇంట్లోనే, తన సెక్యూరిటీ చేతుల్లోనే హత్యకు గురికావటంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇలాంటి దారుణమైన సంఘటనలు మరోసారి జరక్కుండా చూడటం కోసం ఎస్పీజీని తెరపైకి తెచ్చారు. ప్రధానమంత్రుల సెక్యూరిటీకి సంబంధించి ‘జీరో ఎర్రర్​’ టార్గెట్​తో దీనికి ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. మరీ ముఖ్యంగా నాటి ప్రధాని రాజీవ్​గాంధీ రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ పటిష్ట వ్యవస్థను ఏర్పాటుచేశారు.

అంతకు ముందు..

1981కి ముందు ప్రధానమంత్రి అధికారిక నివాస సెక్యూరిటీ బాధ్యతలను ఢిల్లీ పోలీస్​ డిపార్ట్​మెంట్​లోని స్పెషల్​ సెక్యూరిటీ డిస్ట్రిక్ట్​ (ఎస్పీడీ) సెక్షన్​ చూసేది. ఆ ఏడాది అక్టోబర్​లో కొత్తగా స్పెషల్​ టాస్క్​ ఫోర్స్(ఎస్టీఎఫ్​)​ ఏర్పాటుచేశారు. ఇంటెలిజెన్స్​ బ్యూరో కంట్రోల్​లో పనిచేసే ఎస్​టీఎఫ్​.. ప్రధాని ఢిల్లీలో ఉన్నా వేరే చోటకి వెళ్లినా ఎస్కార్ట్​గా ఉండేది. మూడేళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగింది. 1984 అక్టోబర్​లో ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురవటంతో ఈ విధానంపై పునరాలోచన చేశారు. సెక్రటరీల కమిటీ రివ్యూ చేసి ప్రధానమంత్రి సెక్యూరిటీని స్పెషల్ గ్రూప్​కి ఇవ్వాలని నిర్ణయించారు. మరిన్ని సూచనలు, సలహాల కోసం 1985 ఫిబ్రవరిలో హోం అఫైర్స్​ మినిస్ట్రీ.. బీర్బల్​ నాథ్​ కమిటీని నియమించింది. ఆ కమిటీ నెల రోజులు స్టడీ చేసి రిపోర్ట్​ ఇచ్చింది. పీఎం సెక్యూరిటీ కోసం స్పెషల్​ ప్రొటెక్షన్​ యూనిట్​(ఎస్పీయూ) ఎంతైనా అవసరమని అభిప్రాయపడింది. దీంతో రాష్ట్రపతి ఈ యూనిట్​కి 819 పోస్టులు కేటాయించారు. ఆ బలగమే ఇప్పుడున్న స్పెషల్ ప్రొటెక్షన్​ గ్రూప్​(ఎస్పీజీ)గా మారింది.

రాజీవ్​గాంధీ కోసమే! అయినా..

ఇందిరాగాంధీ చనిపోయాక ప్రధాని అయిన రాజీవ్​గాంధీకి అప్పట్లో చాలా టెర్రర్​ సంస్థల నుంచి బెదిరింపులు వచ్చేవి. దీంతో ఆయన ప్రొటెక్షన్​ కోసం ఎస్పీజీని ఏర్పాటుచేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రధాని ఫిజికల్​ సెక్యూరిటీ ఏర్పాట్లకు ఎస్పీజీతోపాటు రాష్ట్ర పోలీసులు కూడా బాధ్యత వహించాలన్నారు. ఈ ఆపరేషనల్​ ఏజెన్సీలకు కావాల్సిన ఇన్​పుట్స్​ని ఇంటెలిజెన్స్​ బ్యూరో ఇవ్వాలని చెప్పారు. ఆవిధంగా ఎస్పీజీ 1985​ నుంచి 1988 వరకు (మూడేళ్లకు పైగా) చట్టబద్ధత లేకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​ ఆధారంగానే నడిచింది.

రాజీవ్​గాంధీ పీఎంగా ఉన్నంత కాలం ఎస్పీజీయే సెక్యూరిటీ కల్పించింది. 1989 డిసెంబర్​లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఆయన ఎప్పుడైతే ఓడిపోయి ప్రధాని కుర్చీ నుంచి దిగిపోయారో అప్పుడే ఈ సెక్యూరిటీ​నీ తీసేశారు. దీంతో రాజీవ్​గాంధీకి మళ్లీ థ్రెట్ మొదలైంది. శ్రీలంకకు చెందిన తమిళ మిలిటెంట్లు (ఎల్​టీటీఈ) ఆయన్ని తమిళనాడులోని శ్రీపెరంబదూర్​లో 1991 మే 21న సూసైడ్​ బాంబు ప్రయోగంతో పొట్టనపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ‘ఎస్పీజీ చట్టం–1991’కి ఆ సంవత్సరం మార్పుచేర్పులు చేశారు.

మాజీలైన పదేళ్ల వరకూ..

సవరించిన ఎస్పీజీ చట్టం ప్రకారం ప్రధానిగా ఉన్నప్పుడు, ఆ పదవి నుంచి తప్పుకున్న తర్వాత పదేళ్ల వరకు కూడా ఈ స్పెషల్​ ప్రొటెక్షన్​ కొనసాగుతుంది. సోనియా, రాహుల్, ప్రియాంక, రాబర్ట్​ వాద్రా మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులు మాత్రమే కాదు. ఒకప్పుడు ఎన్నో టెర్రర్​ గ్రూపులకు మోస్ట్​ వాటెండ్​గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్​. అందుకే వారికి 28 ఏళ్లుగా ఎస్పీజీ కవర్ ఇచ్చారు. రాజీవ్​గాంధీ తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరూ ప్రధాని పదవి చేపట్టకుండా తెర వెనక నుంచే చక్రం తిప్పటంతో టెర్రర్​ గ్రూపుల బెదిరింపులు తగ్గాయి. దీనికితోడు ప్రొటెక్షన్ రూల్స్​​ని వాళ్లు చాలా సార్లు బ్రేక్​ చేశారు. దీంతో ఈ సెక్యూరిటీ పరిధి నుంచి ఆ కుటుంబాన్ని తప్పించారని అంటున్నారు.

యూనిఫాం, డ్రెస్​, వెపన్స్​

ఎస్పీజీ ఏజెంట్లు బ్లాక్​ వెస్టర్న్​–స్టైల్​ ఫార్మల్​ బిజినెస్​ సూట్లు వేసుకుంటారు. కళ్లకు నల్లద్దాలు, చెవులకు 2–వే ఎన్​స్క్రిప్టెడ్ కమ్యూనికేషన్​ ​పీస్​లు, చేతులకు కన్​సీల్డ్​ హ్యాండ్​గన్స్​ పెట్టుకుంటారు. ట్రెడిషనల్​ అకేషన్స్​లో సిచ్యువేషన్​కి తగ్గ సఫారీ సూట్లు ధరిస్తారు. యూనిఫామ్డ్​ ఆఫీసర్ల, స్పెషల్​ ఆపరేషన్స్​ కమాండోల డ్రెస్​ ఒకటే. వాళ్ల వెపన్స్​లో​ అల్ట్రా మోడ్రన్​ అసాల్ట్​ రైఫిల్స్​, డార్క్​ విజన్​​ గాగుల్స్, ఇన్​బిల్ట్ కమ్యూనికేషన్​ ఇయర్​ పీస్​లు, బుల్లెట్​ ప్రూఫ్ వెస్ట్​లు, గ్లోవ్స్​, నీ–ప్యాడ్లు వంటివి ఉంటాయి.

సెక్యూరిటీ ఖర్చెంత?

