
ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. కాలేజీకి వెళ్ళమని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ( ఫిబ్రవరి 21 ) జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్డులో ఉన్న శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న యోగితా నందిని అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్ లో సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీకి వెళ్ళమని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడమే యోగితా నందిని ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.
గత 20రోజులుగా స్వస్థలం ఎటపాకలో ఉంటున్న యోగితా నందిని.. కాలేజీకి వెళ్లకుండా ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తానని మారాం చేస్తుండగా ఖచ్చితంగా కాలేజీకి వెళ్లాల్సిందేనని పేరెంట్స్ ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. బలవంతం మీద రెండు రోజుల క్రితం కాలేజీకి వచ్చిన యోగితా నందిని హాస్టల్ ఉరేసుకొని కనిపించింది.
వ్యక్తిగత సమస్య ఉందని చెప్పి..
ఇవ్వాళ ( ఫిబ్రవరి 21, 2025 ) ఉదయం వ్యక్తిగత సమస్య ఉందని, హాస్టల్ కి వెళ్లి బట్టలు మార్చుకొని వస్తానని వెళ్లిందని.. స్టోర్ రూమ్ తాళంచెవి తీసుకెళ్లి గడియ పెట్టుకుందని విద్యార్థులు తెలిపారు. ఎంతసేపటికీ రాకపోవడంతో హాస్టల్ వార్డెన్ స్టోర్ రూమ్ తలుపు పగులగొట్టి చూడగా.. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినట్లు తెలిపారు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు వైద్యులు.
కూతురు మరణంతో యోగిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. యోగిత తమ బలవంతం మీద కాలేజీకి వచ్చిందని.. బాగా చూసుకోవాలని గురువారం ( ఫిబ్రవరి 20 ) కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ తో ఫోన్లో మాట్లాడానని.. ఇంతలోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని యోగిత తండ్రి వాపోతున్నారు.