కాలుష్యం ముప్పు

కాలుష్యం ముప్పు

వ్యవసాయాన్ని ఆధునీకరించాలనే నినాదం మన దేశంలో ఎప్పటి నుంచో వినపడుతున్నది. క్రమంగా ఆధునీకరణ అంటే యాంత్రీకరణగా మారింది. రైతుల పరిస్థితితో సంబంధం లేకుండా, క్షేత్ర స్థాయిలో ఉన్న పరిమితులను గమనించకుండా.. ప్రభుత్వాలు వ్యవసాయంలో యంత్రాలను దూర్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ప్రోత్సాహకాల ద్వారా, రాయితీల ద్వారా ఆర్థికంగా భారం అవుతున్నా కూడా ఆచరణ సాధ్యం కాని యంత్రాలను సరైన అధ్యయనం లేకుండానే ప్రవేశపెడుతున్నాయి. వ్యవసాయంలో డ్రోన్లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయంలో వాడకానికి సంబంధించి రాయితీ పథకం కూడా ప్రకటించింది. రైతు ఉత్పత్తి కంపెనీలకు(ఎఫ్​పీవో) దాదాపు రూ.7.5 లక్షల వరకు రాయితీ అందించేందుకు పథకం తీసుకువచ్చింది. వ్యవసాయంలో డ్రోన్లను రకరకాలుగా ఉపయోగించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. విత్తనాలు నాటేందుకు, ఎరువులు చల్లేందుకు, కీటకనాశక రసాయనాలు పిచికారి చేసేందుకు, పంటల చీడపీడలను గమనించేందుకు, పంట ఫొటోలు తీయడానికి వగైరా పనులను డ్రోన్ తక్కువ టైమ్​లో చేస్తుందని చెబుతున్నారు. మిగతా ఉపయోగాల మాట ఎలా ఉన్నా, డ్రోన్ల ద్వారా విష రసాయనాల పిచికారి చాలా ప్రమాదకరం. డ్రోన్లు విష రసాయనాల పిచికారికి ఉపయోగించడం రైతుకు, చేనుకు, ప్రకృతికి చేటు. చట్టపరంగా అనుమతి కూడా లేదు.

అనుమతి ఉంటేనే
భారత దేశంలో ఇన్​సెక్టిసైడ్​యాక్ట్1968 ప్రకారం ఏరియల్ స్ప్రే(పై నుంచి పిచికారి) చేయాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. పాశ్చాత్య దేశాల్లో 5 నుంచి10 వేల హెక్టార్లు ఉండే పెద్ద కమతాల్లో, సాధారణంగా ఏరియల్ స్ప్రే చేస్తారు. మన దగ్గర అట్లాంటి కమతాలు లేవు. కాఫీ, తేయాకు, జీడిపప్పు తోటలు ఉన్నా  ఏరియల్ స్ప్రే గురించిన ఆలోచన, అవసరం ఎప్పుడూ రాలేదు. 1980వ దశాబ్దంలో కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ ప్రాంతంలో ఉన్న జీడిపప్పు తోటలకు ఎండో సల్ఫాన్ విష రసాయనం విమానాల ద్వారా పిచికారి చేశారు. పర్యవసానంగా, ఆ ప్రాంతంలో వన్యప్రాణులు, పాడి పశువులు మొదలుకొని, తోటల మధ్యలో ఉన్న గ్రామ ప్రజలు కూడా విష రసాయనం బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది చనిపోయారు కూడా. అంతు చిక్కని శారీరక రుగ్మతలు ఇప్పటికీ అక్కడ కనపడతాయి. అక్కడి ప్రజలు ఉద్యమించి, ఏరియల్ స్ప్రే పద్ధతిని ఆపించారు. ఆ తరువాత, ఎండో సల్ఫాన్ రసాయనం ప్రపంచవ్యాప్తంగా నిషేధించడానికి ఈ ఉద్యమం కారణమైంది. అయితే, ఒక ఇరవై ఏండ్లు అనధికారికంగా, అనుమతి లేకుండా ఒక ప్రభుత్వ సంస్థ ఏరియల్ స్ప్రే చేయడం చర్చనీయాంశమైంది.

