విద్యార్థి శక్తికి సరికొత్త స్ఫూర్తి భవన్

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) దేశంలో ప్రభావశీలమైన సంఘం. 1967 కాలంలో హైదరాబాద్​లోని కింగ్​కోఠి, తిలక్​నగర్​లలో చిన్న గదుల్లో కార్యక్రమాలను కొనసాగిస్తూ.. వచ్చిన ఏబీవీపీ ఇయ్యాల తార్నాకలో నాలుగు అంతస్తుల రాష్ట్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభించుకోబోతోంది. ఆర్ఎస్ఎస్​సర్​ సంఘ్​ చాలక్ ​మోహన్​ భగవత్​ రేపు ఈ స్ఫూర్తి ఛాత్రశక్తి భవన్ ను ప్రారంభించనున్నారు.

స్వాతంత్ర్యం తర్వాత దేశ వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలతోపాటు దేశం కోసం, దేశ సమైక్యత కోసం పాటు పడుతున్న అతి పెద్ద క్రియాశీల విద్యార్థి సంఘం ఏబీవీపీ. దేశవ్యాప్తంగా ఏబీవీపీ కార్యక్రమాలు, ఉద్యమాలు, పోరాటాలు, సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కొత్త భవనం ప్రారంభించుకుంటున్న ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఏబీవీపీ కృషిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఏబీవీపీ క్రీయాశీలక పాత్ర పోషించింది. 1997 నెల్లూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలుగా విభజించాలని తీర్మానం చేసింది. దానికి అనుగుణంగానే కృష్ణ, గోదావరి జలాలను బీడు భూములకు అందించాలని కోరుతూ.. బాసర నుంచి శ్రీశైలం వరకు సస్యశ్యామల రథయాత్రను ఏబీవీపీ నిర్వహించింది. ఈ యాత్ర తెలంగాణ పల్లెల్లో రాష్ట్ర ఆవశ్యకతను గుర్తు చేసింది. తర్వాత అన్ని రాజకీయ పార్టీలు తమ ఎజెండాలో చేర్చక తప్పలేదు.

మలి దశ ఉద్యమంలో..

తెలంగాణ సాధన కోసం 2009 డిసెంబర్ 8న ఏబీవీపీ ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంతో తెలంగాణ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అదేరోజు అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు. రాజకీయ నాయకుల కుట్రలతో వెనక్కి తగ్గిన యూపీఏ ప్రభుత్వంపై అనేక రూపాల్లో ఏబీవీపీ ఉద్యమాలు చేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ‘నా రక్తం- నా తెలంగాణ’ పేరుతో ఒకే రోజు20 వేల మంది విద్యార్థులు, యువకులతో ఏబీవీపీ రక్తదానం చేపట్టి రికార్డు సృష్టించింది. ఒకేరోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించింది. 2010 జనవరి 23న నిజాం కాలేజీ గ్రౌండ్ లో వేలాది మంది విద్యార్థులతో భారీ రణభేరి చేపట్టింది. ఈ రణభేరి బహిరంగ సభలో అప్పటి లోక్​సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, బతికుండి రాబోయే తెలంగాణను కనులారా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులతో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ నాలుగు ప్రాంతాల నుంచి పాదయాత్ర నిర్వహించి ఉస్మానియా యూనివర్సిటీలో మరో రణభేరీ బహిరంగ సభతో పాదయాత్ర ముగించింది. ఇలా పల్లె  నుంచి పట్టణం వరకు, బడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు అనేక ఉద్యమాలు నిర్మించింది. పోలీసుల లాఠీ దెబ్బలు, రబ్బరు తూటాలకు వెనక్కి తగ్గకుండా నిరసనలు, ఆందోళనలతో యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించింది. 

విద్యార్థుల సంక్షేమం కోసం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యారులు ఉండే సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై ఏబీవీపీ సర్వే నిర్వహించింది. 1992లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ‘సంక్షోభంలో సంక్షేమ హాస్టళ్లు’ అని బ్లాక్ పేపర్ విడుదల చేసింది. వేదికపై ఉన్న జస్టిస్ పున్నయ్య మాట్లాడుతూ.. ‘ఈ రోజు మీరు హాస్టల్ నిద్ర చేశారు, పదేళ్ల తర్వాత మంత్రులు, అధికారులు ఆ పని చేస్తారు. అప్పుడు ఈ హాస్టళ్లు మారతాయి, విద్యార్థులకు మేలు జరుగుతుంది’ అని అన్నారు. నిజంగానే వారు చెప్పినట్టు జరిగింది. టీచర్ల నియామకం, ప్రభుత్వ స్కూళ్లు, స్కాలర్​షిప్స్, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని 1996 ఆగస్టు 6న ఉమ్మడి రాష్ట్రంలో చలో హైదరాబాద్ పిలుపునివ్వడంతో వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థి ఉద్యమంపై వాటర్ కెనాల్స్, రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు. వందలాది మంది విద్యార్థులు జైలు పాలయ్యారు. ఏబీవీపీ ఉద్యమంతో దిగివచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

కరోనా టైమ్​లో..

కరోనాతో దేశంలో నెలకొన్న భయాందోళనల నుంచి ప్రజలను జాగృతం చేసి వారికి సాయం అందించి వారికి ఏబీవీపీ అండగా నిలిచింది. వ్యాక్సినేషన్ పై అపోహలను తొలగించింది.  కరోనాతో చనిపోయినవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం, పేద కుటుంబాలకు ఆహారం, నిత్యావసర సరుకులు అందించడం లాంటి కార్యక్రమాలు చేసింది. తరగతి గది విద్యాభ్యాసానికి దూరమైన విద్యార్థులకు ఏబీవీపీ బస్తీలు, పట్టణాలు, నగరాల్లో బడులు నిర్వహించింది. విద్యార్థులను ఉన్నతమైన ఆదర్శాలు గల భావిభారత పౌరులుగా తయారుచేసేలా ఏబీవీపీ కృషి చేస్తోంది. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునఃనిర్మాణమే ధ్యేయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు అన్ని రంగాల విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా ఏబీవీపీ రాష్ట్ర నూతన కార్యాలయం రూపుదిద్దుకుంది. ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర తార్నాకలో నిర్మించిన ఈ భవనాన్ని ఆర్ఎస్ఎస్​సర్​ సంఘ్​ చాలక్ డా. మోహన్​ భగవత్​ లోకార్పణం చేస్తారు. ఈ భవ్యమైన భవన నిర్మాణం, ఎంతోమంది కార్యకర్తల చెమట చుక్కలతో ఒక్కో ఇటుక పేర్చుతూ, పూర్వ కార్యకర్తలు, అధ్యాపకులు, కళాశాల విద్యార్థుల పైసా పైసా విరాళాలతో  నిర్మితమైంది. జాతీయ విద్యావిధానం, దేశంలో, ప్రపంచంలో నడుస్తున్న సమకాలీన అంశాలపై చర్చలకు ఈ స్ఫూర్తి చ్ఛాత్ర శక్తి భవన్ వేదిక కాబోతుంది.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-  శ్రీశైలం వీరమల్ల
జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏబీవీపీ.