- ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం
వేములవాడ, వెలుగు: నేటి నుంచి శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వేములవాడ రాజన్న ఆలయంలో తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు భక్తులకు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వనున్నారు. మొదటిరోజు శైలపుత్రి అలంకారం, , రెండో రోజు బ్రహ్మచారిణి, 3వ రోజు చంద్రఘంట, 4వ రోజు కూష్మాండ, 5వ రోజు స్కందమాత, 6వ రోజు కాత్యాయిని, 7వ రోజు కాళరాత్రి, 8వ రోజు మహగౌరి, 9వ రోజు సిద్దిదా, శ్రీ రాజరాజేశ్వర దేవీ, మహలక్ష్మీ అలంకారంలో దర్శనం ఇస్తారు.
22న మహిషాసురా మర్దినీ అమ్మవారికి మహాపూజ నిర్వహిస్తారు. ధర్మగుండంలో స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. 23న మహార్నవమి, విజయదశమి సందర్భంగా ఆయుధపూజ, పూర్ణాహుతి, బలిహరణం వంటివి ఉంటాయి. రాత్రి స్వామివారి పెద్దసేవ (అంబారీ సేవ), స్వామివారి అమ్మ వార్ల శమీయాత్ర నిర్వహించనున్నారు.
అమ్మవారికి మహాభిషేకం
కరీంనగర్ రూరల్, వెలుగు: శ్రీదుర్గాభవానీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా శనివారం కరీంనగర్ మండలం నగునూర్‌లోని పరివార సమేత శ్రీదుర్గాభవానీ ఆలయంలో అమ్మవారికి విశేష ద్రవ్యాలతో మహాభిషేకం నిర్వహించారు. అనంతరం నవరాత్రోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజల్లో ఆలయ ఫౌండర్ వంగల లక్ష్మణ్, భక్తులు పాల్గొన్నారు.