శ్రావ‌ణ శుక్రవారం... అమ్మవారికి సొంతం .. 

శ్రావ‌ణ శుక్రవారం... అమ్మవారికి సొంతం .. 

శ్రావణ మాసం అంటే చాలా మంది ఎంతో నిష్ఠగా లక్ష్మీ దేవిని పూజిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసం శుక్రవారాలు లక్ష్మీ దేవిని పూజించి.. వరాలు పొందుతారు.  శ్రావణ  శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు. ఈ మాసంలో శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక బాధలు తీరతాయని.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. . . 

చంద్రుడు శ్రవణా న‌క్షత్రాన‌ సంచరించే స‌మ‌యంలో వ‌చ్చే మాసాన్ని శ్రావ‌ణ‌ మాసం అంటారు. విశిష్టమైన న‌క్షత్రాల‌లో శ్రవ‌ణం  ఒక‌టని జ్యోతిష్య నిపుణల అభిప్రాయం. అంతేకాదు అది శ్రీమ‌హావిష్ణువుకి జ‌న్మన‌క్షత్రం. స‌క‌ల వ‌రాల‌నూ ఇచ్చే  ఆ అనుగ్రహ దంప‌తుల‌ని సేవించుకునేందుకు ఇంత‌కంటే గొప్ప స‌మ‌యం ఇంకేముంటుంది! 

శ్రవ‌ణం  అంటే విన‌డం అన్న అర్థం కూడా ఉంది.   ఈ మాసంలో త‌న‌ని సేవించే వారి మొర‌ల‌ను అమ్మవారు త‌ప్పక ఆల‌కిస్తార‌ని న‌మ్మకం. అమ్మవారు మ‌న మొర‌ల‌ను విన‌డ‌మే కాదు, పెద్దలు చెప్పే అనుగ్రహ భాష‌ణ‌లను మ‌నం విని ఆచ‌రించ‌డానికి కూడా ఇది గొప్ప స‌మ‌య‌మని చెబుతుంటారు.  నూత‌న వ‌ధువు, అత్తవారింట అడుగుపెట్టాల‌న్నా.... శుభ‌కార్యాలు చేప‌ట్టాల‌న్నా....  గృహ‌నిర్మాణం వంటి ప‌నులు మొద‌లుపెట్టాల‌న్నా.... నోములు ఆచ‌రించాల‌న్నా... శ్రావ‌ణ మాసం అత్యుత్తమం.  అందులోనూ శ్రుక్రవారం అంటే ఇక చెప్పేదేముంది. స్త్రీల‌కు అయిదోత‌నాన్నీ, అష్టైశ్వర్యాల‌నీ అందించే అమ్మవారిని ఎంతో భ‌క్తితో కొలుచుకుంటారు. ఎప్పటిలాగే త‌న చ‌ల్లని చూపుని త‌మ మీద నిలిపి ఉంచాల‌ని కోరుకుంటారు.

ఆరోజు ఏం చేయాలంటే....

శ్రావ‌ణ శుక్రవారం రోజున సూర్యోద‌యానికి ముందుగానే నిద్రలేచి, అభ్యంగ‌న స్నాన‌మాచ‌రించాలి.  ఇంటి గ‌డ‌ప‌ల‌ను ప‌సుపు, కుంకుమ‌ల‌తో అలంకరించాలి.  ఎందుకంటే గుమ్మం లక్ష్మీదేవితో సమానం అనా అంటారు.  అమ్మవారిని పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పుష్పాల‌తో పూజించి... పాయసం, చ‌క్కెర‌పొంగ‌లి, ప‌ర‌మాన్నం వంటి నైవేద్యాల‌ను పెడతారు. వీటితోపాటు పూర్ణంబూరెల‌ను కూడా ప్రసాదంగా వండితే మంచిదంటారు పెద్దలు. 

ఇక మ‌ధ్యాహ్నం భోజ‌నానికి ఒక ముత్తయిదువను ఆహ్వానించాలి.  ఆమెను సాక్షాత్తూ ల‌క్ష్మీదేవిగా భావించి, భోజ‌నాది స‌త్కారాల‌తో సేవించి, తాంబూలంతో పాటు నూత‌న వస్త్రాల‌ను అందించాలి.  సాయంత్రం వేళ ముత్తయిదువల‌ను పేరంటానికి పిలిచి శ‌న‌గ‌లు, త‌మ‌ల‌పాకు, వ‌క్క, అర‌టిపండుల‌తో కూడిన తాంబూలాన్ని అందించి... త‌మకి ఆశీర్వాద బ‌లాన్ని అందించ‌వ‌ల‌సిందిగా వేడుకుంటారు. సాధార‌ణంగా శ్రావ‌ణ మాసంలో వ‌చ్చే రెండో శుక్రవారంనాడు ఆడ‌వారు వ‌ర‌ల‌క్ష్మీవ్రతాన్ని ఆచ‌రిస్తారు. అయితే రెండో వారం ఏద‌న్నా అవాంత‌రం వ‌స్తుంద‌నుకునే వారు అప్పటివ‌ర‌కూ వేచి ఉండ‌కుండా తొలి శుక్రవారంలోనే ఈ వ్రతాన్నీ ఆచ‌రిస్తారు. వ‌రాల‌ని ఒస‌గేందుకు ఆ త‌ల్లి సిద్ధంగా ఉంటే ప్రతి శుక్రవార‌ం వ‌ర‌ల‌క్ష్మిదే క‌దా....!