Health Tips: మసాలా మెడిసిన్​!

Health Tips: మసాలా మెడిసిన్​!

అల్లం, దాల్చిన చెక్క, జాజికాయ... వీటికి, శీతాకాలానికి విడదీయలేని హెల్దీ రిలేషన్​ ఉంది. బహుశా ఈ మసాలాదినుసులు తినడం వల్ల వంట్లో వేడి పుట్టి చలి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది కాబోలు! ఒకరకంగా ఇది నిజమే అయినా దీనివెనక ఆసక్తికరమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అంటున్నారు ప్లాంట్​ సైంటిస్ట్​లు. 

ఈ మూడు పదార్థాలను వింటర్​ వంటకాల్లోనే కాదు  ట్రెడిషనల్​ మెడిసిన్​లో కూడా ఏండ్ల తరబడి వాడుతున్నారు. వీటిలో అల్లంని తీసుకుంటే... దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీపి​, కారం వంటకాల్లో వాడతారు. వేర్ల నుంచి ఏర్పడే అల్లం పక్వం​ అయ్యేందుకు ఎనిమిది నుంచి పది నెలల టైం పడుతుంది. అల్లం పంటకు పలానా సీజన్​ అని ఏమీ ఉండదు. ఏడాదిలో ఏ సీజన్​లో అయినా వస్తుంది. 

అల్లం భూమిలోపల పెరిగే రైజోబియం. ఒకరకంగా చెప్పాలంటే ఇది మొక్కకు భూమిలోపల ఉండే స్టెమ్ అన్నమాట. ఇవి మొక్కకు అవసరమైన పోషకాలను నిల్వ చేస్తాయి. శీతాకాలంలో మొక్క బతికేందుకు ఇవే ఆధారాన్ని ఇస్తాయి. శీతాకాలం మొదలైందనే సిగ్నల్​ మొక్కకు చేరితే చాలు భూమిలోపల ఉన్న పోషకాలను మొక్కకు సరఫరా చేయడంలో మునిగిపోతాయి రైజోబియంలు. ఇలాంటప్పుడు తీసిన అల్లం వాడితే అంత నాణ్యత కనిపించదు.

జాజికాయ– జాపత్రి

జాజికాయ​ విషయానికి వస్తే... మిరిస్టికా ఫ్రాగ్నెన్స్​ అనే చెట్టు నుంచి వస్తుంది. ఇండోనేసియాకు చెందిన ఈ మొక్క నాటిన ఆరేండ్లకు పూత పూస్తుంది. దీనికి 20 ఏండ్ల వయసు దగ్గర పడుతున్నప్పుడు జాజి పండును చెట్టునుంచి తెంపుతారు. ఈ చెట్లు పది నుంచి 30 అడుగుల ఎత్తు అంటే మూడు నుంచి పది మీటర్ల పొడవు పెరుగుతాయి. అందుకే వీటినుంచి జాజిపండ్లు కోసేందుకు పొడవాటి స్తంభాల్లాంటి వాటిని నిచ్చెనలా వాడతారు.

 కోసిన పండ్లను బాగా ఎండపెడతారు. ఆ తరువాత వాటిని పగలగొడితే మనం వంటల్లో వాడే మసాలా దినుసు జాజికాయ వస్తుంది. దీని సిస్టర్​ స్పైస్​ జాపత్రి​.  గింజ చుట్టూ కప్పినట్టు ఉన్న టిష్యూస్​ను తీసేస్తే వంటల్లో వాడేందుకు జాపత్రి సిద్ధం.

వర్షాకాలం తరువాత

సిన్నమన్​... దాల్చిన చెక్కను రెండు రకాల చెట్ల బెరడు నుంచి తీస్తారు. వాటిలో ఒకటి సిన్నమోమమ్​ వీరమ్​.. దీన్నుంచి దాల్చిన చెక్క స్టిక్స్​ తీస్తారు. సిన్నమోమమ్​ కాస్సియా నుంచి పొడి చేస్తారు. ఈ రెండు రకాలు భిన్నమైన టెక్చర్​తో ఉంటాయి. ఫ్లేవర్​ కూడా వేరుగా ఉంటుంది. కానీ రెండూ చెట్టు బెరడు నుంచే తయారవుతాయి. ఈ మొక్క నాటి చెట్టుగా మారిన రెండేండ్లకు దీన్నుంచి ప్రొడక్షన్​ మొదలవుతుంది. 

