ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే శిక్షలు తప్పవ్!

ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే శిక్షలు తప్పవ్!

సోషల్‌‌ మీడియా ద్వారా దొరుకుతున్న సమాచారాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. ఫేక్‌‌ న్యూస్, పాత వీడియోలను పోస్ట్‌‌ చేసి అవి ఇప్పుడే జరిగినట్టుగా జనాలను మభ్యపెడుతున్నారు. కొందరు అవి నిజమని నమ్ముతూ తప్పుడు భావాలను పెంచుకుంటున్నారు. కొందరైతే వాటి కారణంగా తమ పరువు కోల్పోయామని భావించి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటికి చెక్‌‌ పెట్టడానికి చట్టంలో ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. ట్రెండ్‌‌కు తగ్గట్టుగానే ఇండియన్​ పీనల్​ కోడ్(ఐపీసీ)లో కూడా మార్పులొచ్చాయి. వాటిలో ఇలాంటి సైబర్‌‌‌‌ నేరాలకు పాల్పడిన వారికి తగిన శిక్షలూ ఉన్నాయి. సైబర్​ నేరాలు పెరుగుతున్నందున వీటి గురించి జనం తెలుసుకోవడం ఎంతైనా మంచిది.

సోషల్‌‌ మీడియా ద్వారా నేడు ప్రజలకు ఎంతో సమాచారం దొరుకుతోంది. టీవీల్లో, పత్రికల్లో వార్తలు రాకముందే సోషల్‌‌ మీడియాలో వచ్చేస్తున్నాయి. అంతేకాదు అభిప్రాయాలు, విమర్శలు, చర్చలు కూడా వాటిలోనే నడుస్తున్నాయి. ప్రజల విజ్ఞానాన్ని పెంపొందించడానికి సోషల్‌‌ మీడియా చాలా ఉపయోగకరంగా ఉంది. ఎంతోమంది యువకులు, మేధావుల వ్యాసాలు, కవితలు పత్రికల్లో రాకపోయినా సోషల్‌‌ మీడియా ద్వారా ప్రజలకు చేరుతున్నాయి. ప్రభుత్వ పాలసీలను విమర్శించవచ్చు. అమలు జరగడంలో లోటుపాట్లను ఎప్పటికప్పుడు తెలపొచ్చు. అయితే ఇటీవల కాలంలో ఫేక్‌‌ న్యూస్‌‌, పాత వీడియోలు చూపి.. అవి ఇప్పుడే జరుగుతున్న సంఘటనలుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. కొంతమంది తమ ప్రత్యర్థుల పరువుప్రతిష్టలు దెబ్బతీయడానికి వీటిని వాడుకుంటున్నారు. వాటిలో నిజమెంతో, అబద్ధమెంతో సామాన్యులు తెలుసుకోలేకపోతున్నారు. ఇటువంటి పోస్టింగ్‌‌లు పెట్టొచ్చా? అవి చట్టరీత్యా చెల్లుతాయా? వాటి పర్యవసానాలు ఏమిటి? సోషల్​ మీడియా పరిమితులు ఏమిటి? అనే అంశాలను పరిశీలిద్దాం.

రూల్స్‌‌ అండ్‌‌ రెగ్యులేషన్స్‌‌ ఉన్నయ్

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ(ఇంటర్​ మీడియరీ గైడ్‌‌లైన్స్‌‌ అండ్ డిజిటల్‌‌ మీడియా ఎథిక్స్‌‌ కోడ్) రూల్స్‌‌, 2021ను తీసుకొచ్చింది. దీని ప్రకారం సోషల్‌‌ మీడియా నిర్వాహకులు సోషల్‌‌ మీడియాను ఉపయోగించే వారందరికీ రూల్స్‌‌, రెగ్యులేషన్స్‌‌ తెలియజేయాలి. ఇతరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా ప్రచురించే లేదా పోస్ట్‌‌ చేసే హక్కు లేదు. ఒకరి పరువుప్రతిష్టలు దెబ్బతీసేలా, అవమానపరిచేలా పోస్టులు చేయరాదు. అసభ్యకర చిత్రాలు, జాతి విద్వేషాలను రెచ్చగొట్టే వాటిని, పిల్లలకు హాని కలిగించే విషయాలు, చట్ట వ్యతిరేక విషయాలు, అసత్య వార్తలు, దేశ ఐక్యత, సమగ్రత, రక్షణ, ఇతర దేశాలతో సంబంధాలు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వాటిని పోస్ట్ చేయరాదు. ఇటువంటి వాటిని పోస్ట్‌‌ చేసినట్లయితే ఆయా సంస్థల నిర్వాహకులు వాటిని 36 గంటల్లో తొలగించాలి లేదా ఇండియన్ కంప్యూటర్‌‌‌‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌‌ టీమ్‌‌కు తెలియజేయాలి. నిర్వాహకులందరూ ఒక గ్రీవెన్స్‌‌ ఆఫీసర్‌‌‌‌ను ఇటువంటి వాటిని పరీక్షించడానికి నియమించాలి. అలాగే చీఫ్‌‌ కంప్లయింట్‌‌ ఆఫీసర్‌‌‌‌ను కూడా నియమించాలి. వీరు ప్రజల నుంచి వచ్చిన కంప్లయింట్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. ఆథరైజ్డ్‌ ఆఫీసర్లను నియమించి, వీటిని పర్యవేక్షించే అధికారాన్ని అతనికి ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఆథరైజ్డ్‌ ఆఫీసర్‌‌‌‌ ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. దాని ఆధారంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. అయితే చర్యలు తీసుకునే ముందు సోషల్‌‌ మీడియా నిర్వాహకులకు తమ అభిప్రాయాలను తెలిపే అవకాశం ఇవ్వాలి. ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అటువంటి సమాచారాన్ని, వార్తలను బ్లాక్‌‌ చేసే అధికారం అథరైజ్‌‌డ్‌‌ ఆఫీసర్‌‌‌‌కు ఉంటుంది. ద ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ రూల్స్‌‌ ప్రకారం కేంద్రానికి సోషల్‌‌ మీడియాలో వచ్చే వార్తలను ఎడిట్‌‌ చేసే లేదా తొలగించే అధికారం ఉంది. అయితే ఇది వ్యక్తిగత స్వేచ్ఛను, వాక్‌‌ స్వాతంత్య్రాన్ని హరిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

