
హైదరాబాద్: అద్భుతమైన బ్యాటింగ్ లైనప్.. అనుభవజ్ఞులైన బౌలర్లు..సమతుల్యంతో కూడిన జట్టుతో గత ఎడిషన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్–18కు రెడీ అయ్యింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారీ స్కోరును అందించాలని చూస్తున్నారు. గత సీజన్‌లో మూడుసార్లు 250కి పైగా స్కోరు చేసిన హైదరాబాద్ ఈ సీజన్‌లో 300 రన్స్ కొట్టాలనే లక్ష్యంతో ఉంది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ గాయం నుంచి కోలుకోవడం రైజర్స్ బలాన్ని రెట్టింపు చేసింది. కెప్టెన్ కమ్ పేసర్ కమిన్స్‌తో పాటు మహ్మద్ షమీపై బౌలింగ్ భారం ఎక్కువగా ఉండనుంది.
స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాడు. మరోవైపు హైదరాబాద్‌తో పోలిస్తే రాజస్తాన్ కాస్త బలహీనంగా కనిపిస్తున్నది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తప్ప రాయల్స్ బౌలింగ్‌లో పెద్దగా పదును కనిపించడం లేదు. కెప్టెన్ సంజూ శాంసన్ వేలి గాయం నుంచి కోలుకున్నా అతని ఫామ్‌పై ఆందోళన కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌కు రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగినా ఆశ్చర్యం లేదు. బట్లర్ లేకపోవడం రాయల్స్ బ్యాటింగ్ బలహీనంగా మారింది. హెట్‌మయర్, ధ్రువ్ జురెల్, నితీష్ రాణా, యశస్వి జైస్వాల్ వంటి హిట్టర్లపై రాజస్తాన్ ఎక్కువగా ఆధారపడి ఉంది. గత సీజన్‌లో రాజస్తాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన హైదరాబాద్ ఈసారి కూడా ఫేవరెట్‌గా ఉంది.