ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. కనీస ధర రూ. 2 కోట్లతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా..సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరుపై పోటాపోటీగా వేలం పాల్గొన్నది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్ ఆక్షన్ లో భారీ ధరకు సొంతం చేసుకుంది.
స్టార్ ప్లేయర్ అయినప్పటికీ.. ఒక ఫాస్ట్ బౌలర్ కోసం 20 కోట్లకు పైగా వెచ్చించడం అనవసరమనే అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే కమ్మిన్స్ ను SRH యాజమాన్యం అంత పిచ్చిగా ఏమీ కొనలేదని అర్ధమవుతుంది. గత సీజన్ లో హైదరాబాద్ జట్టు చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్ ల్లో కేవలం 4 మ్యాచ్ ల్లోనే గెలిచి 10 ఓడిపోయింది. ఈ ఓటమికి కెప్టెన్ మార్కరం అనుభవం లేని తనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే కమిన్స్ ను కెప్టెన్ గా తీసుకునేటట్లు సన్ రైజర్స్ భావిస్తున్నట్టు సమాచారం. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం త్వరలోనే కమ్మిన్స్ ను అధికారికంగా సన్ రైజర్స్ కెప్టెన్ గా నియమించనున్నట్లు తెలుస్తుంది.
కమ్మిన్స్ అంతర్జాతీయ క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా పేరుంది. 2023 లో ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఆసీస్ కు అందించాడు. పదునైన పేస్ బౌలింగ్ వేయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో హిట్టింగ్ చేయగల సామర్ధ్యం ఉంది. కమ్మిన్స్ సన్ రైజర్స్ కెప్టెన్ అయితే ఇక తిరుగుండదు. కెప్టెన్ కోసమే కమ్మిన్స్ కు భారీ ధర వెచ్చించారని స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇదే జరిగితే ప్రస్తుత కెప్టెన్ మార్కరంకు నిరాశ ఖాయంగా కనిపిస్తుంది.
మార్కరం అద్భుతంగా ఆడుతున్నా.. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో వరుసగా రెండు టైటిల్స్ అందించినా.. అనుభవం లేకపోవడం, ఒత్తిడిలో జట్టును నడిపించలేకపోవడం ప్రతికూల అంశాలుగా మారాయి. ఐపీఎల్ 2024కు ఈ సఫారీ ఆటగాడిపై నమ్మకం చూపించకపోవచ్చు. ఒకవేళ కమ్మిన్స్ ను కెప్టెన్ గా ప్రకటిస్తే మార్కరం కు తుది జట్టులో చోటు దక్కడం కూడా కష్టమే. ఇప్పటికే ఆ జట్టులో ట్రావిస్ హెడ్, క్లాసన్, మార్కో జాన్సెన్, హసరంగా ఉన్నారు. వీరు మార్కరం కు గట్టి పోటీ ఇవ్వొచ్చు. మొత్తానికి కమ్మిన్స్ రాక మార్కరంను అయోమయంలోకి నెట్టేసింది.
Pat Cummins is likely to be appointed as the Captain of SRH in IPL 2024. [Cricbuzz] pic.twitter.com/vWlXFokRE7
— Johns. (@CricCrazyJohns) March 2, 2024