IPL 2024 auction: ఈ సారి తొందరపడలేదు: వేలంలో సన్ రైజర్స్ అదుర్స్

IPL 2024 auction: ఈ సారి తొందరపడలేదు: వేలంలో సన్ రైజర్స్ అదుర్స్

ఐపీఎల్‌ వేలం ముగిసింది. ఈ వేలంలో ఫ్రాంచైజీలు రూ. 230.65 కోట్లు వెచ్చించి మొత్తం 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్(రూ.24.75 కోట్లు) అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ ఆక్షన్ లో సన్ రైజర్స్ జట్టు స్టార్ ఆటగాళ్లను కొనేసి ఈ వేలంలో టాప్ గా నిలిచింది. 

వేలానికి ముందు సం రైజర్స్ ఖాతాలో 34 కోట్ల డబ్బు మిగిలి ఉంది. ఈ డబ్బును హైదరాబాద్ ఫ్రాంచైజీ చక్కగా వినియోగించినట్టుగానే కనిపిస్తుంది. మొదట ట్రావిస్ హెడ్ ను, పాట్ కమిన్స్, శ్రీలంక ఆల్ రౌండర్ హసరంగా లాంటి స్టార్ ప్లేయర్లను దక్కించుకుంది. ఈ ముగ్గురు కూడా మ్యాచ్ విన్నర్లే కావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.  

పాట్ కమిన్స్: 
 
ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ భారీ ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లు కాగా, సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా కమిన్స్ కు పేరుంది. 2023 లో ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఆసీస్ కు అందించాడు. పదునైన పేస్ బౌలింగ్ వేయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో హిట్టింగ్ చేయగల సామర్ధ్యం ఉంది.కమ్మిన్స్ సన్ రైజర్స్ కెప్టెన్ అయితే ఇక తిరుగుండదు. కెప్టెన్ కోసమే కమ్మిన్స్ కు భారీ ధర వెచ్చించారని స్పష్టంగా అర్ధం అవుతుంది.

 వనిందు హసరంగా:

శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా సన్ రైజర్స్ సొంతమయ్యాడు. రూ.1.5 కోట్ల ధరకు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం అతన్ని కైవసం చేసుకుంది. ఈ స్టార్ స్పిన్నర్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. గత సీజన్ లో ఆర్సీబీ జట్టుకు ఆడిన హసరంగాను బెంగళూరు జట్టు రిలీజ్ చేసింది. టాప్ క్లాస్ స్పిన్ బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల సత్తా హసరంగా సొంతం.

ట్రావిస్ హెడ్: 

వరల్డ్ కప్ హీరో, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ చేజిక్కించుకుంది. హెడ్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, అతని కోసం చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ జట్ల మధ్య పోటాపోటీ వార్ నడించింది. చివరకు అతన్ని సన్ రైజర్స్ 6 కోట్ల 80 లక్షలకు దక్కించుకుంది. సొంతం చేసుకుంది. సరైన ఓపెనర్ లేక  ఇబ్బంది పడుతున్న SRH హెడ్ ను తీసుకొని టాప్ ఆర్డర్ ను పటిష్టం చేసుకుంది.

మిడిల్ ఆర్డర్ లో త్రిపాఠి, మార్కరం, క్లాసన్ లాంటి ప్లేయర్లతో పటిష్టంగా కనబడుతున్న హైదరాబాద్ జట్టు హెడ్ లాంటి స్టార్ ఆటగాడు రావడంతో టైటిల్ పై దుర్బేధ్యంగా కనిపిస్తుంది. అభిషేక్ శర్మ లేదా మయాంక్ అగర్వాల్ తో హెడ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో హెడ్ భారీ సెంచరీతో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన సంగతి తెలిసిందే.