లైబ్రరీలకు నిధులు, సిబ్బంది కొరత

లైబ్రరీలకు నిధులు, సిబ్బంది కొరత

గ్రంథాలయం కేవలం పుస్తకాల సముదాయం మాత్రమే కాదు.  ప్రజలు, విద్యార్థులకు జ్ఞానం, సమాచారం విస్తృతంగా అందించే నిలయం.  చరిత్ర,  సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, కళలు, మరెన్నో అంశాలపై అపారమైన సమాచారాన్ని అందిస్తుంది. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి అందించాయి  గ్రంథాలయాలు. మన సమాజ ఉన్నతికి బహుముఖ పాత్ర పోషిస్తున్న  గ్రంథాలయాలు విస్తృతమైన పుస్తకాలు, పత్రికలు, ఇతర వనరులను కలిగి ఉంటాయి. చరిత్ర, సాహిత్యం నుంచి  సైన్స్ అండ్​ టెక్నాలజీ  వరకు  విభిన్న  విషయాలపై  సమాచారాన్ని యాక్సెస్  చేస్తాయి. 

 పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల అభ్యాసకులకు అందించే  వనరులు, ప్రోగ్రామ్​లు,  సేవలను అందించడం ద్వారా లైబ్రరీలు  జీవితకాల అభ్యాసానికి మద్దతు ఇస్తాయి. ఈ గ్రంథాలయాలు  ప్రజలు ఒకచోట చేరడానికి, ఈవెంట్లకు హాజరై చర్చల్లో పాల్గొనడానికి,  వారి స్థానిక కమ్యూనిటీలతో నిమగ్నమవ్వడానికి సమావేశ స్థలాలుగా పనిచేస్తాయి.  

అరుదైన, చారిత్రాత్మకమైన వస్తువుల సేకరణలను నిర్వహించడం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో, సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించడంలో  గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి.  గ్రంథాలయాలు పుస్తకాలను పాఠకులకు అందించడం, పఠన కార్యక్రమాలను నిర్వహించడం చిన్న వయస్సు నుంచే  సాహిత్యంపై  ప్రేమను పెంపొందించడం ద్వారా చదవడం, అక్షరాస్యతను  ప్రోత్సహిస్తాయి.

విజ్ఞానాన్ని అందించాల్సిన గ్రంథాలయాల్లో ఏళ్ల తరబడి గ్రంథపాలకులు లేక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది.  కొన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు లేవు. మరికొన్నింటిలో పుస్తకాలు అమర్చడానికి అవసరమైన ఫర్నిచర్,  కూర్చోవడానికి కుర్చీలు,  మూత్రశాలలు లాంటి  కనీస మౌలిక వసతులు లేవు.  దీంతో ప్రజలకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు మండల కేంద్రాల్లోని గ్రంథాలయాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.  గ్రంథాలయాలలో అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయడానికి,  భవనాలను నిర్వహించడానికి, సిబ్బందికి జీతాలు చెల్లించడానికి తగినంత నిధులు కేటాయించకపోవడం. 

 ఆధునిక పుస్తకాలు లేకపోవడం, కొత్త పుస్తకాలు,  జర్నల్స్,  ఇతర  వనరులను  కొనుగోలు చేయడానికి నిధులు లేకపోవడం వల్ల గ్రంథాలయాల్లో పాత పుస్తకాలేఅందుబాటులో ఉంటున్నాయి. చాలా గ్రంథాలయాలు పాత భవనాల్లో ఉన్నాయి. ఈ భవనాలు శిథిలావస్థలో ఉండటం వల్ల పాఠకులు అక్కడ కూర్చొని చదవడానికి ఇబ్బందిపడుతున్నారు. గ్రంథాలయాలను ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆధునికీకరించాలి.  జాబ్ క్యాలెండర్ వస్తే  గ్రంథాలయాలు నిరుద్యోగులు, విద్యార్థులతో  నిండిపోతోంది.   ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఈ ఏడాది ప్రకటనలు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయా పోస్టుల కోసం ఉద్యోగ  అభ్యర్థులు ఇప్పటి నుంచే పుస్తకాలతో  కుస్తీ పడుతున్నారు.అందువల్ల ఈలోపు గ్రంథాలయాల్లో వసతులు కల్పించాలి.

రెగ్యులర్ పోస్టుల నియామకాల ఊసేలేదు

గ్రంథాలయాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్న కొద్దిపాటి  సిబ్బంది కూడా తగినంత శిక్షణ పొందకపోవడం వల్ల పాఠకులకు సరిగ్గా సహాయం చేయలేకపోతున్నారు. గ్రంథాలయాల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో నిర్వహణ కుంటుపడుతోంది. గ్రామాల్లో ఉండే యువకులకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్​కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు గ్రంథాలయాలు చాలా ఉపయోగపడతాయి.  సుమారు 30 ఏళ్లుగా రెగ్యులర్ పోస్టుల నియామకాల ఊసేలేదు. 1994లో నియమించినవారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. తాత్కాలిక పద్ధతిన గ్రంథాలయ సంస్థే అడపాదడపా ఒప్పంద ఉద్యోగులను  నియమిస్తోంది.  గ్రంథపాలకులు సరిపడా లేకపోవడంతో ఒక్కొక్కరికి మూడు, నాలుగు గ్రంథాలయాల ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు.

  దీంతో వారు ఎక్కడా సక్రమంగా పనిచేయలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీని ఏర్పాటు చేసి లైబ్రేరియన్​ను నియమించాలి. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు లైబ్రరీకి పిరియడ్ కేటాయించడం వలన విద్యార్థులకు ఆలోచన శక్తి, జనరల్ అవేర్నెస్ పెరుగుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఊరిలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి లైబ్రేరియన్ ను నియమించాలి.  త్వరలో  మెగా డీఎస్సీతో పాటు లైబ్రేరియన్ పోస్టులను కూడా భర్తీ చేయాలి.  

ఎంతోమంది లైబ్రరీ సైన్స్ పట్టభద్రులు చాలా ఏళ్ల నుంచి ఎలాంటి రిక్రూట్​మెంట్ లేకపోవడంతో నిరుద్యోగులుగా ఉన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి పబ్లిక్ గ్రంథాలయాలలో, జిల్లా గ్రంథాలయాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్  పోస్టులను మెగా డీఎస్సీతో పాటు భర్తీ చేయాలి.

-  సిలివేరు అశోక్,
ఉస్మానియా యూనివర్సిటీ