
- దంచికొట్టిన నికోలస్ పూరన్.. రాణించిన శార్దూల్, మార్ష్
- హెడ్, అనికేత్ మెరుపులు వృథా
హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్–18లో సొంతగడ్డపై సన్ రైజర్స్‌కు తొలి దెబ్బ తగిలింది. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ (4/34), బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ (26 బాల్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70) విజృంభించడంతో ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 190/9 స్కోరు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (28 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 47), అనికేత్ వర్మ (13 బాల్స్‌లో 5 సిక్సర్లతో 36), నితీష్ కుమార్ రెడ్డి (28 బాల్స్‌లో 2 ఫోర్లతో 32), హెన్రిచ్ క్లాసెన్ (17 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 26) ఆకట్టుకున్నారు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం పూరన్‌కు తోడు మిచెల్ మార్ష్ (31 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) మెరుపులతో లక్నో 16.1 ఓవర్లలోనే 193/5 స్కోరు చేసి గెలిచింది. కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
శార్దూల్ దెబ్బ.. ఆదుకున్న హెడ్, అనికేత్
తొలి మ్యాచ్‌లో లీగ్‌లో రెండో అత్యధిక స్కోరుతో విజృంభించిన సన్ రైజర్స్ ఈసారి 200 మార్కు దాటలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్‌ను ఆరంభంలోనే శార్దూల్ ఠాకూర్ దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుస బాల్స్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (6), గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ (0)ను ఔట్ చేసి రైజర్స్‌కు షాకిచ్చాడు. శార్దూల్ షార్ట్ బాల్‌కు అభిషేక్.. పూరన్‌కు క్యాచ్ ఇవ్వగా, లెగ్ సైడ్ వెళ్తున్న బాల్‌ను వెంటాడిన ఇషాన్ కీపర్‌కు చిక్కడంతో స్టేడియం మొత్తం సైలెంట్‌గా మారింది. అదే ఓవర్లో చెరో ఫోర్ కొట్టిన ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. హెడ్ తన మార్కు షాట్లతో హిట్టింగ్ చేయగా.. నితీష్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. అవేశ్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదిన హెడ్ ఫ్యాన్స్‌లో మళ్లీ జోష్ నింపాడు. బిష్ణోయ్ వేసిన ఆరో ఓవర్లో అతనిచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో పూరన్ డ్రాప్ చేశాడు.
అప్పటికి తను 35 రన్స్ వద్ద ఉన్నాడు. అదే ఓవర్లో కవర్స్ మీదుగా సిక్స్ రాబట్టిన హెడ్ పవర్ ప్లేను 62/2తో ముగించాడు. భారీ స్కోరు చేసేలా కనిపించిన హెడ్ ను ఎనిమిదో ఓవర్లో ప్రిన్స్ యాదవ్ బౌల్డ్ చేయడంతో మూడో వికెట్‌కు 61 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మరో హార్డ్ హిట్టర్ క్లాసెన్ ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. భారీ సిక్స్, ఫోర్‌తో స్కోరు వంద దాటించాడు. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో మరో ఫోర్ రాబట్టిన క్లాసెన్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. నితీశ్ రెడ్డి కొట్టిన బాల్ బౌలర్ ప్రిన్స్ చేతికి తగులుతూ వికెట్లను పడగొట్టింది. నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో క్రీజు దాటిన క్లాసెన్ నిరాశగా వెనుదిరిగాడు. 15వ ఓవర్లో నితీష్ రెడ్డిని బిష్ణోయ్ బౌల్డ్ చేయడంతో రైజర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ టైమ్‌లో అనికేత్ వర్మ అనూహ్యంగా విజృంభించాడు. భారీ షాట్లతో సిక్సర్ల మోత మోగించాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లోనే వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన అతను రాఠి ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాది తర్వాతి బాల్‌కు మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. శార్దూల్ బౌలింగ్‌లో అభినవ్ మనో హర్ (2) ఔటైనా.. కెప్టెన్ కమిన్స్ (18) మూడు సిక్సర్లు బాదడంతో రైజర్స్ స్కోరు 200 దాటేలా కనిపించింది. కానీ, అవేశ్ బౌలింగ్‌లో రాఠికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగ్గా.. చివరి రెండు ఓవర్లలో శార్దూల్, అవేశ్ పది రన్స్ మాత్రమే ఇవ్వడంతో రైజర్స్ 190 స్కోరుతో సరిపెట్టింది.
