
- నైపుణ్య శిక్షణ బాధ్యతలు అప్పగిస్తం
- యువకులకు మొదటేడాదే లక్ష రూపాయలు
పెద్దపల్లి: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓ విజన్ ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు సన్నాహక సమావేశాన్ని పెద్దపల్లిలో నిర్వహించారు. ఈ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ వంశీ పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్నారన్నారు. ఆలోచనపరుడిగా ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చాడన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో రైతులందరికీ మేలు చేస్తామన్నారు. ధాన్యానికి మార్కెట్ కు అనుసంధానం చేస్తామని చెప్పారు. రైతులు దీక్ష చేస్తుంటే మోడీ ఉక్కు పాదంతో అణిచివేశారని ఫైర్ అయ్యారు.
రైతు దీక్షలో పేరుతో బీఆర్ఎస్ నాయకులు రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రైతులకు నీళ్లు అందించి ఆదుకుంటామన్నారు దేశంలో 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి రాహుల్ గాంధీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నైపుణ్య శిక్షణ కోసం యూనివర్సిటీ ప్రారంభించబోతున్నారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంశీ గెలిచిన తర్వాత నైపుణ్య శిక్షణ కోసం ఆయనకు ప్రత్యేకమైన బాధ్యతలు అప్పజెప్తామన్నారు. యువకులకు మొదటి సంవత్సరం ప్రత్యేక శిక్షణ కింద ఏడాదికి లక్ష రూపాయలు అందజేస్తామన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో గెలిచిన ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా వంశీ కూడా గెలిస్తే అందరికీ బలం చేకూరుతుందన్నారు. నియోజకవర్గ పరిధిలో 200 మంది యువకులకు నైపుణ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని తెరిచారన్నారు. చాలామంది యువకులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. సుల్తానాబాద్, పెద్దపల్లి బైపాస్ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే వాటికి బడ్జెట్ కేటాయిస్తామన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామన్నారు.