SRH vs RR: కోల్‌క‌తాను ఢీకొట్టేది ఎవ‌రు? స‌న్‌రైజ‌ర్స్‌ vs రాజ‌స్థాన్‌ల‌లో గెలుపెవరిది?

గత రెండు నెలలుగా అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ వస్తోన్న ఐపీఎల్ పదిహేడో సీజన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. మే 26న, ఆదివారం చెన్నైలోని చెపాక్ గడ్డపై జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ సమాప్తం కానుంది. అయితే, అంతకంటే ముందు తుది పోరులో తలపడే మరో జట్టు ఏదన్నది నేడు తేలనుంది. శుక్రవారం(మే 24) క్వాలిఫ‌య‌ర్ 2లో భాగంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డ‌నున్నాయి. మరి ఈ సమఉజ్జీవుల పోరులో ఎవరు గెలవబోతున్నారు..? ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.. 

ఓపెనర్లపైనే ఆశ‌లు

ఈ సీజన్‌లో స‌న్‌రైజ‌ర్స్ జట్టు క్వాలిఫ‌య‌ర్-2 వరకు చేరిందంటే అందుకు కారణం ఓపెనర్లు.. ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శ‌ర్మ‌. ఈ జోడి తమ మెరుపు బ్యాటింగ్‌తో హైదరాబాద్ జట్టుకు అద్భుత విజ‌యాలు అందించారు. మరోసారి వీరిద్దరూ రాణిస్తే ఆరంజ్ ఆర్మీ ఫైనల్‌లో అడుగుపెట్టడం ఖాయం. వీరితో పాటు నితీష్ రెడ్డి, క్లాసెన్ బ్యాట్ ఝుళిపిస్తే బ్యాటింగ్ కష్టాలు తీరినట్లే. ఈ న‌లుగురిపైనే స‌న్‌రైజ‌ర్స్ విజయం ఆధారపడి ఉంది. బ్యాటర్లు రాణిస్తే.. బౌలర్లు భువనేశ్వర్, నటరాజన్, కమ్మిన్స్ తమ వంతు సహకారం అందిస్తారు. అలా కాకుండా, గత మ్యాచ్‌లో చేసిన పొర‌పాట్లు పునరావృతం చేస్తే స‌న్‌రైజ‌ర్స్ ఇంటికి వెళ్లడం ఖాయం.

ఆ ఒక్కడే కాపాడుతున్నాడు..

మ‌రోవైపు బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ రాజ‌స్థాన్ బలంగా ఉంది. లీగ్ ద‌శ‌లో వ‌రుస విజ‌యాల‌తో ప్రత్యర్థుల‌ను బెంబేలెత్తించిన రాయల్స్.. ప్లేఆఫ్స్ ముందు త‌డ‌బ‌డింది. చివరకు ఆ ఓట‌ముల నుంచి తేరుకోని క్వాలిఫ‌య‌ర్ 2 చేరుకుంది. రాజస్థాన్ పేపర్‌పై బలంగా ఉన్నప్పటికీ.. వారి బ్యాటింగ్‌లో నిలకడ లేదు. య‌శ‌స్వి జైస్వాల్, సంజూ శాంస‌న్‌ ఎప్పుడు రాణిస్తారో వారికే తెలియదు. రియాన్ పరాగ్ ఒక్కడు ఆ జట్టులో నిలకడగా ఆడుతున్నాడు.  

ట్రెంట్‌ బౌల్ట్‌, సందీప్ శర్మ, ఆవేశ్‌ఖాన్‌, అశ్విన్‌, చాహ‌ల్‌ల‌తో కూడిన రాజ‌స్థాన్ బౌలింగ్ లైనప్ మాత్రం దుర్భేద్యంగా కనిపిస్తోంది. వీరిని ఎదుర్కోవడం హైదరాబాద్ బ్యాటర్లకు అంత తేలికైన విషయం కాదు. ఎదురుదాడికి దిగడం కాకుండా.. సరైన వ్యూహాలు రచించాలి.  

ఇరు జట్ల మధ్య రికార్డులు

ఇప్పటివరకూ ఈ ఇరు జట్లు 19సార్లు తలపడగా.. హైదరాబాద్‌ 10,రాజస్థాన్‌ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇక ప్లేఆఫ్స్‌లో రాయల్స్, సన్‌రైజర్స్ తలపడిన సందర్భాలు ఒకే ఒక్కటి. 2013లో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ని ఓడించింది. 

జట్లు (అంచ‌నా)

స‌న్‌రైజ‌ర్స్: ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శ‌ర్మ‌, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మ‌ద్‌, హెన్రిచ్ క్లాసెన్‌, అబ్దుల్ స‌మ‌ద్‌, పాట్ క‌మిన్స్‌(కెప్టెన్), భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, న‌ట‌రాజ‌న్‌, విజ‌య్ కాంత్‌.

రాజ‌స్థాన్: య‌శ‌స్వి జైస్వాల్‌, టామ్ కాడ్‌మోర్‌, సంజూ శాంస‌న్(కెప్టెన్), రియాన్ ప‌రాగ్‌, ధ్రువ్ జురెల్, రోవ్ మెన్ పావెల్‌, రవిచంద్రన్ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహ‌ల్‌, ఆవేశ్ ఖాన్‌, ట్రెంట్ బౌల్ట్‌, సందీప్ శ‌ర్మ‌.