దాల్చిన చెట్టు కొమ్మలనుంచి బెరడును వలవడం ఈజీ. కాకపోతే వర్షాల తర్వాత అయితే బెరడు మెత్తగా అయ్యి తీయడం సులభం అవుతుంది. అందుకనే వర్షాకాలం తరువాత ఈ పంట కోత మొదలుపెడతారు. మిగతా సీజన్స్​లో కోయాలంటే మాత్రం చెట్టు కొమ్మలను​ నీళ్లలో నానబెట్టి ఆ తరువాత బెరడు వలుస్తారు.

వేడి పుడుతుంది

దాల్చిన చెక్క, అల్లం, జాజికాయలను  వేడిని పుట్టించే మసాలా దినుసులుగా చెప్తారు.  వాటి వల్ల శరీరంలో ఎలాంటి ప్రభావం కలుగుతుందనేది తెలుసుకుంటే వాటిని వంటల్లో వాడడం ఇంకా బాగా తెలుస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే సిన్నమాల్డిహైడ్​ అనే కాంపౌండ్​ వల్ల అద్భుతమైన రుచి, వాసన ఉంటుంది. దాల్చిన చెక్క తిన్నప్పుడు వీటిలో ఉండే ఈ రసాయనం ప్రభావం నాడీ వ్యవస్థ మీద పడి, శరీరంలో వేడి పుడుతుంది. 

ఇదొక్కటే కాదు సిన్నమాల్డిహైడ్​ రక్తంలోని గ్లూకోజ్​ స్థాయిలను తగ్గిస్తుంది. అందుకని సుష్టుగా భోజనం చేశాక దాల్చిన చెక్క టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. ఆసియా అంతటా ట్రెడిషనల్​ మెడిసిన్​లో కొన్ని వేల ఏండ్ల నుంచి దాల్చిన చెక్కను వాడుతున్నారు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్​​, జీర్ణక్రియకు ఉపయోగపడే ధర్మాలు ఉన్నాయి.

పొట్ట ఉబ్బరానికి చెక్​

క్రిస్టఫర్​ కొకోలంబస్​ మొదటి సముద్రయానం అట్లాంటిక్​ మీదుగా పశ్చిమంకు ఎందుకు జరిగింది? దాల్చినచెక్క, ఇతర మసాలా దినుసులను నేరుగా కొనుగోలు చేసేందుకు ఆసియాకు నేరుగా మార్గాన్ని కనుగొనాలనే. నిజానికి సుగంధద్రవ్యాల వ్యాపారాన్ని ప్రపంచీకరణ కథకు సూక్ష్మరూపంగా చెప్పొచ్చు. దానివల్ల ప్రయోజనాలు, హాని గురించి మాట్లాడడం ఇక్కడ అప్రస్తుతం. ఇకపోతే అల్లం, జాజికాయ నాడీవ్యవస్థ వెచ్చగా ఫీలయ్యేలా ఎలాంటి ట్రిక్​ చేయవు.  

కానీ ఈ రెండింటిలో జీర్ణక్రియకు ఉపయోగపడే, వైరల్​, బ్యాక్టీరియల్​ ఇన్ఫెక్షన్స్​ రాకుండా అడ్డుపడే అసంఖ్యాకమైన మూలకాలు ఉన్నాయి. అల్లంలో వికారానికి అడ్డుపడే  జింజెరోల్​ అనే కాంపౌండ్​ ఉంది. ఇది పేగులో కదలికలను పెంచుతుంది. అంటే తిన్న పదార్థాలు పేగుల్లో ఎక్కువసేపు ఉండనీయకుండా చేస్తుందన్నమాట. దానివల్ల గ్యాస్​ ఉత్పత్తి కాదు. ఎంత మేలు చేస్తుందో కదా! లేదంటే గ్యాస్​ వల్ల పొట్ట ఉబ్బరంతో ఎంత ఇబ్బంది పడాలో చాలామందికి తెలిసిన విషయమే.

గ్లూకోజ్​ తగ్గించి...

