SRH vs PBKS: బౌలింగ్లో తేలిపోయిన హైదరాబాద్.. షమీని ఉతికి ఆరేశారుగా..!

SRH vs PBKS: బౌలింగ్లో తేలిపోయిన హైదరాబాద్.. షమీని ఉతికి ఆరేశారుగా..!

వరుస ఓటములతో పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున ఉన్న సన్ రైజర్స్ బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ అదే పరిస్థితి అని నిరూపించుకున్నారు.  బ్యాట్స్ మెన్ కుప్పకూలి కనీసం టార్గెట్ ఇవ్వలేనప్పుడు.. ఛేదనలో కనీసం పోటీ ఇవ్వనప్పుడు బౌలర్లు మాత్రం ఏం చేస్తారు అని ఇన్నాళ్లు అనుకున్నారు ఫ్యాన్స్. కానీ శనివారం (ఏప్రిల్ 12) పంజాబ్ తో మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు భారీ స్కోరు సమర్పించుకున్న విధానం చూస్తే.. బ్యాటర్లే కాదు.. బౌలర్లు కూడా దొందు దొందే..ఏం తక్కువ తినలేదు అనుకోవాల్సిందే.   

ముఖ్యంగా ఈ సీజన్ లో 10 కోట్ల రూపాయలు పెట్టి తీసుకున్న షమీ.. ఇవాళ్టి మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు. షమీ బౌలింగ్ లో ఉతికి ఆరేశారనే చెప్పాలి. మొత్తం నాలుగు ఓవర్లేసిన షమీ.. 18.75 ఎకానమీతో 75 రన్స్ సమర్పించుకున్నాడు. ముఖ్యంగా లాస్ట్ ఓవర్ లో  స్టోయినిస్ వరుసగా నాలుగు సిక్సులు కొడుతుంటే నోరు తెరవడం తప్ప చేసేదేమీ లేదు అన్నట్లు అయిపోయింది పరిస్థితి. ఇన్నింగ్స్ కు కీలకమైన చివరి ఓవర్.. కాస్త అనుభవం ఉన్న బౌలర్ అని షమీకి బాల్ ను ఇస్తే.. దారుణంగా లూస్ బాల్స్ వేసి.. పేలవ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు సిక్సులతో కలిపుకుంటే చివరి ఓవర్ లో ఏకంగా 27 రన్స్ ఇచ్చాడు షమీ. దీనికి తోడు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ఆలోచించాల్సిన పరిస్థితి. 

మిగతా బౌలర్లు కూడా తక్కువేం తినలేదు. ఎంత బ్యాటింగ్ పిచ్ అయితే మాత్రం.. ఇంత ఘోరంగా పరుగులు సమర్పించుకోవడం దారుణంగా కనిపించింది. పవర్ ప్లేలో.. స్లాగ్ ఓవర్లలో దారుణంగా పరుగులు ఇచ్చుకున్నారు. మంచిగ లడ్డూలాగ బాల్స్ ను స్లాట్ లో వేయడం తప్ప.. వైడ్ వెళ్లినా పర్లేదు ఆఫ్ లెంత్ బాల్స్ వేసి బౌండరీలను తగ్గిద్దామనే ఆలోచన ఎవరికీ లేనట్లు కనిపించింది. SRH బౌలింగ్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించలేదు అనేది స్పష్టంగా కనిపించింది.  ఏ ఒక్కరు కూడా 10 ఎకనామీకి తగ్గకుండా పరుగులు సమర్పించుకున్నారు. అయితే హర్షల్ పటేల్ ఒక్కడే నాలుగు వికెట్లు తీసి కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. ఇషాన్ మలింగ 2 వికెట్లు తీసి పర్లేదు అనిపించుకున్నాడు. 

హైదరాబాద్ బౌలర్ల పేలవ ప్రదర్శనకు పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ఇచ్చిన అద్భుతమైన ఆరంభానికి తోడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్( 32 బంతుల్లో 86:6 ఫోర్లు,6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది.