నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నిర్మల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 9 ఏండ్లుగా ఏ ఒక్క రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందించలేదన్నారు. రైతులను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాలకే స్థానిక మంత్రి ప్రాధాన్యతనిస్తున్నాడని విమర్శించారు. 

నిర్మల్ పట్టణంలో నాలాలు ధ్వంసం చేసి వాటిపైనే ఫుట్ పాత్​లు నిర్మించారని, దీని కారణంగా చిన్నపాటి వర్షానికి పట్టణమంతా వరదతో మునిగిపోతోందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జ్ రావుల రామనాథ్, అదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యనగారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసిమ్మె రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదు

ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపల్ పరిధిలో అక్రమంగా వెలిసిన కట్టడాలు, వెంచర్లను బీజేపీ అధికారంలోకి రాగానే తొలగిస్తామని రాథోడ్ రమేశ్ అన్నారు. ఖానాపూర్​లోని ముంపునకు గురైన జేకే నగర్, శ్రీరాంనగర్,రాజీవ్ నగర్, విద్యా నగర్ కాలనీల్లో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీ నాయకుల అండతో కప్పల కుంట చెరువు ఆక్రమణకు గురై అక్రమ వెంచర్లు వెలిశాయని మండిపడ్డారు. బీజేపీ పట్టణాధ్యక్షుడు నాయిని సంతోష్, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, నాయకులు బుచ్చన్న యాదవ్, దేశాయ్ రాము తదితరులు పాల్గొన్నారు.

రైతుల కోసం పోరాటం చేస్తాం

భైంసా: వరద బాధితులకు ప్రభుత్వం సాయం చేయకపోతే రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్​అన్నారు. తానూర్​ మండలంలోని కల్యాణి, జవుల, వడ్​గాం గ్రామాల్లో నష్టపోయిన పంటలు, కూలిన ఇండ్లు, దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. బాధితులందరికీ  ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. మాజీ ఎంపీపీ సుభాష్​జాదవ్, లీడర్లు పాల్గొన్నారు. 

వెంటనే పరిహారం చెల్లించాలి

బాసర:  భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామారావు పటేల్​డిమాండ్​ చేశారు. బాసర మండలంలోని లాబ్ది, దోడాపూర్, టాక్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు, రోడ్లను ఆయన పరిశీలించారు. ఇండ్లు కూలిన బాధితులు, రైతులకు సకాలంలో పరిహారం అందించాలన్నారు. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు. ఆయన వెంట లీడర్లు విజయ్, మారుతి పటేల్, రమేశ్, దశరథ్​ తదితరులున్నారు.