ఇప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తుపట్టని శ్రీతేజ్

ఇప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తుపట్టని శ్రీతేజ్
  • ట్యూబ్ ద్వారానే ఆహారం
  • హెల్త్ బులిటెన్ విడుదల

హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్​కు ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతోంది. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గత నెల రోజుల్లో ఒకటి రెండు రోజులు తప్ప మిగతా రోజులు వెంటిలేటర్ సాయం లేకుండానే శ్రీతేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆహారాన్ని అందించడానికి 10 రోజుల క్రితం ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ద్వారా శ్రీతేజ్ పొట్టలోకి ట్యూబ్ ను ఏర్పాటు చేశామని, ఆ ట్యూబ్ ద్వారా అవసరమైన పోషకాహారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

నరాలు, మెదడు పనితనంలో ఎలాంటి పురోగతి లేదని, ఇప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తుపట్టడం లేదని, సైగలను, మాటలను అర్థం చేసుకోవడం లేదని వివరించారు. నాడి సంబంధిత సమస్యలతో, తలభాగం పైకెత్తడానికి ఇబ్బంది పడుతున్నాడని తెలిపారు. ఫిజియోథెరపీ చికిత్స కొనసాగుతున్నట్లు వివరించారు.