వీడియో: క్రీడా స్ఫూర్తి అంటే ఇదీ..! షకీబ్‌కు చీవాట్లు పెడుతున్న నెటిజెన్స్

వీడియో: క్రీడా స్ఫూర్తి అంటే ఇదీ..! షకీబ్‌కు చీవాట్లు పెడుతున్న నెటిజెన్స్

ఆట ఏదైనా గెలుపు కోసమే కదా! షకీబుల్ హ‌స‌న్ చేసిన దానిలో తప్పేముంది అనకండి. క్రికెట్ నిబంధనల ప్రకారం.. అతను చేసింది కరెక్ట్ అయినా క్రీడా స్ఫూర్తి మరిచాడనేది అతనిపై వస్తున్న విమర్శలు. కాకపోతే నిర్దిష్ట సమయానికి బ్యాటర్ బంతిని పేస్ చేయలేదని అప్పీల్ చేయడమేంటి..! అంపైర్ ఔట్ ఇవ్వడమేంటి చెప్పండి. ఈ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. 

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో లంక బ్యాటర్ ఏంజెల్ మాథ్యూస్ టైమ్డ్ అవుట్ పద్ధతిలో ఔటైన విష‌యం తెలిసిందే. నిర్ధేశిత సమయానికి అతను బంతిని పేస్ చేయలేదని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హ‌స‌న్.. అప్పీల్ చేయడం.. అంపైర్లు ఔట్ ఇవ్వడం జరిగాయి. దీంతో అతని పేరు మార్మోగింది. ఇప్పుడు ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో ఒక మ్యాచ్ లో విక్టోరియా జ‌ట్టు కెప్టెన్ విల్ స‌థ‌ర్‌లాండ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌ను నిల‌బెట్టడంతో షకీబ్ పేరు మరోసారి వినబడుతోంది.

ఏం జ‌రిగిందంటే..? 

షెఫీల్డ్ షీల్డ్‌ టోర్నీలో భాగంగా విక్టోరియా- సౌత్ ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో రెండో రోజు సౌత్ ఆస్ట్రేలియా బ్యాట‌ర్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్‌ 18 ప‌రుగుల వ‌ద్ద డౌగ్ వారెన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. బంతి బ్యాట్ తగలనప్పటికీ వేగంగా తిరుగుతూ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న పీట‌ర్ హ్యాండ్స్‌కాంబ్‌ చేతుల్లో పడింది. వెంటనే విక్టోరియా ఆట‌గాళ్లు గ‌ట్టిగా అప్పీల్ చేయ‌డంతో అంపైర్ అత‌డిని ఔట్ గ ప్రకటించాడు. దాంతో, ఫ్రేజ‌ర్ నిరాశ‌గా పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. ఆ సమయంలో విక్టోరియా కెప్టెన్ విల్ స‌థ‌ర్‌లాండ్ అందరినీ ఆశ్చర్యపరిచేలా చేశాడు.

రీప్లేలో బంతి బ్యాట్‌కు త‌గ‌ల‌లేద‌ని తేలడంతో.. విల్ జ‌ట్టు ఇతర స‌భ్యుల‌తో కాసేపు చర్చించి అప్పీల్‌ను వెన‌క్కి తీసుకున్నాడు. దాంతో, ఫ్రేజ‌ర్ మ‌ళ్లీ బ్యాటింగ్ కొన‌సాగించాడు. ఈ మ్యాచ్‌లో విక్టోరియా కెప్టెన్ విల్ చూపిన క్రీడా స్ఫూర్తిని అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. అదే సమయంలో బంగ్లా కెప్టెన్ షకీబుల్ హ‌స‌న్‌ను విమర్శిస్తున్నారు. క్రీడా స్ఫూర్తి అంటే ఇదీ అని అతనికి చీవాట్లు పెడుతున్నారు.