
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో కొలువుదీరిన భ్రమరాంబికాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్ధం ఏటా చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. .ఆలయ సంప్రదాయ ఆచారాల్లో భాగంగా పూర్వం చెంచులకు అతి ముఖ్యమైన ఉత్సవం. కాల క్రమేణా ఇప్పుడు అందరి ఉత్సవంగా ఊరి పండుగగా మారింది. కుంభోత్సవంలో భాగంగా ఏప్రిల్ 15 వ తేదీ మంగళవారం రోజున అమ్మవారికి గుమ్మడి కాయలు, నిమ్మకాయలు సాత్విక బలిగా సమర్పిస్తారు. ఆలయానికి నిమ్మకాయలతో అలంకరణ చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు
ఉదయం 7.30 గంటలకు మొదటి విడుత సాత్విక బలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాలు సమర్పిస్తారు. సాయంత్రం స్త్రీ వేషధారణలో అమ్మవారికి కుంభహారతి సమర్పించనున్నారు. ఆ తర్వాత తొమ్మిది రకాల వంటలతో మహా నివేదన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. హారతి అనంతరం భక్తులను అమ్మవారి నిజరూప దర్శనానికి అనుమతిస్తారు. కుంభోత్సవం నేపథ్యంలో అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్వామివారి కల్యాణోత్సవం, ఏకాంత సేవలను అధికారులు నిలిపివేశారు.
కుంభోత్సవం ఎందుకు చేస్తారంటే..
భ్రమరాంభ అమ్మవారు లోకాన్ని.. ప్రజలను చల్లగా చూసేందుకు లోకక ల్యాణం కోసం కుంభోత్సవం నిర్వహిస్తారు. అతివృష్టి, అనావృష్టి నుంచి కాపాడాలని సకాలంలో వర్షాలు పడి.. పంటలు బాగా పండి.. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. ఇంకా అంటువ్యాధులు ప్రబలకుండా, చిన్నపిల్లలకు తట్టు, ఆటలమ్మ తదితర వ్యాధులు సోకకుండా ఉండేందుకు... భూతాలు, పిశాచాలు, ప్రేతాలు జనులను పీడించకుండా ఉండేందుకు కుంభోత్సవం నిర్వహిస్తారు..
ఏడాదిలో ఒక్క రోజే నిజరూప దర్శనం..
కుంభోత్సవం రోజు మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం ఇస్తారు. ఎనిమిది చేతులలో వివిధ ఆయుధాలను ధరించి ఉన్న భ్రమరాంబాదేవి వారు రోజూ అలంకారమూర్తిగా దర్శనమిస్తారు. అమ్మవారికి స్వర్ణముఖకవచం ఆలంకరింపబడి ఉంటుంది. సంవత్సరంలో ఒక్క కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారి ముఖానికి కవచాలంకరణ ఉండదు. ఆ రోజున భక్తులు అమ్మవారి నిజరూప దర్శనాన్ని చేసుకోవచ్చు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని స్థానికులందరు అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయం అంతా పలురకాల పుష్పాలతో, నిమ్మకాయల దండలతో, వేపమండలతో అలంకరిస్తారు.
కుంభోత్సవం ఎప్పటి నుంచి అంటే..
పూర్వం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో హరిహరరాయ గోపురం వద్ద ప్రాకారంపై ఉన్న మహిషాసురమర్దిని ప్రాసురమర్దిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజాదికాలను జరిపించి కోళ్లు, మేకలను కుంభోత్సవం జరిపొ రాత్రి బలిచ్చేవారు. కాల క్రమేణా స్వాతిక బలిదిశకు ఈ ఉత్సవం చేరుకుంది. ప్రస్తుతం వేలకొద్ది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు అమ్మవారికి సమర్పిస్తారు. దాదాపు 6వ శతాబ్దంలో సాక్షాత్తూ ఆదిశంకరాచార్యులు వామాచార (బలుల) సంప్రదాయానికి స్వస్తి చెబుతూ దక్షిణాచార (సాత్వికబలి) సంప్రదాయాన్ని కొనసాగేలా అమ్మవారి ఉగ్రరూపాన్ని ఉపసంహరించి శ్రీచక్రాన్ని ఏర్పాటు చేశారని ఆలయ చర్రిత చెబుతోంది.