
కాజీపేట, వెలుగు : కాజీపేటలోని ఎన్‌ఐటీలో స్ప్రింగ్ స్ప్రీ 2025 కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. హాస్యనటుడు బ్రహ్మానందం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు తాను చీఫ్ గెస్ట్‌గా రావడం అదృష్టమన్నారు. ప్రతి విద్యార్ధి ఒక లక్ష్యం ఏర్పరచుకొని, దాని సాధన కోసం పట్టుదలగా కృషి చేయాలని సూచించారు.
ప్రధాని మోదీ, లాల్‌బహదూర్ శాస్త్రీ, అబ్దుల్ కలాం వంటి వారు పేదలుగా పుట్టినా ఉన్నత పదవులు అధిరోహించి దేశానికి సేవ చేశారని చెప్పారు. అనంతరం బ్రహ్మానందంను సన్మానించారు. ఎన్‌ఐటీ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
సాయంత్రం బింబి సార సినిమా డైరెక్టర్ వశిష్టతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. వేడుకల సందర్భంగా స్టూడెంట్లు నిర్వహించిన కల్చరల్‌ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎన్‌ఐటీ స్టూడెంట్స్ వెల్పేర్ డీన్ శ్రీనివాసాచార్య, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ శ్యాంప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.