ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా రావడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సమష్టిగా కలిసి ముందుకెళ్లడం వల్లే ఇది సాధ్యమైందని, మోదీ అండగా ఉండటం వల్ల ఇది సాధ్యమైందని (“Ek hain to safe hain, Modi hai to mumkin hai") మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై దేవేంద్ర ఫడ్నవీస్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
సీఎం పదవి ఎవరు చేపట్టనున్నారనే అంశంపై ప్రస్తుతానికైతే ఫడ్నవీస్ స్పందించలేదు. అయితే.. ఫడ్నవీస్ తల్లి మాత్రం తన కొడుకే ముఖ్యమంత్రి అవుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ చాలా కష్టపడ్డాడని, ఆ కష్టం వృథాగా పోలేదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఉత్కంఠ వీడిపోయిన సంగతి తెలిసిందే. గెలుపు ఎవరిదో తేలిపోయింది.
బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 226 స్థానాల్లో ఆధిక్యం కనబర్చి అధికారం ఎవరిదో చెప్పకనే చెప్పేసింది. ఎన్డీయే రికార్డు స్థానాలను కైవసం చేసుకుని మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని స్పష్టమైంది. అయితే.. సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి.
ప్రస్తుతం సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండేనే మళ్లీ సీఎం అవుతారని ఈ కూటమిలో ఒక పార్టీ అయిన షిండే నేతృత్వంలోని శివసేన బలంగా నమ్ముతోంది. అతిపెద్ద పార్టీకే సీఎం పదవి ఇవ్వాలని రూలేం లేదని, కూటమిలోని అన్ని పార్టీల ముఖ్య నేతలు కూర్చొని సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయిస్తామని ఫలితాల రోజే ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
సీఎం పదవిపై మహారాష్ట్రలో హైడ్రామా చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫడ్నవీస్ సీఎం అవుతారని మహారాష్ట్ర బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. బీజేపీకి అతి పెద్ద పార్టీగా అవతరించడం, సింగిల్ గానే అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో సీఎం స్థానం బీజేపీ చేతుల్లోంచి జారిపోతుందని భావించలేం. ఎన్సీపీ చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా సీఎం పదవి ఆశిస్తున్నారు.
అజిత్ పవార్ పేరును ఆ పార్టీ నేత అమోల్మిట్కారీ సీఎం రేసులోకి తీసుకొచ్చారు. పుణెలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నెక్ట్స్ మహారాష్ట్ర సీఎం అంటూ పోస్టర్లు కూడా కనిపించడంతో మహారాష్ట్రలో సీఎం స్థానం ఎవరిని వరిస్తుందోననే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.