ఉప్పల్‌‌‌‌లో మళ్లీ సన్ రైజ్‌‌‌‌..చెన్నైకి చెక్

ఉప్పల్‌‌‌‌లో మళ్లీ సన్ రైజ్‌‌‌‌..చెన్నైకి చెక్
  •     6 వికెట్లతో హైదరాబాద్ గెలుపు
  •     సత్తా చాటిన బౌలర్లు
  •     దంచికొట్టిన మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌, అభిషేక్‌‌‌‌

సొంతగడ్డపై సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ హైదరాబాద్ సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌ చేస్తోంది. గత పోరులో రికార్డు స్కోరుతో ముంబై ఇండియన్స్‌‌‌‌ను మట్టికరిపించిన రైజర్స్‌‌‌‌ ఇప్పుడు డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ చెన్నై సూపర్ కింగ్స్ పని పట్టింది. అభిమానులు ప్రత్యర్థికి సీఎస్కేకు సపోర్ట్ ఇచ్చినా,  ధోనీ పేరు జపిస్తూ స్టేడియం మొత్తం పసుపు జెండాలతో కనిపించినా.. బౌలింగ్‌‌‌‌, బ్యాటింగ్‌‌‌‌లో అదరగొట్టిన హైదరాబాద్ చెన్నైకి చెక్ పెట్టింది. 


హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఆల్‌‌‌‌రౌండర్ షోతో సత్తా చాటిన సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ హోమ్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో వరుసగా రెండో మ్యాచ్‌‌‌‌లోనూ గెలిచింది. సూపర్ బౌలింగ్‌‌‌‌కు తోడు ఐడెన్‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ ( 36 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 50), అభిషేక్ శర్మ (12 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 37) మెరుపులతో ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో 6 వికెట్ల తేడాతో సీఎస్కేను ఓడించింది.  తొలుత సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 165/5 స్కోరు చేసింది. శివం దూబే (24 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45) మెరుపులు మెరిపించగా, అజింక్యా రహానె (35), రవీంద్ర జడేజా (31 నాటౌట్‌‌‌‌) రాణించారు. అనంతరం రైజర్స్ 18.1 ఓవర్లలోనే 166/4 స్కోరు చేసి గెలిచింది. మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌, అభిషేక్‌‌‌‌కు తోడు ట్రావిస్ హెడ్ (31) కూడా రాణించాడు. అభిషేక్‌‌ కు   ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

దూబే మెరిసినా 

టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన సీఎస్కే ఆరంభంలో జోరు చూపెట్టినా.. తర్వాత తడబడింది. చివరి 7 ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసిన హైదరాబాద్ బౌలర్లు ఆ టీమ్‌‌‌‌ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (12), రుతురాజ్ గైక్వాడ్ (26) తొలి వికెట్‌‌‌‌కు మూడు ఓవర్లలో 25 రన్స్‌‌‌‌ జోడించి మంచి ఆరంభమే ఇచ్చారు. నాలుగో ఓవర్లో రచిన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసిన భువనేశ్వర్ ఒకే పరుగు ఇచ్చాడు.

అయితే, వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన రహానె స్టార్టింగ్‌‌‌‌లో భారీ షాట్లతో సత్తా చాటాడు. కమిన్స్‌‌‌‌ ఓవర్లో డీప్ మిడ్‌‌‌‌ వికెట్‌‌‌‌ మీదుగా సిక్స్‌‌‌‌ కొట్టాడు. భువీ బౌలింగ్‌‌‌‌లో గైక్వాడ్ 4,6తో వేగం పెంచడంతో పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలో సీఎస్కే 48/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన స్పిన్నర్ షాబాజ్‌‌‌‌ తొలి బాల్‌‌‌‌కే గైక్వాడ్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేశాడు. కానీ, నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన శివం దూబే భారీ షాట్లతో రెచ్చిపోయాడు. అదే ఓవర్లో వరుసగా 6,4తో టచ్‌‌‌‌లోకి వచ్చిన అతను.. మరో స్పిన్నర్ మయాంక్ మార్కండే ఓవర్లోనూ ఫోర్, సిక్స్‌‌‌‌ రాబట్టాడు.

తర్వాతి రెండు ఓవర్లలో కమిన్స్, ఉనాద్కట్‌‌‌‌ పొదుపుగా బౌలింగ్‌‌‌‌ చేయగా రహానె నెమ్మదించాడు. కానీ,  నటరాజన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో దూబే వరుసగా రెండు సిక్సర్లు కొట్టి స్కోరు వంద దాటించాడు. 13 ఓవర్లకు సీఎస్కే 115/2తో నిలవగా.. దూబే జోరు చూస్తుంటే  ఆ టీమ్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, ఇక్కడి నుంచి ఆతిథ్య బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. 14వ ఓవర్లో స్లో బౌన్సర్‌‌‌‌‌‌‌‌తో దూబేను  కమిన్స్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేయగా.. ఆ వెంటనే స్లో ఆఫ్‌‌‌‌ కట్టర్‌‌‌‌‌‌‌‌తో రహానె ఉనాద్కట్‌‌‌‌ పెవిలియన్ చేర్చాడు.