దేశంలో సెక్యూరిటీ పేరిట చేస్తున్న ఖర్చు ఏటా రూ.200 కోట్లకు తక్కువ ఉండదని రిటైర్డ్​ డీజీపీ ఒకరు అన్నారు. ‘బ్యూరో ఆఫ్​ పోలీస్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​’ రిపోర్ట్–2012 ప్రకారం దేశవ్యాప్తంగా 14,842 మంది వీఐపీలకు 47,557 మంది సిబ్బంది ప్రొటెక్షన్​గా ఉంటున్నారు. ప్రధాని మోటార్​కేడ్​లో ఉండే వాహనాల లిస్టు.. కనీసం మూడు సాయుధ బీఎండబ్ల్యూ–7–సిరీస్​ సెడాన్లు, రెండు ఆర్మ్​డ్​ రేంజ్​ రోవర్లు, 8–10 బీఎండబ్ల్యూ–ఎక్స్–5ఎస్​లు, ఆరు టయోటా ఫార్చ్యూనర్లు లేదా లాండ్​క్రూయిజర్లు, రరెండు మెర్సిడెజ్​–బెంజ్ స్ర్పింటర్​ అంబులెన్స్​లు, ఒక టాటా సఫారీ ఈసీఎం కారు, కాన్వాయ్​, పదుల సంఖ్యలో ఎస్కార్ట్​ వెహికిల్స్​. విదేశాలకు వెళ్లేటప్పుడు ఎయిరిండియా వన్​ బోయింగ్​ 747 ఎయిర్​క్రాఫ్ట్ వాడతారు. ఎస్పీజీ యూనిట్​ మొత్తం మీడియాతో డైరెక్ట్​గా గానీ ఇన్​డైరెక్ట్​గా గానీ మాట్లాడటానికి వీల్లేదు.

స్టేటస్​ సింబల్​గా తయారైంది

కొంత మందిని ప్రముఖ వ్యక్తులుగా పరిగణించి సెక్యూరిటీ ఇవ్వటంపై వివాదాలు నెలకొంటున్నాయి. కొందరు దీన్ని స్టేటస్​ సింబల్​గా అనుభవిస్తున్నారని, నిజానికి వారికి సెక్యూరిటీ థ్రెట్స్​ పెద్దగా లేవని మీడియా విమర్శించింది. ఒట్టి హడావుడి వల్ల జనం డబ్బు వేస్ట్​ అవుతోందనే వాదనలూ ఉన్నాయి. దీంతో ఎన్​ఎస్​జీ ప్రొటెక్షన్​ని ఎమర్జెన్సీ అయితే తప్ప వాడట్లేదు. విమర్శలొస్తున్నా.. పొలిటీషియన్లకు జెడ్​+ సెక్యూరిటీ ఇస్తూనే ఉన్నారు. నేతలకు సెక్యూరిటీ పెంచి బ్యూరోక్రాట్లకు తగ్గించారు. 2014లో స్పిరుచ్యువల్​ లీడర్​ అశుతోష్​ మహరాజ్​ క్లినికల్లీ డెడ్ అయినా జెడ్​ కేటగిరీలో 25 మంది సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించటంపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాలకు వైఫల్యాలు తోడవుతున్నాయి. ప్రధాని ఇందిరాగాంధీని ఆమె బాడీగార్డ్​లే కాల్చిచంపటం దేశ భద్రతా వ్యవస్థకే మాయని మచ్చ అంటున్నారు. ఫేమస్​ ఎన్​కౌంటర్​ స్పెషలిస్ట్​ రాజ్​బీర్​ సింగ్​కి జెడ్​ లెవెల్​ సెక్యూరిటీ ఉన్నా దుండగులు పొట్టనపెట్టుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి ప్రమోద్​ మహాజన్​కు సెక్యూరిటీ ఉన్నా ఆయన్ని తన సోదరుడే కాల్చిచంపేశారు. 2013లో బిజినెస్​మ్యాన్​ ముఖేశ్​ అంబానీకి ప్రభుత్వం జెడ్​ కేటగిరీ సెక్యూరిటీ సౌకర్యం కల్పించింది. అయితే ఆ సిబ్బందికి శాలరీ, అకామడేషన్​ ఆయనే ఇవ్వాలని చెప్పింది. ఎస్కార్ట్​ వాహనాలకు అయ్యే ఖర్చును కూడా భరించాలని కండీషన్​ పెట్టింది.

