రేపటి నుంచి శ్రావణం వేడుకలు.. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

వేములవాడ, వెలుగు: శ్రావణ మాసం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో నెల రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహిళలు మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. శ్రావణ మాసంలో ఉపవాస దీక్షలతో స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నెలలో 4  సోమవారాలు, 4 శుక్ర వారాలు వస్తున్నాయి.. సోమవారాల్లో స్వామికి ఏకాదశి రుద్రాభిషేకం, మహలింగార్చన నిర్వహిస్తారు.  4 శుక్రవారాల్లో శ్రీరాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి చతుష్టోపచారములతో, శ్రీమహలక్ష్మీకి  ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.  

ఆగస్టు 31న రాఖీ పౌర్ణమి, వచ్చేనెల 6న గోకులాష్టమి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అద్దాల మండపంలో డోలోత్సవం, ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. 10వ తేదీన  శ్రావణ బహుళ ఏకదాశి  పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 13న పూర్ణహుతి, రుద్రయాగం, మహ లింగార్చన కార్యక్రమంతో శ్రావణ మాసం ఉత్సవాలు ముగుస్తాయి. శ్రావణమాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా అభిషేకం, అన్నపూజ,  ఇతర ఆర్జిత సేవల వేళల్లో మార్పులు ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు.