SRH vs GT: గుజ‌రాత్ చేతిలో స‌న్‌రైజ‌ర్స్ ఓటమి

SRH vs GT: గుజ‌రాత్ చేతిలో స‌న్‌రైజ‌ర్స్ ఓటమి

సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ పై బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పైచేయి సాధించింది. దీంతో అలవోకగా విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. గుజరాత్ బ్యాటర్లు మరో 5 బంతులు మిగిలివుండగానే దాన్ని చేధించారు. 

సాయి సుదర్శన్ యాంకర్ ఇన్నింగ్స్

స‌న్‌రైజ‌ర్స్ నిర్దేశించిన 162 ప‌రుగుల ఛేద‌న‌లో ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(36), వృద్దిమ‌న్ సాహాలు(25) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అచ్చొచ్చిన మైదానంలో గిల్ మ‌రింత ప్రమాద‌క‌రంగా క‌నిపించాడు. ఇద్ద‌రూ తొలి వికెట్‌కు 36 ప‌రుగులు జోడించారు. ఆ త‌ర్వాత కాసేప‌టికే గిల్‌ను మ‌యాంక్ బుట్టలో వేసుకున్నాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్(45) నిలకడగా ఆడుతూ గిల్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. సుదర్శన్- గిల్ జోడి రెండో వికెట్‌కు 38 ప‌రుగులు జోడించారు. ఆ తరువాత గిల్ వెనుదిరిగినా..  క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్(44; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) ధనాధన్ బ్యాటింగ్‌తో మ్యాచ్ గుజరాత్ వశం చేశాడు.

సమిష్టి విఫలం

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన హైద‌రాబాద్ బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు.  గుజ‌రాత్ టైటాన్స్ బౌలింగ్ దాడిని ఎదుర్కోలేక టాపార్డర్ చేతులెత్తేయ‌గా.. అభిషేక్ శ‌ర్మ‌(28), చివ‌ర్లో కుర్రాళ్లు అబ్దుల్ స‌మ‌ద్(29 నాటౌట్‌), ష‌హ్‌బాజ్ అహ్మద్‌(22)లు పోరాడారు. దీంతో సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.