- స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి
- ఫుట్‌బాల్ ప్లేయర్ సౌమ్యకు సన్మానం
పెబ్బేరు, వెలుగు: రాష్ట్రంలోని క్రీడాకారుల కోసం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రెండు నెలల్లో కొత్త పాలసీ తీసుకువస్తామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. కేఎల్ఆర్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో బుధవారం పెబ్బేరులోని ఫుట్‌బాల్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ గుగులోతు సౌమ్య సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెబ్బేరులో ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ ఆడేలా మినీ స్టేడియం కోసం మున్సిపల్ కౌన్సిల్, ఎమ్మెల్యే తీర్మానం చేసి పంపిస్తే మంజూరుచేస్తామని చెప్పారు.
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా సాయంత్రం వేళ వాకింగ్, స్పోర్ట్స్‌కు సమయం కేటాయించాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకు చెందిన వ్యక్తి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కావడం, జిల్లాకు నాలుగు స్పోర్ట్స్ హబ్‌లు తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌కు ఎదగాలని ఆకాంక్షించారు. గుగులోతు సౌమ్య మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి జాతీయ జట్టులో తాను మాత్రమే ఆడుతున్నానని, ఈ స్థాయికి ఎదగడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెప్పారు. ప్రభుత్వం తమ వంటి క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో కేఎల్ఆర్ స్పోర్ట్స్ చైర్మన్ కృష్ణ కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీ, డీవైఎస్వో సుధీర్ కుమార్ రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ సురేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని జడ్పీఎస్‌ఎస్‌లో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి గేమ్స్‌ను ప్రారంభించారు. మండలంలోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎంపీడీవో ఆఫీస్ లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.