
బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు గురువారం నంద్యాలలో జరగనున్నాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎస్.పెద్ద ఏరికల రెడ్డి మంగళవారం రాత్రి 9:50కు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలిపారు.
కర్నూలు జిల్లాకు తీరని లోటు: చంద్రబాబు నాయుడు
ఎస్పీవై రెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తగా, స్వచ్ఛంద సేవకునిగా ఎస్పీవై రెడ్డి సేవలను సీఎం కొనియాడారు. ఎంపిగా నంద్యాల ప్రాంతానికి, కర్నూలు జిల్లాకు ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ఎస్పీవై రెడ్డి నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. ఆయన మృతి నంద్యాల ప్రాంతానికి, కర్నూలు జిల్లాకు తీరనిలోటు అన్నారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఎస్పీవై రెడ్డి మరణం బాధాకరం : పవన్ కళ్యాణ్
నంద్యాల లోక్ సభ స్థానం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఎస్పీవై రెడ్డి మరణం చాలా బాధాకరం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విటర్ లో విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనారోగ్యంతో మృతి చెందడం పార్టీకు తీరని లోటన్నారు . ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ తెలిపారు.