పూర్వం రోజుల్లో అల్లాన్ని ఆహారం కోసమే వాడేవాళ్లు. అంటే మాంసం నిల్వ చేసేందుకు అల్లంను మాంసం మీద కోటింగ్​లా వేసేవాళ్లు. నిల్వ చేసిన మాంసాన్ని  శీతాకాలంలో తినేవాళ్లు. అల్లం మిగతా మసాలా దినుసుల్లా కాదు. దీన్ని రకరకాలుగా వాడతారు... తాజాగా, ఎండబెట్టి, నూరి, పచ్చడిగా వాడతారు. ఇలా ఏ రకంగా వండినా దాని ప్రతీ వెర్షన్​కి ఒక స్పెషల్​ సిగ్నేచర్​ జింజర్​ బైట్​ ఉంటుంది.
 

దాల్చినచెక్క, జాజికాయలు యాంటీ డయాబెటిక్​గా పనిచేస్తాయి. రక్తంలో గ్లూకోజ్​ లెవల్స్​ను తగ్గించడమే కాకుండా సీరమ్​ ఇన్సులిన్​ను పెంచుతాయి. ఈ ఇన్సులిన్​ శరీరంలో చక్కెర నిల్వలను క్రమపరచడంలో సాయపడుతుంది. తయారైన గ్లూకోజ్​ను రక్తంలో నుంచి కణాల్లోకి వెళ్లేలా చేస్తుంది. శరీరానికి శక్తి అవసరమైనప్పుడు కణాల్లో నిల్వ ఉన్న గ్లూకోజ్​ను వాడుకుంటుంది.

జాజితో ప్లేగు రాదని...

జాజికాయ గింజలు జబ్బులకు కారణమయ్యే​ బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని కలిగి ఉండడంతో పాటు మరెన్నో సమ్మేళనాలు​ ఉంటాయి. బ్యుబోనిక్​ ప్లేగ్​ను నివారించడంలో జాజికాయ పనిచేస్తుందని1600 సంవత్సరం ప్రాంతంలో డాక్టర్లు నమ్మారు. అప్పట్లో చాలామంది జాజికాయను మెడకి తాయెత్తులా కట్టుకునేవాళ్లు. జాజికాయలో ఉన్న క్రిములను చంపే గుణమే అందుకు కారణం. జాజికాయను మెడకు కట్టుకోవడం వల్ల ప్లేగుని వ్యాప్తిచేసే ఈగలు దరిచేరవని నమ్మారు వాళ్లు.ఒక్కో సీజన్​లో ఒక్కో రకమైన వంటకాలు చేసుకుని తినడం ఒక సంప్రదాయంగా ఎందుకు వస్తుందో ఫుడ్​ సైన్స్​ గురించి లోతుగా తెలుసుకుంటే అర్థమవుతుంది. 

మోతాదు మించొద్దు..

దాల్చిన చెక్కను మోతాదు మించకుండా వాడితే ఏం కాదు. అలాకాకుండా ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది. అలాగని ఇంత డోస్​ మాత్రమే తీసుకోవాలి అనే సూత్రీకరణ ఎవరూ చేయలేదు. రోజుకి అర టీ స్పూన్​ నుంచి ఒక టీస్పూన్​ దాల్చిన చెక్క పొడి తీసుకుంటే చాలంటున్నారు కొందరు ఎక్స్​పర్ట్స్. అంటే రోజుకి రెండు నుంచి నాలుగు గ్రాములు అన్నమాట. ఇంకొన్ని స్టడీల్లో ఒక గ్రాము నుంచి ఆరు గ్రాముల దాల్చిన చెక్క తీసుకోవచ్చని తేలింది. 

మోతాదు మించి దాల్చిన చెక్క వాడితే నోరు, పెదవులు మండిపోతాయి. కొందరికి అలర్జీ వస్తుంది. చర్మం ఎర్రగా మారి, దురద పుడుతుంది. కాలేయ సంబంధిత సమస్యలు ఉంటే దాల్చిన చెక్క వాడకం డేంజర్​. ఇందులో ఉండే కౌమరిన్​ అనే పదార్థం వల్ల లివర్ సమస్యలు పెరుగుతాయి. పిల్లలు, గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు దాల్చిన చెక్కను ఒక ట్రీట్​మెంట్​లా వాడొద్దు.
 

