క్రీడలను సబ్జెక్టుగా పరిగణించాలి

క్రీడలను సబ్జెక్టుగా పరిగణించాలి

నిత్య జీవితంలో ఆటలు ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో అవసరం.  జీవితంలో ఆటల వల్ల క్రమశిక్షణ, నాయకత్వలక్షణాలు, నిజాయతీ, నిబద్ధత, ఆత్మవిశ్వాసం అలవడుతాయి. చిన్ననాటినుంచే ఆటలు అలవర్చటం వల్ల ఒక సామూహిక లక్ష్యం కోసం పనిచేయాలన్న అవగాహన ఏర్పడుతుంది. దీనివల్ల వ్యక్తిగత, వృత్తి, విద్యారంగంలోనూ వ్యక్తులు మెరుగ్గా పనిచేస్తారు. 

నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం అలవడుతుంది.  ఖోఖో, కబడ్డీ, పోలోలాంటి ఆటలు భారత్​లోనే ఉద్భవించి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి.  ప్రస్తుతం చెస్ అప్పట్లో చతురంగ... ఆ తర్వాత చదరంగంగా మారింది.  పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో క్రీడల్ని ఒక సబ్జెక్ట్ గా పరిగణించి తప్పనిసరిగా అమలు చెయ్యాలి. మల్టీనేషనల్ కంపెనీలు, సాఫ్ట్​వేర్లు, ఐఐటీలతో పాటు అథ్లెటిక్స్, స్పోర్ట్స్ కూడా ఈ దేశ విద్యార్థులకు అవసరమే. విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షల్లో పర్సంటేజీలు,  గ్రేడ్​లతో పాటు  ఇంటి దగ్గర ఆటలు ఆడేలా ప్రోత్సహించాల్సిన అవసరముంది.

జాతీయ విద్యా విధానం-2020లో కూడా క్రీడల్ని ఒక ముఖ్య పాఠ్యాంశంగా చేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. క్రీడలు విద్యార్థులకు గెలుపు, ఓటముల్ని అర్థం చేసుకోవటానికి, తప్పుల్ని సరిదిద్దుకొని ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని కొనసాగించటానికి ఉపయోగపడతాయి. ఈ కారణంగానే ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు అన్నీ క్రీడల్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాయి. 

చిన్నప్పటినుంచే ఆటపాటలున్న విద్యావిధానం వల్ల డ్రాపవుట్స్ తగ్గి హాజరు శాతం పెరుగుతుంది. విద్యా సంబంధ విషయాల్లో విద్యార్థులు చురుకుగా ఉంటారు. ప్రస్తుతమున్న ఒత్తిడి విద్యా విధానంలో విద్యార్థులకు ఉపశమనంలాగ క్రీడలు తోడ్పడుతాయి. ఎవరైనా తమకు నచ్చిన క్రీడలో ప్రతిభ చూపిస్తే వాళ్లు జీవితంలోనూ తాము ఎంచుకునే రంగంలోనూ విజయం సాధిస్తారు.  

కానీ ఏదేశంలోనూ లేనివిధంగా భారత్ లో విద్యార్థులు విద్యాసంబంధ  విషయాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. విద్యాసంస్థలు కూడా వాళ్లకు ఐఐటీ,  జేఈఈ లాంటి  పరీక్షలపైనే తర్ఫీదునిస్తున్నారు.  కానీ, క్రీడలపై శీతకన్ను వేస్తున్నారు. ఆటలంటే సమయం వృథా అవుతుందని... పిల్లలు ఆటలు ఆడిన తర్వాత చదువుకోవటానికి సరైన శక్తి ఉండదని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ చాలా పరిశోధనలు విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరమని స్పష్టం చేశాయి. 

క్రీడల్లో భారత యువత వెనుకంజ 

ఎంతో సాంస్కృతిక చరిత్ర, వైవిధ్యం ఉన్న భారత్ లోని యువత అనేక రంగాల్లో దూసుకుపోతోంది. కానీ,  క్రీడారంగంలో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే వెనుకంజలో ఉంది. ఆటల్ని మన జీవన విధానంలో ఒక భాగం చేసుకొని విద్యార్థులకు శిక్షణనిస్తే  ప్రపంచం క్రీడారంగంలో కూడా త్రివర్ణపతాకం రెపరెపలాడుతుంది.  నీరజ్ చోప్రా, సైనా నెహ్వాల్,  పీవీ సింధులాంటి మరిన్ని వజ్రాల్ని తీర్చిదిద్దగల సత్తా ఈ దేశానికుంది.  

