కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ పై తాను చేసిన వ్యాఖ్యలు భావోద్వేగంతో చేసినవేనని, వేరే ఉద్దేశం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 33ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్ధులపై గానీ, ఇంకెవరి పైనా కూడా ధూషించలేదని చెప్పారు. తన శత్రువులను కూడా దగ్గర తీసే తత్వం నాదన్న కోమటిరెడ్డి.. తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానంటూ ప్రశ్నలు సంధించారు. చదువుకున్న వ్యక్తిగా జనరల్ స్థానం అయిన నల్లగొండ మున్సిపాలిటీ ఛైర్మన్ గా వెంకట్ నారాయణ గౌడ్ కు అవకాశం ఇచ్చామని తెలిపారు. నల్లగొండ మున్సిపాలిటీకి 3 సార్లు జనరల్ అయినప్పటికీ ఆ మూడు సార్లు పట్టుబట్టి బలహీన వర్గాల వారికే దక్కేలా చూశానని ఆయన గుర్తు చేశారు.
తాను మాట్లాడిన విషయాలు కట్ చేశారని, కొన్ని అంశాలు మాత్రమే లీక్ చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. రికార్డు పెట్టారని తనకు తెలుసని, పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి చెరకు సుధాకర్ తనను తిడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు తిడుతున్నారని కూడా అడిగానన్నారు. చెరకు సుధాకర్ పై పీడీయాక్ట్ పెడితే.. తానే కోట్లాడానని, తనను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకుకు చెప్పానని స్పష్టం చేశారు. అన్యదా భావించొద్దని ప్రజలను కోరుతున్నాని కోమటిరెడ్డి అన్నారు. తనను సస్పెండ్ చేయాలని, దరిద్రులు అనడం వల్లే.. భాధతో మాట్లాడానని తెలిపారు. నకిరేకల్ లో తనపై పోస్టర్ లు వేశారన్న ఆయన... ఎవరు వేశారో కూడా తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాళ్ళు చంపేస్తారేమోనని భయంతో మాత్రమే చెప్పానని, తనపై చేసిన వాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేక, ఇంఛార్జి ఠాక్రే కు ఫిర్యాదు చేశానన్నారు. వెంకట్ రెడ్డిని తిడితే నకిరేకల్ టికెట్ వస్తుందని అనుకుంటున్నారన్న వెంకట్ రెడ్డి... వీడు ,వాడు అని తనను సంబోధించొచ్చా అని ప్రశ్నించారు.