డయాబెటిస్​ ఉన్న వాళ్లు దాల్చిన చెక్క​ సప్లిమెంట్స్​ వాడడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. అలా తోచినట్టు వాడడం వల్ల రక్తంలో చక్కెర శాతం మీద ప్రభావం పడుతుంది. సప్లిమెంట్స్​ వాడాలనుకున్న వాళ్లు డాక్టర్​ని అడిగిన తరువాతే వాడాలి. అలాగయితేనే  అప్పటికే తీసుకుంటున్న మెడిసిన్స్​లో మార్పులు అవసరమా? అనేది డాక్టర్లు చెప్తారు. డయాబెటిస్​ ఉన్న వాళ్లే కాదు ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఎందుకంటే వాడే సప్లిమెంట్స్​ యాంటీబయాటిక్స్​, డయాబెటిస్​ డ్రగ్స్​, బ్లడ్​ తిన్నర్స్​, హార్ట్​ మెడిసిన్స్​ వంటి వాటిమీద ప్రభావం చూపుతాయి.

దాల్చిన చెక్క నీళ్లు 

రాత్రి భోజనం తరువాత దాల్చిన చెక్క నీళ్లు  లేదా టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించొచ్చు. అంతేకాకుండా మెటబాలిజమ్​ కూడా దారిన పడుతుంది. 

దాల్చిన చెక్క నీళ్లు లేదా టీ తాగడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. దీనివల్ల అర్థరాత్రిళ్లు చిరుతిళ్లు తినడం, అది తినాలి... ఇది తినాలి అనే కోరికను తగ్గించేస్తాయి. దాంతో బరువు తగ్గడం ఈజీ అవుతుంది!

జాజికాయ

జాజికాయ రోజుకి ఎంత తీసుకుంటే బెటర్​ అనేందుకు ప్రత్యేకంగా గైడ్​లైన్స్​ లేవు.  కానీ ఒకటి నుంచి రెండు మిల్లీగ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఐదు గ్రాములు అంతకంటే ఎక్కువ జాజికాయను వాడడం ఆరోగ్యానికి చేటు చేస్తుందని స్టడీలు చెప్తున్నాయి. మోతాదు మించితే... గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. వాంతులు అవుతాయి. గందరగోళంగా ఉంటుంది. ఆందోళన కలుగుతుంది. అందుకే జాజికాయను వంటల్లో అరకొరగా వేసుకోవడమే తప్ప ఇతరత్రా వాడొద్దని చెప్తున్నారు ఎక్స్​పర్ట్స్​.  జాజికాయ చర్మానికి మంచిదని స్కిన్​కేర్​ ప్రొడక్ట్స్​లో వాడతారు. 

అల్లం

అల్లం రోజూ తిన్నా ఏం కాదు. కాకపోతే రోజుకి మూడు నుంచి నాలుగు గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అదే గర్భిణులు అయితే రోజుకి ఒక గ్రాము వాడాలంతే. 
రోజుకి ఆరు గ్రాముల కంటే ఎక్కువ అల్లం వాడితే గ్యాస్ట్రోఇంటెస్టైనల్​ సమస్యలు అంటే రిఫ్లెక్స్​, గుండెలో మంట, డయేరియా వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.
 

ఒక గ్రాము అల్లం అంటే... పొడిగా అయితే అర టీస్పూన్ శొంఠిపొడి. ఒక టీస్పూన్​ అల్లం తురుము. నాలుగు కప్పుల నీళ్లలో నానబెట్టిన అర టీస్పూన్​ అల్లం తురుము.
అధిక మొత్తంలో అల్లం వాడడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సైడ్​ ఎఫెక్ట్స్​ తలెత్తుతాయి. నిపుణుల సలహా లేకుండా అల్లంను మెడిసిన్​గా వాడొద్దు.

ఆరోగ్యానికి మంచిది కదా అని అక్కడా, ఇక్కడా విని... మోతాదుకి మించి ఏ పదార్థం వాడినా ఆరోగ్యాన్ని డేంజర్​లో పెట్టుకున్న వాళ్లవుతారు. అందుకే ఏది? ఎంత? వాడాలో తెలుసుకుని వాడాలి. ఒక ఐడియా కోసం ఇక్కడ కొందరు ఎక్స్​పర్ట్స్​ చెప్పిన సమాచారం ఇచ్చాం. హెల్త్​ విషయంలో ఎక్స్​పరిమెంట్​ చేయకుండా మీ డాక్టర్​ని అడిగిన తరువాతే ఏదైనా మొదలుపెట్టాలి.