చేతనైతే నాపై అవిశ్వాసం పెట్టండి.. జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య

ఇల్లెందు, వెలుగు:  ప్రజల్లో తనకున్న ప్రజాధరణను ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని, చేతనైతే తనపై అవిశ్వాసం పెట్టాలని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సవాల్​ విసిరారు. మంగళవారం ఇల్లెందు జడ్పీ క్యాంపు ఆఫీస్​లో ఆయన మీడిమాతో మాట్లాడారు. సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తనపై మంత్రి పువ్వాడ, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ చేసిన విమర్శలపై జడ్పీ చైర్మన్​ కోరం స్పందించారు. గతంలో తనపై అవిశ్వాసానికి ప్లాన్ చేసి బొక్కాబోర్లా పడ్డారని గుర్తుచేశారు. మంత్రిగా పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందనివారిని తరిమికొట్టాలంటూ దాడులను చేయించడం సిగ్గుచేటన్నారు. 

ప్రజా నాయకుడు పొంగులేటిపై అనుచిత వ్యాఖ్యలు అర్థరహితమని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని హెచ్చరించారు. పట్టణంతోపాటు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే హరిప్రియ ఏమి అభివృద్ధి చేశారో చూపాలన్నారు. ఎంపీటీసీలు మండల రాము, పూనెం సురేందర్, లీడర్లు బోళ్ల సూర్యం,చిల్లా శ్రీనివాసరావు, ఊరుగొండ ధనుంజయ్, తాటి బిక్షం, సువర్ణపాక సత్యనారాయణ, నంద కిషోర్, నెల్లూరి సైదులు, రావూరి సతీశ్, ఎల్లయ్య పాల్గొన్నారు.