క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై రాణించాలి : మంత్రి సింగిరెడ్డి

క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై రాణించాలి : మంత్రి సింగిరెడ్డి

వనపర్తి, వెలుగు: క్రీడలు జీవితంలో భాగంగా కావాలని, మన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌ రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట గురుకుల పాఠశాలలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రీజినల్ స్పోర్ట్స్ ను  ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహంతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ జనాభాకు తగ్గట్టుగా అంతర్జాతీయ వేదికలపై పతకాలు రావడం లేదని వాపోయారు. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని,  చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్న భారత్‌‌లో క్రీడాకారులకు సరైన వసతులు కల్పించకపోవడం బాధాకరమన్నారు. చిన్నచిన్న దేశాలు కూడా సత్తా చాటుతున్నాయని, దేశంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులున్నా ప్రోత్సాహం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం  క్రీడలకు పెద్దపీట వేస్తోందని, జిల్లా కేంద్రాల్లో స్టేడియాలతో పాటు ప్రతి గ్రామంలో ప్లే గ్రౌండ్లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అందులో అన్ని సౌకర్యాలు కల్పించి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.   

మెడికల్ కాలేజీ అనుబంధంగా 600 పడకల ఆస్పత్రి 

వనపర్తి జిల్లా కు కొత్తగా మంజురైన మెడికల్ కాలేజీకి అనుబంధంగా 600 పడకల ఆసుపత్రి కూడా మంజూరైనట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు.  సోమవారం పెద్దమందడి మండలం వెల్టూరులో బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌‌ తర్వాత  ఆ స్థాయి  వైద్య సౌకర్యాలు వనపర్తిలో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.   ప్రభుత్వం మెడికల్ కాలేజీకి రూ.600 కోట్లు కేటాయించిందని  మొదటి దశ పనులను రూ.120 కోట్లతో  త్వరలోనే  మొదలు పెడతామన్నారు.   జేఎన్టీయూ  ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కావడం ఈ ప్రాంత విద్యార్థులకు వరమన్నారు.  నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో తొలి ఫిషరీ కాలేజీ పెబ్బేరులో ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.  రూ.12 కోట్లతో వెల్టూర్ చెరువును అభివృద్ది చేస్తామని మంత్రి చెప్పారు. అనంతరం పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో వేర్ హౌసింగ్ సంస్థ నిర్మించిన కొత్త గోదాములను ప్రారంభించారు. మంత్రి వెంట  ఎంపీ రాములు,  గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు, జడ్పీ  చైర్మన్ లోకనాథ్ రెడ్డి  పాల్గొన్నారు.