కేవలం పతకాల కోసమే ఆటలు ఆడాలన్న ఆలోచనా విధానాన్ని మన విద్యార్థుల మెదళ్లలోంచి తొలగించి... వ్యక్తిగత జీవిత అభివృద్ధికి ఆటలు ముఖ్యమని నిరూపించాలి. పిల్లల్ని ఆటల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.  చిన్నప్పటి నుంచే వాళ్లకున్న ఆసక్తిని గమనించి అటువైపు శిక్షణనివ్వాలి.  క్రీడల్ని సామాజిక బాధ్యతగా తీసుకొని పల్లె, పట్టణం తేడా లేకుండా విస్తరింపజేయాలి.   

వివేకానందుడు చెప్పిన ఇనుప కండరాలు - ఉక్కు నరాలు కలిగిన యువత ఈ దేశగతినే కాదు ప్రపంచ దిశను మార్చడానికి ముందుకు ఉరుకుతున్నది. కానీ, దురదృష్టకరం ఏంటంటే కార్పొరేట్ చదువుల మాయాజాలంలో చిక్కి యువత శారీరక మానసిక ఆరోగ్యం మాయమవ్వడంతో ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.  తల్లిదండ్రులు సంపాదన మోజులో పడి కుటుంబ బంధాలు బలహీనపడడంతో క్రీడలపట్ల  యువకులు నిరాసక్తతను వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటితో యువత ఉబకాయం, బీపీ, షుగర్, మానసిక రోగాలకు గురవుతున్నారు. 

విద్యార్థులందరూ క్రీడా భాగస్వాములు కావాలి

‘ఏ సౌండ్​ మైండ్​ ఇన్​ ఏ సౌండ్ బాడీ’ అన్న సూక్తిని  స్ఫూర్తిగా తీసుకొని వివేకానందుడి బోధనలను,  నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాగించిన టీమ్స్ స్పిరిట్​తో కూడిన ఉద్యమ స్ఫూర్తిని  విద్యార్థులలో రంగరించేందుకు ఏబీవీపీ ఖేలో భారత్ అభియాన్ ను చేపట్టింది. ఈ జనవరి 23 నుంచి 30 వరకు మన రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఆటల పోటీలలో పాఠశాల, కళాశాలల విద్యార్థులందరూ భాగస్వాములు కావాలని విద్యార్థిలోకానికి ఏబీవీపీ ఆహ్వానం పలుకుతోంది.   మనమంతా చలో ‘మైదాన్’ అంటేనే మన మెదడు పాదరసంలా పనిచేస్తుంది.  మనం ఆడే ప్రతి ఆట  మనకు జీవనపాఠాలను నేర్పిస్తుంది.  మనం క్రీడా పోటీలలో వేసే ప్రతి అడుగు మనల్ని జీవితంలో విజయ తీరాలకు చేరుస్తుంది.

ఆటల మైదానాలకు రండి!

మనము ఆడే ఖోఖో ఆటలో 'ఖో' అనగానే వేగంగా స్పందించి కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. బ్యాడ్మింటన్​లో మనపై వేగంగా దూసుకు వస్తున్న కాక్​ని అంతే వేగంగా తిరుగు టపాలో పంపే నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. క్రికెట్ ఆట జట్టు గెలవడానికి ప్రతి సభ్యుడు సమన్వయంతో పనిచేస్తేనే గెలుపు సాధ్యమని నిరూపిస్తుంది. 

ఇలా ప్రతి ఆట మన జీవన నైపుణ్యాలను పెంచి మనం చేసే ప్రతి పనిలో వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంచి మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది.  ఈ క్రీడోత్సవాలలో భాగంగా నిర్వహించే ఆటల పోటీలలో పాల్గొనేందుకు విద్యార్థులందరూ ముందుకు రావాలని కళాశాల, పాఠశాల యాజమాన్యాలు, అధ్యాపకులు, పీడీలు విద్యార్థులను  సమాయత్తం చేయాలని కోరుతున్నాం.  

డ్రగ్స్ లేని సమాజాన్ని సృష్టిద్దాం...దృఢ యువశక్తిని సృష్టిద్దాం....  యువకుల్లారా  కార్పొరేట్ చదువుల ఒత్తిడితో  మరణ తీరాలకు కాదు .... మైదానాలకు రండి.

- జీవన్, ఏబీవీపీ జాతీయకార్యవర్గ సభ్యుడు-