కాలుష్యం ముప్పు
డ్రోన్లతో రసాయనాల పిచికారికి అనేక సమస్యలు ఉన్నాయి. వీటిపై ప్రపంచమంతటా పరిశోధనలు జరుగుతున్నాయి. పరిశోధనల ఫలితాలు రాక ముందే కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహంగా అన్ని అనుమతులు ఇచ్చేసింది. డ్రోన్లు గాలిలో ఎగరడానికి అవసరమైన ఇంధన శక్తి బ్యాటరీల నుంచి పొందుతాయి. అవి మోసుకెళ్లే బరువును బట్టి బ్యాటరీలను ఛార్జ్​చేయాల్సి వస్తుంది. కరెంట్ ఖర్చు అవుతుంది. ఒక 20 లీటర్ల పిచికారి ట్యాంకు గాలిలోకి తీసుకుపోవాలంటే పెద్ద డ్రోను అవసరం అవుతుంది. పిచికారి చేయాల్సిన ఎకరాలను బట్టి డ్రోనుకు  కట్టిన ట్యాంకు అనేకసార్లు నింపాల్సి వస్తుంది. పైనుంచి పిచికారి కనుక గాలి వాటం బట్టి 40 నుంచి-50 శాతం రసాయనం పంట మీద పడకుండా గాలిలో కలుస్తుంది. డ్రోన్లకు ఉండే పంకల తోటి కూడా పిచికారి గాలిలో కలుస్తుంది. ఇలా డ్రోన్లతో పిచికారి అత్యంత ఖర్చు, శ్రమతో కూడినది. దాని కోసం అదనపు సౌకర్యాలు కావాల్సి వస్తుంది. చివరికి, కాలుష్యం తప్పితే రైతుకు ఏమీ మిగిలే అవకాశం లేదు. ఏదేమైనా, ఎప్పటి నుంచో మన దేశ చట్టం, విమానాల ద్వారా విష రసాయనాలు చల్లడం వంటి ప్రక్రియలను నియంత్రిస్తున్నది. ప్రత్యేక అనుమతి ఉంటే తప్ప, ఏరియల్ స్ప్రేయింగ్, అంటే పై నుంచి విష రసాయనాలు చల్లడం నిషిద్ధం.

ప్రామాణిక పత్రం విడుదల
దీని గురించి నేను కేంద్ర విష రసాయనాల నియంత్రణ అధికారులకు 2019లో లేఖ రాశాను.  నా లేఖ తదనంతరం, చట్టపరమైన స్థితిని స్పష్టం చేసే లేఖను వారు వ్యవసాయ మంత్రిత్వ శాఖకు పంపారు. డ్రోన్ల ద్వారా పురుగు మందులు అనే విష రసాయనాలను వ్యవసాయంలో వాడకానికి అనుమతి లేదు. ఇదివరకు కూడా ఇవ్వలేదు అని వాళ్లు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా డ్రోన్లను రసాయనాల పిచికారికి వాడటం చట్ట వ్యతిరేకం. అయినా కూడా కేంద్ర వ్యవసాయ శాఖ డ్రోన్ తో విష రసాయనాల పిచికారికి సంబంధించి ఒక ప్రామాణిక పత్రం 2021 డిసెంబర్ 21 న విడుదల చేసింది. కాగా, ఈ పత్రంలోని సూచనలు పాటిస్తే అనుమతి అవసరం లేదనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయితే, ఈ పత్రంలో ప్రమాణాలను నిర్దేశించడంలో అధికారులకు ఊహాశక్తి లోపించింది. సైన్స్, పర్యావరణ, పర్యావరణ కారకాలను ఈ పత్రంలో పొందుపరచడంలో ప్రభుత్వం విఫలమైంది.  దేశంలో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. వీరి కమతాలు చిన్నవిగా ఉంటాయి. పెద్ద పొలాల్లో ఏరియల్ స్ప్రే చేయడం వల్ల గాలికి(డ్రిఫ్ట్) పొరుగున ఉన్న చిన్న, సన్నకారు రైతుల పంటల మీద పడవచ్చు. సహజ వ్యవసాయ క్షేత్రాలు, సర్టిఫైడ్ సేంద్రియ వ్యవసాయ ప్రాంతాలు అనవసరంగా రసాయనాలతో ప్రభావితమవుతాయి. సేంద్రియ ధ్రువీకరణ పొందిన పొలాల్లో రసాయన అవశేషాలు కనిపిస్తే ఆయా రైతులు ఆర్థికంగా నష్టపోతారు. మార్కెట్లో నమ్మకం కోల్పోతారు.

