- కమ్మర్ పల్లిలో అంతర్ మండల పోటీల్లో మొదటి స్థానం
కమ్మర్ పల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో మూడు రోజులుగా హోరాహోరీగా సాగిన 68వ మండల అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలు ముగిశాయి. కమ్మర్ పల్లి మండలంలో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కరోనా ఎఫెక్ట్ వల్ల మూడు , నాలుగు సంవత్సరాలుగా ఈ పోటీలు జరగలేదు.
ఈ సారి జరిగిన పోటీల్లో మండలంలోని అన్ని గ్రామాల నుంచి విద్యార్థులు ఆయా క్రీడల్లో పోటీ పడ్డారు. ఈ పోటీల్లో కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గ్రామానికి చెందిన జడ్పీహెచ్ ఎస్ విద్యార్థులు చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారు.
మార్చ్ ఫాస్ట్ లో చౌట్ పల్లి రెండో స్థానంలో నిలవగా.. కబడ్డీ, ఖోఖో , వాలీబాల్ క్రీడల్లో మొదటి, రెండు స్థానాలు కలుపుకుని మొత్తం 9 షీల్డులు కైవసం చేసుకుంది. విద్యార్థుల క్రీడా పోటీల్లో ప్రతిభ చూపడంపై ప్రిన్సిపాల్ ఆంధ్రయ్య హర్షం వ్యక్తం చేశారు. బహుమతుల ప్రధానోత్సవంలో పీడీ నగేశ్, విద్యార్థులు, గ్రామస్థులు, యువకులు పాల్గొని సంబరాలు
చేసుకున్నారు.