ఎస్ఆర్నగర్ వ్యాపారి హత్య కేసు..తాకట్టు పెట్టిన కారు ఇవ్వలేదని చంపేశాడు

  • నిందితుడు రమేశ్ అరెస్ట్
  • కారును దొంగిలిస్తుండగా పట్టుకున్న పోలీసులు

పంజాగుట్ట, వెలుగు: వ్యాపారి విష్ణురూపాని హత్య కేసులో చిక్కుముడి వీడింది. తాకట్టు పెట్టిన కారు ఇవ్వలేదనే అతడిని రమేశ్​హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన విష్ణురూపాని డిసెంబరు 29న ఎస్ఆర్​నగర్​లోని రమేశ్ గదిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ​

పంజాగుట్ట ఏసీపీ మోహన్​కుమార్ వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా కొత్తపేటకు చెందిన రమేశ్​(32) చెడు అలవాట్లకు బానిసై చదువు మధ్యలోనే ఆపేశాడు. 2013లో అక్కడి ఓ కంపెనీలో పనిచేసి, ఆ సంస్థ యజమాని అల్లుడితో కలిసి జాన్ అల్ఫెడ్​అనే వ్యక్తిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లాడు. 

అనంతరం హైదరాబాద్​కు మకాం మార్చి అమీర్​పేటలోని రియల్​ఎస్టేట్​సంస్థలో పనిచేశాడు. కొద్దిరోజులు భీమవరంలోని తన మామ ఇంట్లో ఉండి నగలు కొట్టేశాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో కారు కొన్నాడు. ఈ క్రమంలోనే ఈజీమనీ కోసం కాసినో గేమ్స్​కు ఆడాడు. 

తన ఫెండ్స్​ద్వారా రమేశ్​కు విష్ణురూపాని పరిచయం కాగా, తన కారును తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఎస్ఆర్ నగర్​లోని రమేశ్​గదికి విష్ణు వచ్చి మద్యం తాగేవాడు. డిసెంబరు 29న సైతం స్కూటీపై అక్కడికి వెళ్లి మద్యం తాగాడు. 

ఈ క్రమంలో తన కారు ఇవ్వాలని రమేశ్ పట్టుబట్టగా, డబ్బులిస్తేనే కారు ఇస్తానని విష్ణు చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మద్యం మత్తులో ఉన్న విష్ణును గొంతు నులిమి హత్య చేశాడు. మృతుడి వద్ద ఉన్న గోల్డ్​చైన్, ఉంగరాలు, సెల్​ఫోన్, యాక్టివా బైక్​తీసుకొని పరారయ్యాడు. 

అయితే, విష్ణురూపాని ఇంటి వద్ద ఉన్న తన కారును తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పంజాగుట్ట మెట్రో స్టేషన్​వద్ద రమేశ్​ను పోలీసులు శుక్రవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.