- దగ్గు, జలుబు, జ్వరాలతో దవాఖాన్లకు వస్తున్న జనం
- జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న డాక్టర్లు
- అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించని అధికారులు
- జికా వైరస్‌పై అలర్ట్‌గా ఉండాలని కేంద్రం అడ్వైజరీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీజనల్ రోగాల వ్యాప్తి మొదలైంది. జనాలు దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి దవాఖాన్లలో అవుట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఇవన్నీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వైరల్ జబ్బులు కావడంతో అప్రమత్తంగా ఉండాలని జనాలను డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. డెంగీ, మలేరియా వంటి రోగాలు ఇప్పటివరకు కంట్రోల్‌లోనే ఉన్నప్పటికీ, ఈ ఏడాది కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు.
రెండేండ్లకోసారి రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తోందని, ఆ లెక్కన ఈసారి డెంగీ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2022లో రాష్ట్రంలో 8,500 డెంగీ కేసులు నమోదవగా, గతేడాది 2 వేల కంటే తక్కువ కేసులు రికార్డ్ అయ్యాయి. అందుకే ఈ ఏడాది డెంగీ తీవ్రత పెరగొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, జ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
నివారణ చర్యలు ప్రారంభించని ఆఫీసర్లు
గతంలో వర్షాకాలంలో ప్రభుత్వ దవాఖాన్లలో ప్రత్యేకంగా ఫీవర్ ఓపీ కౌంటర్లను నిర్వహించేవారు. తద్వారా పేషెంట్లకు దవాఖాన్లలో వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడంతో పాటు ఒకరి నుంచి ఒకరికి రోగాలు వ్యాపించకుండా ఈ చర్యలు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు జ్వరాలు ఎక్కువగా లేకపోవడంతో ఇప్పటివరకూ స్పెషల్ క్లినిక్‌లపై అధికారులు ఉత్తర్వులు జారీ చేయలేదు. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే, ఫీవర్ ఓపీ కౌంటర్ల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మొదట్నుంచే స్పెషల్ ఓపీ క్లినిక్‌లు నిర్వహించడం వల్ల, వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని డాక్టర్లు అంటున్నారు. సీజనల్ డిసీజ్‌లు, డెంగీ, మలేరియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నా ఆ దిశగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భయపెడుతున్న జికా
మహారాష్ట్రలో పలుచోట్ల జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏడుగురికి వైరస్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా గర్భిణులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, ఒకవేళ పాజిటివ్ వస్తే.. పిండం ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. డెంగీ, చికున్ గున్యా మాదిరిగానే జికా వైరస్ కూడా దోమల ద్వారానే వస్తుంది.
ఎడిస్ దోమలు కుట్టడం ద్వారా ఇది సోకుతుంది. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఇన్ఫెక్షన్ సోకిన మహిళకు పుట్టబోయే పిల్లల తల చిన్నగా ఉండడంతోపాటు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే, 2016 నుంచి ఇలాంటి కేసు ఒక్కటి కూడా దేశంలో వెలుగు చూడలేదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అయినప్పటికీ జికా కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో ఉండే గర్భిణీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది.
నివాస ప్రాంతాలు, పని ప్రదేశాలు, బడులు, నిర్మాణ స్థలాలు, వైద్య ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రజలు ఆందోళనకు గురికాకుండా వైరస్ వ్యాప్తి, లక్షణాలు, జాగ్రత్తలపై సోషల్ మీడియాతోపాటు ఇతర మార్గాల్లో అవగాహన కల్పించాలని తెలిపింది. ఎడిస్ దోమల బెడద ఉన్న ప్రాంతాలను గుర్తించి, నోడల్ ఆఫీసర్ సాయంతో అక్కడ పర్యవేక్షణ, నివారణ చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.