జెర్సీ, సైంధవ్ లాంటి చిత్రాలతో నటిగా మెప్పించిన శ్రద్ధా శ్రీనాథ్.. ఇప్పుడు ‘మెకానిక్ రాకీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ ఇలా ముచ్చటించింది.
ఇది నాకు చాలా ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్. ఇప్పటివరకూ కెరీర్‌లో టచ్ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో పోషించా. సినిమాకు మాయ అనే నా పాత్ర కంట్రీబ్యూషన్ చాలా కీలకం. రాకీ జీవితంలో తను ఎలాంటి రోల్ ప్లే చేసిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాత్రను ఒక ఛాలెంజ్‌గా తీసుకుని, ఎంజాయ్ చేస్తూ చేశా. సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులతో పాటు విజిల్ మూమెంట్స్ ఉంటాయి.
విశ్వక్‌తో కలిసి నటించడం ఎక్సయిటెడ్‌గా అనిపించింది. డైరెక్టర్ రవితేజ మేకింగ్, జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. రామ్ తాళ్లూరి చాలా గ్రాండ్‌గా నిర్మించారు. టెక్నికల్‌గా టాప్ నాచ్ ఉంటుంది. మీనాక్షి చౌదరితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు కానీ సెట్స్‌లో చాలాసార్లు కలిశాం. నాలాగే తనది కూడా ఆర్మీ ఫ్యామిలీనే. మా ఇద్దరి మధ్య సిమిలారిటీస్ ఉన్నాయి.
డిఫరెంట్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేయడం నాకిష్టం. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేరు కనుక ప్రతి సినిమాను ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకొని ముందుకెళుతున్నా. ఈ జర్నీలో ఎత్తు పల్లాలు ఉన్నాయి. ‘జెర్సీ’ తర్వాత పీక్స్ చూశా. కొవిడ్ టైమ్‌లో సినిమాలు ఆగడంతో అందరిలాగే నేనూ భయపడ్డా. జయాపజయాలను ఒకేలా తీసుకోవడం అలవాటు చేసుకున్నా. నాకు క్వాలిటీ వర్క్స్ చేయడం ఇష్టం. అందుకే కొంచెం సెలెక్టివ్‌గా ఉంటాను.
ఒక ప్రేక్షకురాలిగా ఎలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతానో, అలాంటి కథలను ఓకే చేయడానికే ఇష్టపడతాను. సినిమాలపై వచ్చే విమర్శలను సీరియస్‌గా తీసుకోను. ఎందుకంటే ఎవరైనా తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చు. కానీ వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రం కాస్త హర్టింగ్‌గా అనిపిస్తుంది. హారర్ సినిమాలు చూడటం ఇష్టం. నటిగా సైన్స్ ఫిక్షన్, పీరియాడిక్, కామెడీ సినిమాల్లో నటించాలని ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ గారి ‘డాకు మహారాజ్’లో నటిస్తున్నా. అలాగే తమిళంలో విష్టువిశాల్‌తో ఓ చిత్రం, ఓ వెబ్ సిరీస్ చేస్తున్నా.