ప్రాణకోటికి వినాశకరం కావొద్దు
ప్రమాదాలు జరిగినా, రసాయనాల పిచికారిలో తప్పులు జరిగినా, తద్వారా రైతు నష్టపోతే బాధ్యత ఎవరి మీదా లేదు. డ్రోన్లు తరచూ కూలిపోతుంటాయి. అది ఎవరి నెత్తి న పడినా ప్రమాదమే. రసాయనాల ట్యాంకుతో కూడిన డ్రోన్ కూలిపోతే అప్పుడు జరిగే ప్రమాదం రసాయన ప్రమాదంగా గుర్తించబడదు. కాకపోతే, పడిన ప్రదేశం బట్టి పర్యవసానం తీవ్రంగా, భయానకంగా ఉండవచ్చు. చెరువులు, బావులు, కాలువల్లో పడితే కాలుష్యం ఏర్పడుతుంది. తెలిసీతెలియక ఆ నీరు తాగే మనుషులు లేదా పశువులు చనిపోవచ్చు. డ్రోన్లను విష రసాయనాల పిచికారికి వాడటం చాలా ఖర్చుతో కూడుకున్నది. దీని వల్ల ప్రకృతి మీద దుష్ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతుంది. ప్రాణకోటికి వినాశకరం. ఇదొక సాంకేతిక అద్భుతంగా చిత్రీకరించి అమాయక రైతులను ఈ పరికరాల వాడకం వైపు ఆకర్షిస్తున్నారు. దీనిపై రైతులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ఉల్లంఘనలను నియంత్రించాలి. ఆయా వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి.  పత్రికలూ, మీడియా పురుగుమందుల పిచికారీ కోసం డ్రోన్లను ప్రోత్సహించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

ఆధునిక వ్యవసాయం పేరుతో ప్రోత్సాహం
డ్రోన్ల ద్వారా అత్యంత ప్రమాదకరమైన విషంతో కూడిన కీటకనాశన రసాయనాలు పంటల మీద ఏరియల్ స్ప్రే చేసే వ్యాపారం అభివృద్ధి చేయడాన్ని కొన్ని వర్గాల వారు దేశవ్యాప్తంగా మొదలు పెట్టారు. సాధారణంగానే, విష రసాయనాలు పిచికారి చేసే  రైతులు, రైతు కూలీలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. అయితే డ్రోన్ల ద్వారా పిచికారి చేస్తే వాటి దుష్ప్రభావం నుంచి వీరు తప్పించుకోవచ్చని ఒక ఉపయోగం మార్కెటింగ్ చేసుకుంటూ.. డ్రోన్ల వాడకాన్ని ‘ఆధునిక’ వ్యవసాయం పేరిట ప్రోత్సహిస్తున్నారు. రిమోట్ తో డ్రోన్లు పిచికారి చేస్తాయి కాని రసాయనాలను కలపడం, నింపే ప్రక్రియ ఆయా వ్యక్తులు చేయక తప్పదు. డ్రోన్ల ద్వారా రసాయనాల పిచికారికి నీళ్ళు తక్కువ అవసరమని ఆయా కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అంటే, డ్రోన్ల ద్వారా పిచికారి చేసే రసాయనాల సాంద్రత, గాఢత ఎక్కువగా ఉంటుంది. వాటి దుష్ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. డ్రోన్ల ద్వారా విష రసాయనాలు పిచికారి చేసిన తరువాత సమీప ప్రాంతంలోని గాలి రసాయన వాయువులతో నిండి ఉంటుంది. తద్వారా అనేక మంది బలయ్యే అవకాశం డ్రోన్లు కల్పిస్తున్నాయి. అదనంగా, స్థానిక పర్యావరణం, జీవావరణం, ప్రకృతి వనరులు అన్నీ కూడా కలుషితం అవుతాయి. - దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్