పూరన్ ఫటాఫట్
ఫామ్‌లో ఉన్న నికోలస్ పూరన్ మరోసారి దంచికొట్టడంతో భారీ టార్గెట్‌ను లక్నో ఈజీగా ఛేజ్ చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ మార్‌క్రమ్ (1)ను షమీ ఔట్ చేసినా.. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ సపోర్ట్‌తో పూరన్ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకున్న అతను సిమర్‌జీత్ వేసిన మూడో ఓవర్లో 4,6,6 తో తన పరుగుల వేట మొదలు పెట్టాడు. షమీ వేసిన నాలుగో ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన మార్ష్.. అభిషేక్ బౌలింగ్‌లో ఫోర్‌తో స్కోరు 50 దాటించాడు. అదే ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన పూరన్.. కమిన్స్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు రాబట్టడంతో పవర్‌ప్లేలోనే లక్నో 77/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ మారిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్ ఆడమ్ జంపాకు పూరన్ రెండు సిక్సర్లు, ఫోర్‌తో స్వాగతం పలికాడు. ఈ క్రమంలో తను 18 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... ఎనిమిదో ఓవర్లోనే స్కోరు వంద దాటింది. సెంచరీ చేసేలా కనిపించిన పూరన్‌ను తర్వాతి ఓవర్లో కమిన్స్ ఎల్బీ చేయడంతో రెండో వికెట్‌కు 116 (43 బాల్స్‌లో) పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. పూరన్ ఔటైన తర్వాత మార్ష్ ఒక్కసారిగా స్పీడు పెంచే ప్రయత్నం చేశాడు. కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో 30 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ, తర్వాతి బాల్‌కే నితీష్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికే మ్యాచ్ లక్నో చేతుల్లోకి వెళ్లింది. కెప్టెన్ రిషబ్ పంత్ (15), ఆయుష్ బదోనీ (6) కూడా వెనుదిరిగినా.. మిల్లర్ (13 నాటౌట్) తోడుగా అబ్దుల్ సమద్ (22 నాటౌట్) రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి గెలుపు లాంఛనం పూర్తి చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
సన్ రైజర్స్: 20 ఓవర్లలో 190/9 (హెడ్ 47, అనికేత్ 36, నితీశ్ రెడ్డి 32, శార్దూల్ 4/34). లక్నో: 16.1 ఓవర్లలో 193/5 (పూరన్ 70, మార్ష్ 52, కమిన్స్ 2/29).
తమన్ షో అదుర్స్
ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇస్తున్న వేదికల్లో ఆరంభ వేడుకల్లో భాగంగా ఈ మ్యాచ్‌కు ముందు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పెర్ఫామెన్స్ చేశాడు. తాను మ్యూజిక్ ఇచ్చిన పలు సినిమా పాటలతో అభిమానులను అలరించాడు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ ఈవెంట్‌లో మొదట గ్రౌండ్‌లో వేసిన స్టేజ్‌పై పెర్ఫామెన్స్ చేసిన తమన్ తర్వాత స్పెషల్ కార్ట్ కారులో గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు.అప్పటికే స్టేడియం నిండిపోగా.. తమన్ పాటలకు అభిమానులూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఎల్‌ఈడీ లైటింగ్ షో కూడా ఆకట్టుకుంది. ఇన్నింగ్స్ మధ్యలో ఫ్లడ్ లైట్స్ ఆర్పేసి చీకట్లో లేజర్ లైటింగ్ షో, ఫైర్ వర్క్స్ ను అభిమానులు ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్‌కు 35,766 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.