Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో రెండు పతకాలు.. మను భాకర్‌కు భారీ నగదు బహుమతి

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో రెండు పతకాలు.. మను భాకర్‌కు భారీ నగదు బహుమతి

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి భారత ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించిన మను భాకర్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భారీ నజరానాతో సత్కరించింది. చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు ఆమెను యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అభినందించారు. 30 లక్షల రూపాయల నగదు బహుమతితో భారత షూటర్‌ను సత్కరించారు. 

"పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు గెలిచి ఇంటికి తిరిగొచ్చిన మన బిడ్డ మను భాకర్‌ని కలుసుకున్నాను. ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఆమెకు అభినందనలు. మను భాకర్ సాధించిన ఈ విజయం భారతీయ క్రీడా ప్రపంచంలోని మిలియన్ల మంది యువతకు స్ఫూర్తినిస్తుంది. దేశం మొత్తం ఆమెను చూసి గర్విస్తోంది.." అని మాండవ్య తన ఎక్స్ ఖాతాలో రాశారు.

కృతజ్ఞతలు తెలిపిన మను భాకర్

ఒలంపిక్స్‌ ప్రయాణంలో తన కు మద్దతుగా నిలిచిన మాండవియాకు మను భాకర్ కృతజ్ఞతలు తెలిపింది.

"గౌరవనీయులైన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియాను కలవడం గౌరవంగా భావిస్తున్నా.. ఆయన అందించిన మద్దతు, ప్రోత్సాహానికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆయన నిరంతర కృషితో దేశ క్రీడాకారులు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోగలరు.." అని మను భాకర్ ట్వీట్ చేసింది.

కాగా, పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో మను బాకర్‌ రెండు కాంస్య పతకాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రెండు సార్లూ కాంస్య పతకాలను ముద్దాడింది. ఈ రెండు పతకాలతో మను ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అయితే, ఆమె హ్యాట్రిక్ మెడ‌ల్స్ కొట్టే అవ‌కాశాన్ని చేజార్చుకుంది. 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.