2000లో ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ యాక్ట్‌‌

పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ఉద్దేశంతో ది పర్సనల్‌‌ డాటా ప్రొటెక్షన్‌‌ బిల్‌‌ 2019ను తీసుకొచ్చారు. ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌‌ బి.ఎన్. శ్రీకృష్ణను చైర్మన్‌‌గా నియమించింది. తర్వాత ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని దేశ సమగ్రత శాంతి భద్రతల రక్షణ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం వ్యక్తి స్వేచ్ఛను హరించినట్లేనని మేధావులు విమర్శించారు. మొట్టమొదట ద ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ యాక్ట్‌‌ 2000 వచ్చింది. ఈ యాక్ట్‌‌ ప్రకారం వ్యక్తుల కంప్యూటర్‌‌‌‌లో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్‌‌‌‌ ద్వారా, ఇతర ఎలక్ట్రానిక్‌‌ పరికరాల ద్వారా ప్రచురించడం (పోస్ట్‌‌) చేయడంలో పాటించాల్సిన విధానాలను తెలిపారు. ఇతరుల కంప్యూటర్లలోని సమాచారాన్ని వారికి తెలియకుండా పరిశీలించడం, కాపీలు తీయడం, డౌన్‌‌లోడ్‌‌ చేయడం మొదలైన వాటిని నేరాలుగా పరిగణించారు. ఇతరుల కంప్యూటర్లను, కంప్యూటర్‌‌‌‌‌‌ నెట్‌‌వర్క్‌‌లను నష్టపరచడం, అంతరాయం కలిగించడం కూడా నేరాలుగా పరిగణించారు. వివిధ అధికారులను, కంట్రోలర్లను ఆపైన అప్పిలేట్‌‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు. నేర పూరితమైన విషయాలను, అసత్యపు విషయాలను కంప్యూటర్ల ద్వారా పంపడం నేరమని సెక్షన్‌‌ 66(ఎ)లో  చెప్పడం జరిగింది. అయితే సుప్రింకోర్టు శ్రేయా సింఘాల్‌‌ వర్సెస్‌‌ యూనియన్‌‌ ఆఫ్​ ఇండియా ఏఐఆర్‌‌‌‌ 2015 ఎస్‌‌సి 1523 తీర్పు ద్వారా సెక్షన్‌‌ 66ఎ ను కొట్టేసింది. ఈ చట్టంలోని మిగిలిన సెక్షన్ల ప్రకారం దేశ ఐక్యతకు, సమగ్రతకు, రక్షణకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే విధంగా లేదా ప్రజలను భయభ్రాంతులు చేసే విషయాలను కంప్యూటర్‌‌‌‌ (ఎలక్ట్రానిక్‌‌) పరికరాల ద్వారా పంపడం నేరాలే. అదే విధంగా కామోద్రేకాన్ని రెచ్చగొట్టడం, పిల్లలను అసభ్యంగా చూపించడం కూడా నేరమవుతాయి. ప్రభుత్వ అధికారులు, పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ తగిన చర్యలు తీసుకోవచ్చు. నేరాలను బట్టి ముద్దాయిలకు ఫైన్‌‌ లేదా ఫైన్‌‌తో పాటు 3 ఏండ్ల నుంచి 7 ఏండ్ల వరకూ శిక్ష విధించే అవకాశాలను ఈ చట్టాలు కల్పించాయి. 

అందరికీ అందుబాటులో కోర్టు ప్రొసీడింగ్స్‌‌.. 

ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా మద్రాస్‌‌ హైకోర్టు ఒకానొక సందర్భంగా కరోనా సెకెండ్‌‌ వేవ్‌‌ చెన్నైలో రావడానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌‌దే పూర్తి బాధ్యత అని, అటువంటి కమిషన్‌‌ మీద హత్యానేరం చేసినట్లు ఆరోపించినా తప్పు లేదని వ్యాఖ్యానించింది. ఇది తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంతుందని, ఎన్నికల కమిషన్‌‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, ఆ వ్యాఖ్యలు ముఖత (ఫేస్‌‌ టు ఫేస్‌‌)  చేసిన వ్యాఖ్యలని, తీర్పులో చెప్పలేదని, కోర్టు ప్రొసీడింగ్స్‌‌ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయని, కోర్టులో జరిగే వాటిని ప్రచురించే హక్కు ఉందని, అయితే జడ్జిల వ్యాఖ్యానం చేసేటప్పుడు సమన్వయం పాటించాలని చెప్పింది. అయితే కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్‌‌ను ప్రచురించ వద్దని లేదా తొలగించాలని మేము ఆజ్ఞాపించ లేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుచే సోషల్‌‌ మీడియాను వాడుతున్న వారు మీడియాలో పోస్టులు చేసేముందు ఐపీసీలో విధించిన పరిమితులను, ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ యాక్ట్‌‌ 2000, ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ ఇంటర్ మీడియరీ గైడ్‌‌లైన్స్‌‌ అండ్ డిజిటల్‌‌ మీడియా ఎథిక్స్‌‌ కోడ్​, రూల్స్‌‌ 2021ను, డేటా ప్రొటెక్షన్‌‌ బిల్‌‌ 2019 మొదలైన చట్టాలను దృష్టిలో పెట్టుకోవాలి. వ్యక్తిగత పరువు ప్రతిష్టలు పోగొట్టారని సివిల్‌‌ డ్యామేజెస్‌‌ కు నష్టపరిహారం కేసులు వేయవచ్చు. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా అసత్య ఆరోపణలతో వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయకుండా వ్యక్తులను అవమాన పరచకుండా కుల, మత, జాతి బేధాలను రెచ్చగొట్టకుండా దేశ సమగ్రతకు ముప్పు కలిగే విధంగా పోస్టింగ్స్‌‌ చేయరాదు. పై పరిమితులకు లోబడి సరైన వార్తలను, విమర్శలను, శాస్త్రీయ చర్చను, ప్రజల విజ్ఞానాన్ని పంచే సమాచారాన్ని రాజకీయ పాలసీల తప్పొప్పులను, ప్రభుత్వ విధానాల మంచిచెడులను, తెలిపే వార్తలను, విషయాలను సోషల్‌‌ మీడియా ద్వారా స్వేచ్ఛగా తెలపవచ్చు.

అప్రతిష్టపాలు చేయడం నేరం..

ఐపీసీలోని సెక్షన్ 504 ప్రకారం ఒక వ్యక్తిని దురుద్దేశంతో అప్రతిష్టపాలు చేయడం, అవమానించడం శిక్షించదగ్గ నేరమవుతుంది. అలాగే రెండు వర్గాలు, కులమతాల మధ్య విద్వేషాన్ని కలిగించడం కూడా సెక్షన్‌‌ 295, 298 ప్రకారం శిక్షార్హమైన నేరాలే. అవమానించబడిన వ్యక్తి పోలీస్‌‌ కంప్లయింట్‌‌ ఇవ్వొచ్చు. సెక్షన్‌‌ 295ఏ నాన్‌‌ బెయిలబుల్‌‌ నేరం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌ 19 ప్రకారం దేశ పౌరులందరికీ వాక్‌‌ స్వాతంత్ర్యం ఉంది. అంటే తమ అభిప్రాయాలను తెలిపే హక్కు ఉంది. ఆర్టికల్‌‌ 19(2) ప్రకారం దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడటానికి, ఇతర దేశాలతో సంబంధాల విషయమై, శాంతి భద్రతలు, నైతిక విలువల విషయంలో ప్రభుత్వం ఈ హక్కుకు సరైన పరిమితులు విధించవచ్చు. ఇంకా మనదేశంలో 120 ‌‌కోట్ల మంది సెల్‌‌ ఫోన్లు, ల్యాండ్‌‌ ఫోన్లు వాడేవారున్నారు. 49 కోట్ల మంది ఇంటర్నెట్‌‌ వాడుతున్నారు. టెక్నాలజీ డెవలప్‌‌మెంట్‌‌ వల్ల సమాచార విప్లవం వచ్చింది. కోర్టుల్లో జరుగుతున్న ప్రొసీడింగ్స్ కూడా టీవీల్లో చూపించే హక్కు, పత్రికలు, సోషల్‌‌ మీడియాలో ప్రచురించే హక్కు ఉంది.

జస్టిస్‌‌ బి. చంద్ర కుమార్‌‌‌‌,రిటైర్డ్ న్యాయమూర్తి