కమాండ్​ & కంట్రోల్

ఎస్పీజీ డైరెక్టర్​గా ఐపీఎస్​ ఆఫీసర్​ ఉంటారు. ఒక్కోసారి ఆర్​పీఎఫ్​ అధికారికీ అప్పగిస్తారు. గ్రూప్​లో షార్ప్​గా పనిచేయాల్సిన కమాండర్లను సీఏపీఎఫ్​ లేదా ఆర్​పీఎఫ్​ నుంచి సెలెక్ట్​ చేస్తారు. డైరెక్టర్​ కింద డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్​ డైరెక్టర్లు, జాయింట్​ అసిస్టెంట్​ డైరెక్టర్లు చాలా మంది ఉంటారు. ఎస్పీజీని ముఖ్యంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఒకటి.. ఆపరేషన్స్​. రెండు.. ట్రైనింగ్​. మూడు.. ఇంటెలిజెన్స్​ అండ్​ టూర్స్​. నాలుగు.. అడ్మినిస్ట్రేషన్​. ఆపరేషన్స్​ బ్రాంచ్​లో కమ్యూనికేషన్స్​, టెక్నికల్​, ట్రాన్స్​పోర్ట్​ అనే మూడు వింగ్​లు ఉంటాయి.

ఎక్స్​.. వై.. జెడ్​.. జెడ్​+.. ఎస్పీజీ..

ఇవన్నీ ఇంగ్లిష్​ అక్షరాలు కావు. వీఐపీలకు, వీవీఐపీలకు సెక్యూరిటీ కల్పించే ఐదు కేటగిరీలు. ఎవరికి ఏ ప్రొటెక్షన్​ ఇవ్వాలనేది ఇంటెలిజెన్స్​ బ్యూరో అందించే ఇన్ఫర్మేషన్​పై ఆధారపడుతుంది.  

ఎక్స్​ కేటగిరీ : ఇద్దరు బాడీగార్డులనే కేటాయిస్తారు. వాళ్లు కమాండోలు కాదు. సాయుధ పోలీసు సిబ్బంది మాత్రమే.

వై కేటగిరీ : వీరికి11 మందితో సెక్యూరిటీ కవర్​ లభిస్తుంది. ఇందులో ఒకరు లేదా ఇద్దరు కమాండోలుంటారు. మిగిలినవాళ్లు పోలీసులు.

జెడ్​ కేటగిరీ : దీని పరిధిలోకి వచ్చే వ్యక్తులకు 22 మందితో సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో నలుగురు లేదా ఐదుగురు ఎన్​ఎస్​జీ కమాండోలుంటారు. మిగతావాళ్లు పోలీసులు.

జెడ్​ ప్లస్​ కేటగిరీ : ఈ కేటగిరీ వీఐపీలకు ఏకంగా 55 మందితో ఫుల్​ సెక్యూరిటీ కల్పిస్తారు. ఇందులో 10 మంది ఎన్​ఎస్​జీ కమాండోలు, తతిమ్మావాళ్లు పోలీసులు ఉంటారు. ఇప్పుడు 17 మంది వీఐపీలకే ఈ ప్రొటెక్షన్ ఉంది.

ఎస్పీజీ కేటగిరీ : ఇది అన్నిటికంటే నెంబర్​ వన్​ సెక్యూరిటీ సిస్టమ్​. దీన్ని ఇకపైన దేశంలో ఒకే ఒక వ్యక్తి (ప్రధాని)కి ఇవ్వనున్నారు. ఎస్పీజీలో ప్రస్తుతం 3,000 మంది సిబ్బంది ఉన్నారు.

వీవీఐపీలు, వీఐపీలతోపాటు పొలిటీషియన్లు, హై–ప్రొఫైల్​ సెలబ్రిటీలు, స్పోర్ట్స్​ పర్సన్స్, ఇతర రంగాల్లో పెద్ద పొజిషన్​లో ఉన్నవారికి సెక్యూరిటీ బాధ్యతను 5 ఏజెన్సీలకు అప్పగించారు. అవి.. 1. ఎస్పీజీ 2. ఎన్​ఎస్​జీ 3. ఐటీబీపీ 4. సీఆర్​పీఎఫ్​. 5. సీఐఎస్​ఎఫ్​.