హైదరాబాద్, వెలుగు: దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కొత్తగా 2,043 ఆలయాలకు ధూప, దీప, నైవేద్య పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్నమని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,645 దేవాలయాల్లో ఈ పథకం అమలవుతున్నదని, కొత్త వాటితో కలుపుకుని మొత్తం 6,661 దేవాలయాలకు ధూప, దీప, నైవేద్య పథకం అమలు కానుందని మంగళవారం ప్రకటనలో తెలిపారు. అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే దీన్ని అమలు చేయనున్నామని తెలిపారు. కాగా, ఆధ్మాత్మిక దినోత్సవం సందర్భంగా యాదాద్రి టెంపుల్లో నిర్వహించే పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనున్నారు.
బుధవారం నుంచి భక్తులకు మిల్లెట్ ప్రసాద సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆధ్మాత్మిక దినోత్సవం సందర్భంగా భక్తులకు ఉచితంగా మిల్లెట్ ప్రసాదాన్ని అందజేయడంతోపాటు యాదాద్రి శ్రీ లక్షీనరసింహస్వామి వారి బంగారం, వెండి నాణేల అమ్మకం, ఆన్ లైన్ టికెట్ సేవలు, రాయగిరి వేదపాఠశాల నిర్మాణానికి భూమిపూజ, అన్నదాన సత్రం ప్రారంభం, ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలో కల్యాణ మండపాన్ని మంత్రి ప్రారంభించనున్నారు.