స్లాగ్ ఓవర్లలో రైజర్స్‌‌‌‌ పేసర్లు జడేజా, హిట్టర్ డారిల్ మిచెల్‌‌‌‌ (13) భారీ షాట్లు ఆడకుండా కట్టడి చేశారు. నటరాజన్ వేసిన చివరి ఓవర్లో  మూడో బాల్‌‌‌‌కు డారిల్‌‌‌‌.. షాట్‌‌‌‌కు ట్రై చేసి సమద్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో ఫ్యాన్స్ కేరింతల మధ్య ధోనీ (1 నాటౌట్‌‌‌‌) క్రీజులోకి వచ్చాడు. తన ఫస్ట్ బాల్‌‌‌‌ను మిస్సై.. రెండో బాల్‌‌‌‌కు సింగిల్ తీశాడు. ఇన్నింగ్స్ లాస్ట్ బాల్‌‌‌‌ను జడేజా బౌండ్రీకి తరలించాడు.  రైజర్స్‌‌‌‌ బౌలర్లో భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్‌‌‌‌, షాజాబ్, ఉనాద్కట్ తలో వికెట్‌‌‌‌ పడగొట్టారు.

సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి మ్యాచ్‌‌‌‌ చూశారు. హీరో వెంకటేశ్ పక్కన కూర్చున్న ఆయన స్టేడియంలో ఫ్యాన్స్‌‌‌‌కు అభివాదం చేశారు. పలువురికి  సెల్ఫీలు ఇచ్చారు. మ్యాచ్ ముగిశాక ప్రెజెంటేషన్ సెర్మనీలో అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందజేశారు. మంత్రులు శ్రీధర్‌‌‌‌ బాబు, పొన్నం ప్రభాకర్, హీరో చిరంజీవి, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తదితరులు కూడా మ్యాచ్‌కు  హాజరయ్యారు.

అభిషేక్, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ ధనాధన్

సాధారణ టార్గెట్‌‌‌‌ను సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ ఈజీగా చేజ్ చేసింది. యంగ్‌‌‌‌స్టర్ అభిషేక్ దంచికొట్టడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలోనే మ్యాచ్‌‌‌‌ను వన్‌‌‌‌సైడ్‌‌‌‌ చేసేంది. ఇంపాక్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన ట్రావిస్ హెడ్‌‌‌‌తో తొలి వికెట్‌‌‌‌కు 17 బాల్స్‌‌‌‌లోనే 49 రన్స్ జోడించిన అభిషేక్‌‌‌‌ విజయానికి పునాది వేశాడు. దీపక్ చహర్ వేసిన ఇన్నింగ్స్‌‌‌‌ రెండో బాల్‌‌‌‌కే ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను స్లిప్‌‌‌‌లో మొయిన్ అలీ డ్రాప్‌‌‌‌ చేయడంతో బతికిపోయిన హెడ్‌‌‌‌ ఆరో బాల్‌‌‌‌కు సిక్స్‌‌‌‌తో హిట్టింగ్ షురూ చేశాడు.

ముకేశ్ చౌదరి వేసిన రెండో ఓవర్లో అభిషేక్ భారీ షాట్లతో రెచ్చిపోయాడు.  4, 6, 6,6, 4తో  27 రన్స్‌‌‌‌ రాబట్టాడు. దీపక్ బౌలింగ్‌‌‌‌లోనూ 6, 4తో అలరించాడు. అదే ఊపులో మరో షాట్‌‌‌‌కు ట్రై చేసి జడేజాకు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. కానీ, ఈ ఆనందం సీఎస్కేకు ఎంతో సేపు నిలువలేదు. హెడ్‌‌‌‌కు తోడైన మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌ కూడా వరుస షాట్లతో విజృంభించాడు. తీక్షణ ఓవర్లో అతను రెండు ఫోర్లు కొట్టగా.. దేశ్‌‌‌‌పాండే బౌలింగ్‌‌‌‌లో హెడ్ రెండు, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ ఓ బౌండ్రీ రాబట్టాడు. దాంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేను సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ 78/1తో ముగించింది.

ఫీల్డింగ్ మారిన తర్వాత సీఎస్కే స్పిన్నర్లు హోమ్‌‌‌‌టీమ్ బ్యాటర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మార్‌‌‌‌‌‌‌‌ క్రమ్ అదే జోరు కొనసాగించడంతో 9 ఓవర్లకే స్కోరు వంద దాటింది. పదో ఓవర్లో హెడ్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసిన తీక్షణ సీఎస్కేకు కీలక బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి చెన్నై బౌలర్లు పొదుపుగా బౌలింగ్‌‌‌‌ చేశారు. వరుసగా ఐదు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వలేదు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌తో పాటు షాబాజ్‌‌‌‌ (18)ను ఔట్‌‌‌‌ చేసిన అలీ సీఎస్కే టీమ్‌‌‌‌లో ఆశలు రేపాడు. కానీ, సాధించాల్సిన రన్స్‌‌‌‌ తక్కువగా ఉండటంతో క్లాసెన్‌‌‌‌ (10 నాటౌట్‌‌‌‌)తో కలిసి అరంగేట్రం కుర్రాడు నితీష్ రెడ్డి (14 నాటౌట్‌‌‌‌) టార్గెట్‌‌‌‌ను కరిగించాడు. చహర్ బౌలింగ్‌‌‌‌లో భారీ సిక్స్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ను ముగించాడు.

సంక్షిప్త స్కోర్లు

చెన్నై : 20 ఓవర్లలో 165/5 (దూబే 45, రహానె 35, షాబాజ్ 1/11).

హైదరాబాద్‌ :  18.1 ఓవర్లలో 166/4 (మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ 50, అభిషేక్ 37, అలీ 2/23).