ఎస్​ఆర్​ రెసిడెన్షియల్​ కాలేజీ సీజ్

ఎస్​ఆర్​ రెసిడెన్షియల్​ కాలేజీ సీజ్
  • సెల్లార్​లోకి వరద నీరు రావడంతో ఆఫీసర్ల చర్యలు
  • ఎఫ్​టీఎల్​లో నిర్మించిన బిల్డింగ్​లో కొనసాగుతున్న కాలేజీ

జీడిమెట్ల, వెలుగు:నిజాంపేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​పరిధిలోని ఎస్ఆర్​రెసిడెన్షియల్​జూనియర్​ కాలేజీని అధికారులు సోమవారం రాత్రి సీజ్​ చేశారు. శానిటేషన్​ఆఫీసర్​ సృకృతా రెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట్​లోని సెల్లార్లను తనిఖీ చేయగా ఎస్​ఆర్​ రెసిడెన్షియల్​కాలేజీ సెల్లార్​లోకి నీళ్లు రావడాన్ని గమనించారు. అందులోనే కాలేజీ యాజమాన్యం క్యాంటిన్​నిర్వహిస్తూ  విద్యార్థులకు భోజనాలు పెడుతుండడాన్ని గుర్తించారు.

పూర్తిస్థాయిలో పరిశీలించగా కాలేజీలోకి పత్తికుంట చెరువులోని వరద రావడాన్ని గమనించారు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో సుమారు 500 మంది విద్యార్థులను ఆ బిల్డింగ్​ నుంచి ఖాళీ చేయించి పక్కనే ఉన్న ఫంక్షన్​ హాల్​లోకి  తరలించారు. తర్వాత కాలేజీని సీజ్​ చేశారు. దీంతో మంగళవారం ఉదయం కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సెలవులు ప్రకటించి ఇండ్లకు పంపించింది.

2001లోనే ఈ బిల్డింగ్ ఎఫ్​టీఎల్​పరిధిలో ఉందని అప్పట్లో రెవెన్యూ అధికారులు సీజ్​ చేశారు. అయినప్పటికీ కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో సీల్ ​తొలగించారు. 

విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం 

సెల్లార్​లోకి నీళ్లు వస్తున్నా క్యాంటిన్​ఎలా ఏర్పాటు చేస్తారని, అక్కడ భోజనాలు ఎలా పెడతారని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడుతున్నారు. వర్షం కురిసి సెల్లార్​లోకి వరద వస్తున్నా అధికారులు వచ్చేవరకూ ఎందుకు స్పందించలేదన్నారు.

తమ పిల్లల చదువులు ఏమవుతాయోనని, తరగతులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియక అయోమయంలో పడ్డారు. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్​ చేశారు.